Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/497

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోదావరినది - 1

సంగ్రహ ఆంధ్ర

దిశగా సుమారు 70 మైళ్ళ దూరములో త్రియంబకము అనుచోట ఒక కొండలో పుట్టి ఆగ్నేయదిశగా ప్రవహించి రాజమహేంద్ర వరమునకు తూర్పుగా 50 మైళ్ళ దూరమున బంగాళాఖాతములో కలియుచున్నది. ఇది పుట్టిన చోట నీరు ఒక శిలాప్రతిమనుండి వెలువడుచుండును. ఈ నదియొక్క పరీవాహ ప్రదేశము సుమారు 1,20,000 చ. మైళ్ళు. అనగా ఇది ఆంధ్రప్రదేశ వైశాల్యమునకంటె కొంచెము పెద్దది.

ఈ నదిపొడవు 900 మైళ్ళు, దీనికి అనేక ఉపనదులు గలవు. వాటిలో మంజీర, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి అనునవి ముఖ్యమైనవి. మంజీర కుడివైపునుండియు, తక్కినవి ఎడమవైపునుండియు ఈనదిలో కలియుచున్నవి. అంతిమ ఉపనదియైన శబరి ఈనదిలో కూనవరమువద్ద పడుచున్నది. శబరి కలిసినచోటు నుండి ఈనది తూర్పు కనుమలను చీల్చుకొని అనేకములైన మెలికలతో, ఎత్తుపల్ల ములతోనిండిన ఒక ఇరుకైన లోయగుండా సుమారు 25 మైళ్లు ప్రవహించి, పోలవరమువద్ద సమతల ప్రాంతమున ప్రవేశించుచున్నది. ఈ లోయకు ఇరుప్రక్కల సుమారు 2,000 అడుగుల ఎత్తుకల్గిన కొండలు నిట్ట నిలువుగా ఉన్నవి. వీటినే పాపికొండలు అందురు. మొదటి నాలుగు మైళ్ళవరకు ఈ లోయ వెడల్పు ఒక ఫర్లాంగు మాత్రమే. వాన కాలములో ఈ ఇరుకైన లోయలో నీటి లోతు 3,000 అడుగులు ఉండును. కొండలగుండా పెక్కు మలుపులు తిరుగుచు ప్రవహించుట వలన, సుందరమైన సరస్సులు నదికి ఇరుప్రక్కలయందు ఏర్పడినవి. ఈ ఇరుకైన లోయలో నీరు అతివేగముగా ప్రవహించును. లాంచీలు, స్టీమర్లు, పడవలు ఈ లోయలో మిక్కిలి జాగ్రత్తగా వెళ్ళును. ఇరుప్రక్కల ఎత్తైన కొండలు కలిగిన ఈలోయ చూచుటకు చాల భయంకరముగా ఉండును. ఒకప్పుడు సముద్రము ఈ లోయవరకు వ్యాపించి ఉండెడి దని భూగర్భశాస్త్రజ్ఞుల అభిప్రాయమై యున్నది.

ఇంచుమించు పోలవరమువరకు ఈనది ఎగుడుదిగుడు ప్రాంతముగుండ పెక్కు వంపులు తిరుగుచు ప్రవహించి అక్కడినుండి సమతల ప్రాంతముగుండ పారుచున్నది. పోలవరమునుండి ఈ నదియొక్క వెడల్పు విస్తారముగా పెరుగుచున్నది. దీనివెడల్పు పోలవరమువద్ద ఒక మైలు, రాజమహేంద్రము వద్ద 2 మైళ్ళు, ధవళేశ్వరము వద్ద 4 మైళ్ళు.

ధవళేశ్వరమునకు దిగువున ఈనది గౌతమి, వాసిష్ఠ అను రెండు పాయలుగనై చీలినది. గౌతమి తూర్పుగా 45 మైళ్ళు ప్రవహించి వృద్ధగౌతమి, కోరింగనది అను మరి రెండు పాయలయినది. ఈరెండు పాయలు సముద్రములో కలియుచున్నవి. వాసిష్ఠ దక్షిణ దిక్కుగా 50 మైళ్ళు ప్రవహించి, నర్సాపురమువద్ద సముద్రములో కలియుచున్నది. దీనినుండి కూడ వైనతేయము అను మరియొక పాయవీడి సముద్రములో కలియుచున్నది. గౌతమి, వాసిష్ఠ అను పాయలమధ్యనున్న అమలాపురము రాజోలుతాలూకాలకు మధ్య డెల్టా అనియు, గౌతమికి తూర్పునగల కాకినాడ, రాజమహేంద్రవరము తాలూకాలకు తూర్పు డెల్టా అనియు, వాసిష్ఠకు పడమట ఇంచు మించు ఏలూరువరకు ఉన్న భూమిని పడమటి డెల్టా అనియు అందురు.

గోదావరి నదిలో ఎక్కువగ వండలిమట్టి కలదు. నది వరదలకు లోనైనప్పుడు ఈ వండలిమట్టి విస్తారముగా ఉండును. ఇది చాల సారవంతమైనట్టిది. నది విస్తరించి సమతల ప్రాంతముగుండ ప్రవహించునప్పుడు వేగము మందమై మేటవేయుట వలన అనేకములగు లంకలు ఏర్పడినవి. ఈ లంకలలో పొగాకు మొదలయినవి పండించెదరు. వీటిలో ముఖ్యమయినవి శబరిలంక, పిచుకలలంక, బొబ్బరిలంక, ఊబలంక అనునవి.

ఈ నదిపై దుమ్ముగూడెము, ధవళేశ్వరము అనుచోట్ల ఆనకట్టలును, రాజమహేంద్రమువద్ద ఒక రైల్వేబ్రిడ్జియు గలవు ధవళేశ్వరమువద్ద ఆనకట్ట 1852 సం. లో సర్ ఆర్థర్ కాటన్ అను ఇంజనీరు కట్టినాడు. ఈ ఆనకట్ట కట్టుటకు పూర్వము గండ్లుపడి, నీరు డెల్టా ప్రాంతమం దంతటను ప్రవహించెడిది. కొంతవరకు ఆ నీటిని వ్యవసాయమునకు ఉపయోగించెడివారు, నది, వరదలకు లోనైనప్పుడు భూములన్నియు మునిగిపోయెడివి. ఆనకట్ట కట్టుటవలన ఇపుడు సుమారు 112 లక్షల ఎకరముల భూమి సాగు అగుచున్నది. ఇప్పుడు నూటికి ఏడువంతులు నీరు మాత్రమే వినియోగింపబడుచున్నది. తక్కిన 93 వంతుల నీరు వృథాగా సముద్రములో కలియుచున్నది.

448