Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/507

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోదావరిజిల్లా (తూర్పు)

సంగ్రహ ఆంధ్ర

ఆంగ్లో ఇండియన్ స్కూళ్ళు 2 289
ట్రైనింగుస్కూళ్ళు (బాలురవి 3 బాలికలవి 3) 6 1080
బేసిక్ ట్రైనింగుస్కూలు 1 75
మాధ్యమిక పాఠశాలలు
(బాలురవి) 19 4,658
(బాలికలవి) 1 175
ప్రాథమిక పాఠశాలలు 1,761 1,72,119
బేసిక్ పాఠశాలలు 3 773
వయోజన పాఠశాలలు 52 1,601

జిల్లాలో మొ త్తము 3,94,733 మంది అక్షరాస్యులు కలరు. వారిలో 2,68,013 మంది పురుషులు, 1,26,720 మంది స్త్రీలు కలరు.

ముఖ్యపట్టణములు : కాకినాడ జిల్లా కేంద్రము. జనాభా 99,952 మంది. మునిసిపాలిటీ పట్టణము. రైలు, రోడ్డు, సముద్రపు ఓడల సౌకర్యములు ఈ నగరమునకు కలవు. పలువిధములగు విద్యావసతులను కలిగియున్నది. గొప్ప వర్తక కేంద్రముగను, వ్యాపారకేంద్రముగను తూర్పు ఇండియా కంపెనీలనాటినుండియు ప్రసిద్ధికెక్కి యున్నది

రాజమహేంద్రవరము 1,05,276 జనాభాగల మరియొక మునిసిపాలిటీ, రాజరాజనరేంద్రుని కాలమునుండి అనగా క్రీ. శ. 10 వ శతాబ్దమునుండి ఆంధ్ర సంస్కృతికి రాజకీయములకు కేంద్రమై విలసిల్లిన పురవతంసమిది. గోదావరీ నదీతీరమందుండుటచేతను, ముఖ్యమైన ఇనుపదారిలోను, ట్రంకురోడ్డుప్రక్కను ఉండుటచేతను ఈ నగరము అనేక సౌకర్యములు కలిగి మిక్కిలి వాసయోగ్యముగా నుండును. ఫలసమృద్ధికి పెట్టినదిపేరు. కలప, కొబ్బరికాయలు, పండ్లు, మొక్కలు, నూనె యిచటినుండి విశేషముగా నెగుమతి యగుచుండును.

ఇవిగాక పెద్దాపురము, అమలాపురములుగూడ మునిసిపాలిటీలుగల పట్టణములు. సామర్లకోట, రామచంద్రపురము, తుని, మండపేట మున్నగు ననేక చిన్న పట్టణములు ఈ జిల్లాయందు కలవు. సంస్థానాధీశులచే నిప్పటి వరకు పాలింపబడిన పిఠాపురము, తుని, కిర్లంపూడి పట్టణములు పూర్వము నుండియు సాంస్కృతికముగ ప్రసిద్ధి కెక్కియున్నవి.

యాత్రాస్థలములు : యాత్రాస్థలములకుకూడ ఈ జిల్లా అగ్రస్థానమును వహించుచున్నది. భద్రాచలముయొక్క ప్రాముఖ్యము తెలియనివా రుండరు. ఆంధ్రులకు ఇలవేల్పనదగు శ్రీరామచంద్రు డిచటనే భక్తరామదాసును తరింపజేసి తాను ప్రసిద్ధికెక్కినాడు. వైకుంఠఏకాదశికి, శ్రీరామనవమికి ఇచట జరుగు మహోత్సవముల సందర్భమున దేశమందలి పలుప్రాంతములనుండి లక్షల కొలది యాత్రికులు వచ్చుచుందురు. భద్రాచలము దగ్గర పర్ణశాల, శ్రీరామగిరి అనునవి గోదావరి తీరస్థ పవిత్ర క్షేత్రములు. ఈ ప్రదేశములకు అఖిలభారతము నుండి యాత్రీకులు వచ్చుచుందురు. (భద్రాచలము ఖమ్మముజిల్లాలో చేర్చబడినది. 1960). తరువాత చెప్ప తగిన గొప్ప క్షేత్రము రామచంద్రపురములోని దాక్షారామము. పంచారామము లనబడు ఐదు శైవక్షేత్రములలో నిది యొకటి. శివరాత్రి కిచట గొప్పతీర్థము జరుగును. ఇచటి శివలింగము సూర్యప్రతిష్ఠితమని పురాణప్రసిద్ధి. వ్యాసుడు కాశినుండి యిచటికి తరలి వచ్చెననియు, ఇదియే దక్షాధ్వరవాటికయనియు భీమఖండాది పురాణములలో కలదు. కోటిపల్లికూడ ఈ తాలూకాలోని మరియొక శైవక్షేత్రము. కోట అనునొక వైష్ణవక్షేత్రముకూడ నిచటనే శిథిలమై యున్నది. ఇది గోదావరీతీరమం దున్నది. పాదగయాక్షేత్ర మన బరగు కుక్కుట క్షేత్రము పిఠాపురమున మిక్కిలి ప్రసిద్ధి గాంచినది. శివరాత్రి కిచట గొప్ప ఉత్సవము జరుగును. ఇచటనే కుంతీ మాధవాలయముకూడ కలదు. తుని తాలూకాలోని అన్నవరములో నొక కొండపై నున్న సత్యనారాయణస్వామివారి ఆలయము గొప్ప యాత్రాస్థలము. వైశాఖపూర్ణిమ కిచట జరుగు ఉత్సవమునకేగాక ప్రతి యేకాదశికి వందలకొలది యాత్రికులు వచ్చు చుందురు. రాజమహేంద్రవరములోని కోటిలింగాలగుడి, మార్కండేయస్వామి గుడి కూడ స్థానిక క్షేత్రములై యున్నవి. కోనసీమ యందు ముక్తేశ్వరము (శైవ), అంత ర్వేది(వైష్ణవ), వాడపల్లి(వైష్ణవ), ర్యాలి మున్నగు పేర్వడ్డ క్షేత్రములే గాక గోదావరీశాఖల తీరములం దంతటను తీర్థము లనేకములు కలవు.

బృహస్పతి గ్రహము సింసారాశిగతమై యుండు సంద

458