విజ్ఞానకోశము - 3
గ్రీసుదేశము (చ)
తమ శిల్ప చిత్రలేఖన కళలను, ప్రకృతి శాస్త్రవిజ్ఞానమును అభివృద్ధిచేసికొనిరి. నూతన సారస్వతమును సృష్టించిరి. భూగోళ శాస్త్రజ్ఞానము ద్వారమున ప్రపంచము యొక్క నిజస్వరూపమును తెలిసికొని, నూతన ఖండములను, ప్రదేశములను, కనుగొనిరి. కాని ఆధునిక ఐరోపా జాతులవారికి, ఆచార్యతుల్యులగు గ్రీకులు మాత్రము మతాంతరులగు మహమ్మదీయుల పాలనకు లోనై పెక్కు కష్టములను అనుభవించిరి. 18 వ శతాబ్ది ప్రారంభము నుండి అట్టోమాను సామ్రాజ్యము క్షీణింపసాగెను. ఆ శతాబ్ది తుది భాగమున ఫ్రెంచి స్వాతంత్ర్య విప్లవము చెలరేగెను. ఈ కారణములచే గ్రీకు దేశమున స్వాతంత్ర్య కాంక్ష హెచ్చెను. వారు తమ పాలకులగు తురుష్కులపై తిరుగుబాట్లు సాగించిరి. తురుష్కులు ఈ తిరుగుబాట్లను మిక్కిలి కాఠిన్యముతో అణచి వైచుటకు యత్నించిరి. కాని ఫలితము లేదయ్యెను. పశ్చిమ ఐరోపాదేశముల నుండి అనేకులు స్వచ్ఛంద సేవకులు గ్రీకుల సహాయమునకై పోసాగిరి. అట్టి స్వచ్ఛంద సేవకులలో అంగ్ల కవిపుంగవుడగు బైరన్‌ప్రభువు ఒకడు. ఇతడు గ్రీకు స్వాతంత్ర్యము కొరకు పోరాడుచు అసువులను బాసెను. ఐనను తురుష్కులు గ్రీసుదేశమునకు స్వాతంత్ర్యము నొసగరైరి. తుదకు బ్రిటను, ఫ్రాన్సు, రష్యాదేశములు ఏకమై తురుష్కులను రణరంగమున నోడించెను. 1829 వ సంవత్సరమున తురుష్క సుల్తాను గత్యంతరములేక గ్రీకుల స్వాతంత్య్రమును గుర్తించెను. 1832 వ సంవత్సరమున గ్రీసుదేశము స్వతంత్ర ప్రతిపత్తిని పొందెను. అచ్చట శాసనబద్ధమగు రాచరిక మేర్పడెను. గ్రీకులు బవేరియా రాకుమారుడైన ఆటోనును రాజుగా ఎన్నుకొనిరి. 1863 లో ఆటో పదచ్యుతుడయ్యెను. అంతట డెన్మార్కు రాకుమారుడగు జార్జి అనునాతడు గ్రీసుదేశమునకు రాజయ్యెను.
రాజ్యవిస్తరణకై యత్నములు: మొదటి జార్జిరాజు కాలమున (1863-1913) తమ రాజ్యమును విస్తృత మొనర్చుటకై గ్రీకులు యత్నించిరి. ఇందువలన తురుష్కులతో గ్రీకులు యుద్ధము చేయవలసినవా రైరి. బల్గేరియా, సర్బియా, మాంటీనీగ్రో, గ్రీసులలో కూడ అంతఃకలహములు సంభవించెను. తుదకు గ్రీకులకు థెస్సరీయును, మాసిడోనియాలో కొంతభాగమును లభించెను.
ప్రపంచయుద్ధములు : 1914 వ సంవత్సరమున, మొదటి ప్రపంచయుద్ధము ప్రారంభమైన తరువాత, కొంతకాలము గ్రీసురాజ్యము తటస్థవిధానము నవలంబించెను. కాని వెనిజిలాస్ అను మంత్రి ప్రోత్సాహమువలన 1917 వ సంవత్సరమున ఆ రాజ్యమువారు మిత్రమండలిలో చేరిరి. ఆంగ్లప్రధాని యగు లాయడ్ జార్జి, వెనిజిలాసునకు ఆప్త మిత్రుడై యుండెను. ఈతని సహాయమున బలహీనమగు తురుష్క రాజ్యమునుండి త్రేసు రాష్ట్రమును సంపాదింప వచ్చునని గ్రీకుప్రధాని ఆశపడెను. కాని తురుష్కుల ప్రతిఘటనమువలన ఈ ఆశయ మీడేరలేదు. 1919-39 నడుమ గ్రీకురాజ్యములో ఆర్థిక పునర్నిర్మాణమునకై వెనిజిలాస్ ప్రభృతులు చాల పాటుపడిరి. కాని రాజకీయ కల్లోలములవలన ఆ కార్యక్రమము చక్కగా సాగలేదు. ఇచ్చట కమ్యూనిస్టు పక్షమువారి ప్రాబల్యము హెచ్చసాగెను. కాని గ్రీకుప్రభుత్వము కమ్యూనిస్టులకు లోబడలేదు. గ్రీసులో సైనిక నియంతృత్వ మేర్పడెను. రెండవ ప్రపంచ యుద్ధమందు గ్రీసురాజ్యము మిత్రమండలి పక్షమును వహించెను. యుద్ధ ప్రారంభదశయందు నాజీ పఠమువారు గ్రీసు నాక్రమించిరి. కాని తుదకు గ్రీకులకే విజయము లభించెను. అచ్చట స్వతంత్రప్రజాస్వామ్య ప్రభుత్వ మేర్పడెను. 1946 వ సంవత్సరమున ప్లెబిసైట్ ద్వారా గ్రీసులో రాచరికము పునరుద్ధరింప బడెను. రెండవ జార్జిరాజు సింహాసన మెక్కెను. ఆతని అనంతర మాతని సోదరుడు పాల్ అనునాతడు రాజయ్యెను (1947).
కమ్యూనిస్టు ఉద్యమము : గ్రీసుదేశమున తమ ప్రాబల్యమును నెలకొల్పవలెనని 1935 నుండియు కమ్యూనిస్టులు యత్నములు చేయుచు వచ్చిరి. 1946 లో వారు గ్రీసు ప్రజాప్రతినిధి ప్రభుత్వముతో గోరిల్లాయుద్ధమునకు కూడ దిగిరి. కాని బ్రిటను అమెరికా సంయుక్తరాష్ట్రముల సహాయముతో 1949 నాటికి గ్రీకుప్రభుత్వము కమ్యూనిస్టు ఉద్యమమును అణచివై చెను. మితవాదపక్షములు అధికారమును వహించెను. అమెరికా సంయుక్తరాష్ట్రముల సహాయముతో, వారు ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమమునకు పూనుకొనిరి. 1955 వ సంవత్సరమునందు నేషనల్ రాడికల్ యూనియనుపక్షమువారు అధికారము వహించిరి.
529