Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/421

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంప్లొవిజ్ లుడ్విగ్

సంగ్రహ ఆంధ్ర

చుండును. ఈ కారణమునుబట్టియే ఈనదికి “గుండ్లకమ్మ" అను నామము ఏర్పడినదని పెద్దలు చెప్పుదురు. అంతేకాక గుండ్లకమ్మకు సంస్కృతములో "కుండి తరంగిణి" అను పేరు ఉన్నట్లు ప్రోలయ వేమారెడ్డినాటి శాసనములవలన మనకు తెలియుచున్నది. అందులో పూంగినాటి విస్తీర్ణమును తెలుపుచు "అస్తి శ్రీగిరి పూర్వపాద నికటాదాపూర్వపాథోనిధే | ర్దేశః కుండితరంగిణీ ముభయతః శ్రీ పూంగినామాంకితః" అని యున్నది. చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఈ పూంగినాడే కాలక్రమమున పూఁగినాడుగా, పోఁకనాడుగా, పాకనాడుగా మారినది. ఈ పాకనాటిసీమ గుండ్లకమ్మ నదికి ఇరువంకలను, శ్రీశైల పర్వతము యొక్క తూర్పు భాగమునుండి తూర్పు సముద్రమువరకు వ్యాపించియున్నది. మరియు జమదగ్ని మహర్షి ఒకానొక కొండమీద “గుండ్ల బ్రహ్మేశ్వరస్వామి" కి ఆలయము కట్టించి, దానికి అంగముగా గుండిక నదీతీరమున ఆశ్రమమును ఏర్పాటు చేసికొని ఉండెనని ఒక ఐతిహ్యము కలదు. ఈ గుండిక నదియే కంబము చెరువునకు మూలాధారము. ఈ గుండిక నదియే గుండ్లకమ్మ నది యనియు భావించుచున్నారు.

ఈ విషయ విచారమునుబట్టి, గుండ్లకమ్మ అను నదికి పూర్వనామము 'కుండిక' లేక 'గుండిక' అను సంస్కృత పదమున్నట్లుగా కనబడుచున్నది. ఈ సంస్కృత నామము 'గుండ్లకమ్మ' అను తెలుగు పేరుగా ఏ శతాబ్దములో ఎట్లుమారినదో ఇదమిత్థమని తేల్చిచెప్పుట చాలకష్టము.

గుండ్లకమ్మ అను పదమును విడదీసినచో గుండ + కమ్మ అను రెండుపదములు వచ్చును. గుండ్లు=గుండ్లతో పారు కమ్మ=కమ్మని నీటిప్రవాహము కలది అని అర్థము చెప్పుచున్నారు. 'గుండ్లతోవచ్చు మంచినీటి ప్రవాహము' లేదా 'గుండ్లతో నిండిన మంచినీటి ప్రవాహము' అనుటకు గుండ్లకమ్మ నదిలోని నీరు దగ్గర సంబంధము కలిగి యున్నది. “గుండ్లబ్రహ్మేశ్వరస్వామి" ఉండనే ఉన్నాడు కదా!

గుండ్లకమ్మ నదీ జలములను సవ్యముగా ఉపయోగించుకొనుటకును, దీనిపై ఆనకట్ట కట్టుటకును, ఎన్నియో ప్రయత్నములు జరుగుచున్నవి. ఈ నదీ జలముల సాయముతో వినుకొండ, ఒంగోలు తాలూకాల ప్రజలు స్వల్పముగా వ్యవసాయము చేసికొనుచున్నారు. అయినను వారు తగినంత ఫలితమును పొందుటలేదు.

ఒంగోలు పట్టణప్రజలు మంచినీటికొరకు పడుబాధలు వర్ణనాతీతములు. అందువలననే ఈ మధ్యకాలమున ఈ పట్టణమునకు పదునొకండు మైళ్ళ దూరములో 'వెలంపల్లి'కి సమీపమునగల గుండ్లకమ్మ నదివద్ద బావులు త్రవ్వించి, అక్కడినుండి గొట్టముల ద్వారా ఒంగోలు ప్రజలకు నీరు సరఫరాచేయుటకు ఆంధ్రప్రభుత్వమువారు గుండ్లకమ్మ నీటిపథక మొకదానిని తయారుచేసిరి. ఈ 'గుండ్లకమ్మ నీటి పథకము'ను అమలు పరచుటకు మొత్తముమీద 36 లక్షల రూప్యములు ఖర్చు కాగలవని అంచనా వేయబడినది. ఈ పథకము వలన ఒంగోలు నగరవాసులకు మాత్రమేకాక, పరిసరగ్రామముల ప్రజలకును, పశువులకును ఎంతో లాభము చేకూరగలదని ఆశింపబడు చున్నది.

గుండ్లకమ్మనదికి రెండువైపులను ఒడ్డులయందు తుంగ విశేషముగా పెరుగుటచే, అచ్చటి ప్రజలు ఆ తుంగతో చిరిచాపలు విశేషముగా తయారు చేయుచున్నారు. అందువలన ఈ పరిశ్రమ ఆ ప్రాంతములో మిక్కిలి అభివృద్ధిలో నున్నది. వినుకొండ తాలూకాలోని ఐనవోలు గ్రామము ఈ చిరిచాపల పరిశ్రమకు చాల ప్రసిద్ధి నొందినది.

గుండ్లకమ్మ నదీపరీవాహ ప్రాంతములందు అచ్చటచ్చట నీటిబుగ్గలు కలవు. అందు కొన్ని వేడిగానుండును. వాటిలో రాసాయనిక ద్రవ్యములున్నట్లు శాస్త్రజ్ఞుల అభిప్రాయము.

ఈ నది యొడ్ల వెంబడి అనేకములైన పురాతన శాసనములును, నాణెములును లభించినవి. వీటివలన గుండ్లకమ్మ నదీపరిసరములు కొంత చారిత్రక ప్రాధాన్యము కలవియని తేలుచున్నది.

పు. వేం.

గుంప్లొవిజ్ లుడ్విగ్ (1848-1909) :

గుంప్లొవిజ్ లుడ్విగ్ అను నతడు పోలెండు దేశములో క్రాకోయను నగరమునందు 1838 లో ఒక పోలిష్ - యూదు కుటుంబములో జన్మించెను. క్రాకో, వియన్నా విశ్వవిద్యాలయములలో విద్యను పరిపూర్తి చేసికొనిన

372