Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుజరాతుదేశచరిత్రము

సంగ్రహ ఆంధ్ర

(3) అంతిమ అపభ్రంశభాష 1500-1600 వరకు. గుజరాతుభాష అంతిమ అపభ్రంశభాషనుండి ఉద్భవించినది. గుజరాతుభాషను ఆదిగుజరాతు ; మధ్యగుజరాతు, అర్వాచీన గుజరాతు అని మూడు భాగములుగ విభజించిరి. ఆది గుజరాతు 1600-1700 వరకు; మధ్యగుజరాతు 1700–1750 వరకు; 1750 నుండి అర్వాచీన గుజరాతు. కొందరు శాస్త్రజ్ఞులు 1300 – 1400 నడుమ మధ్య అపభ్రంశమునుండి గుజరాతీభాష పుట్టినదనికూడ వాదింతురు.

గుజరాతుయొక్క ప్రాచీనసంస్కృతిని తెలియపరచు ఆధారములు మిక్కుటముగా లేకపోవుటచే దాని ప్రాచీన సంస్కృతి అంతగా చెప్పుకోదగినది కాదనియు, అట్టి నిదర్శనములు కొన్ని యున్నను, వాటిచే పూర్తిసంస్కృతి తెలియదనియు చరిత్రకారులమతము. ప్రాచీన గుజరాతు సంస్కృతిని తెలియజేయు కొన్ని ఆయుధములు, శిల్పములు సబర్మతీనదీ మైదానమందును, అచటికి సమీపమున నున్న “సాడోలియా" అను గ్రామమందును, సబర్మతీ నదియందును దొరకినవి. ఇచ్చట లభించిన ఆయుధములు రాతితో చేయబడినవి. వాటి పిడులపై అనేకవిధములైన చెక్కడములు, శిలావిగ్రహములుకూడ దొరకినవి. అందలి శిల్పకళ చూపరులకు అద్భుతము కలిగించునదిగ ఉన్నది. కాన నీ ప్రాంతమున నొక ప్రాచీననగరముండె నని చెప్పుదురు.

సబర్మతీనదీ ప్రాంతమున దొరకిన ఆయుధములును, మూడవశతాబ్దమున దక్షిణ భారతదేశమందు దొరకిన ఆయుధములును ఒకేవిధముగ నున్నవి. కాన మొదట దక్షిణదేశమున జనసంఖ్య ఎక్కువ యుండుటచే ఇచటి వారు గుజరాతునకును, ఉత్తరదేశమునకును వెళ్ళినట్లు శాస్త్రజ్ఞు లూహించుచున్నారు

పురాతన గుజరాతు చరిత్రను రెండు భాగములుగ విభజింపవచ్చును. (1) ప్రాచీన పాషాణయుగము (2) నూతన పాషాణయుగము. ప్రాచీన పాషాణయుగమున రాతితో ఆయుధములను తయారుచేసిరి. కాని అవి చూచుటకు అందముగగాని, సున్నితముగగాని లేవు. నూతన పాషాణయుగమున రంగు రంగుల రాతి ఆయుధములు తయారయ్యెను. ఈ ఆయుధములు నునుపుగను, చూచుటకు అందముగను ఉండి పనితనమును కలిగి యుండెను. ఇట్టి ఆయుధములు, శిల్పములు “లాంధరజ్ " అనుచోట త్రవ్వకములు జరుగగా అందు బయల్పడెను. త్రవ్వకముల ఫలితముగా లభించిన వస్తుజాలము “మోహంజదారో” నాగరికతకంటె మూడు నాలుగు వేల సంవత్సరములకు పూర్వమైనవని తెలియుచున్నది. ప్రాచీన పాషాణయుగమున ఎక్కువ జాతులు లేవనియు, 'హేమరట్' అనుజాతి యుండెననియు పరిశోధనలవలన తెలిసెను. నూతన పాషాణయుగమున ముఖ్యజాతులు నాలుగనియు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనునవి) ఈ కాలమున గూడ 'హేమరట్' జాతి అను నది ఉండెననియు, ఈ జాతివారు పై నాలుగు జాతులతో కలియక కొండప్రాంతములలో ఉండెడివారనియు వీరు ఎక్కువగా చేపలను, జింకలను వేటాడి వాటివలననే జీవించెడివారనియు ప్రాచీన చరిత్రలు తెలియజేయు చున్నవి. 1700 సంవత్సరములకు పూర్వపుయుగమునకు తామ్రయుగమనియు 1500 సంవత్సరములకు పూర్వపు యుగమునకు లోహయుగమనియు పేర్లు.

గుజరాతు చరిత్ర అనేక మహత్తర సంఘటనలతో నిండి యున్నది. భారతదేశ స్వాతంత్ర్యము కొరకు ఎన్నో పర్యాయములు ఈ ప్రాంతీయులు యుద్ధరంగమున తమ శౌర్యమును ప్రదర్శించిరి. ప్రాచీన చరిత్రను తెలియజేయు శాసనములు ఈ ప్రాంతమున నెన్నోగలవు. ఇందు అశోకుని, రుద్రదాముని, స్కంధగుప్తుని శాసనములు ఎక్కువగా కన్పించును.

గుజరాతుచరిత్రలో " మైత్రక, వలభీయుగ" మనునది గలదు. మైత్రక, వలభీ అను రాజులు మహా పరాక్రమ వంతులు. తమ క్షాత్రతేజమున 300 సంవత్సరములు గుజరాతును ఈ వంశమువారు పరిపాలించిరి. మైత్రక, వలభీలు మొదట మాళవ, సత్యాద్రిరాజుల మన్ననలను పొంది తమ స్వామిభక్తిని నిరూపించుకొని, తత్ఫలితముగా కొంత రాజ్యమును పొంది, దానిని తమ పరాక్రమముచే విస్తరింపజేసికొనిరి. అదియే గుజరాతు. 'వలభీ' అను పేరుతో ముఖ్యపట్టణమును నెలకొల్పిరి. వీరి సైన్యము గుప్తరాజుల సైన్యమును ఓడించి, తమ పరిసర ప్రాంతములకు తిరిగి రాకుండునట్లుగా జేసెను. వలభీ

378