Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గిడుగు వేంకట రామమూర్తి

సంగ్రహ ఆంధ్ర

(1910) మరి పెక్కు వ్యాసంగములలో నిమగ్నులై యుండిరి. అందు (1) మూడు జిల్లాలకు ఆనాడు విద్యాధికారిగా నుండిన 'యేట్స్' దొర ప్రోత్సహించిన వ్యావహారిక భాషావాదము. (2) ఇంగ్లీషుభాష నేర్చుకొన ప్రారంభించిన విద్యార్థులకు అనువాదపద్ధతికాక, ఇంగ్లీషులోనే 'డై రెక్ట్ ' పద్ధతిలో 'ఫోనెటిక్ ' లిపిలో బోధించుట. (3) పర్లాకిమిడి పరిసరములలోని సవరబాలురకై స్వంత ధనము వెచ్చించి పెట్టిన బడులు సక్రమముగా నడచునట్లు చూచుకొనుట అనునవి మూడును ముఖ్యమైన వ్యాసంగములు. ఈ కార్యములలో వీరి ప్రథమపుత్రుడైన సీతాపతి తన తండ్రికి సహాయుడుగా నుండెడివాడు. వ్యావహారిక భాషావాదమునకు కావలసిన పరికరములను రామమూర్తి గారు సేకరించుచుండెడివారు. వీరు బాల్యము నుండియు తెలుగు ప్రబంధములు, తెలుగు వ్యాకరణములకంటె, సంస్కృతగ్రంథములను ఎక్కువగా పరిశీలించుచుండెడివారు. తెలుగు ప్రబంధములను, తెలుగు వ్యాకరణమును ఎక్కువగా చదివి యుండలేదు. కాని భాషాతత్వమును వీరు లెస్సగా గ్రహించియుండిరి. అంతియేకాక ప్రప్రథమముగ సవరభాషకు వ్యాకరణము నిర్మించుటలో వ్యాకరణ సంప్రదాయములను అలవరచుకొన్నారు. అందుచేత వీరు తెలుగుభాషను స్వయంకృషిచే వేగముగ నేర్వగలిగిరి. యేట్సుదొర ఏర్పరచిన ఉపాధ్యాయ పరిషత్తులో రామమూర్తి గారు ప్రసంగించుచు వ్యావహారిక భాషకును, గ్రాంథిక భాషకును గల తారతమ్యమును విశదీకరించిరి. నన్నయ కాలమునుండి తెలుగుభాష ఎట్లు మారుచు వచ్చినదో, జీవభాషలకు గల ఉత్కృష్టత ఎట్టిదో వీరు నిరూపించిరి. గ్రాంథిక భాషాభిమానులకు వీరి ప్రసంగము వెగటుగా తోచెను.

రామమూర్తిగారు 1910 లో పర్లాకిమిడి కళాశాల ఉద్యోగమునకు రాజీనామా నిచ్చి, విశాఖపట్టణముజిల్లా లోని జయపుర మందలి బోర్డు హైస్కూలునందు ప్రధానోపాధ్యాయ పదవిని స్వీకరించిరి.

తెలుగువారికి మాతృభాషలో తగిన కృషి, ప్రోత్సాహము లేకుండెననియు, గ్రాంథికమైన తెలుగు భాషా భ్యసనమువలన ప్రసంగములలోను, ఇతర విషయము లందును స్వేచ్ఛ యుండదనియు, తెలుగుభాష సజీవమైన భాషగా పరిణతి చెందవలెనన్నచో గ్రంథరచనయందు వ్యావహారిక భాష ప్రవేశపెట్టవలెననియు రామమూర్తిగారు తన రచనలలో, ఉపన్యాసములలో ఉద్ఘాటించిరి. ఇది గ్రాంథిక భాషాభిమానుల కసమ్మత మగుటచే, వ్యావహారిక భాషాభిమానులకును, గ్రాంథికభాషాభిమానులకును వాదములు చెలరేగినవి. వ్యావహారికభాషాభిమానులలో రామమూర్తి, ఏట్సుదొర, పి. టి. శ్రీనివాస అయ్యంగారు, గురజాడ అప్పారావు గార్లు ముఖ్యులు. గ్రాంథికవాదులు వీరిని 'దుష్టచతుష్టయము'గను, వీరభిమానించిన భాష 'గ్రామ్యభాష' గను ఎంచి, తెలుగుదేశ మంతటను సభలు నడిపించి, తీవ్రమైన అలజడి కావించి, ప్రభుత్వమునకును, విశ్వవిద్యాలయములకును వేలకొలది సంతకములతో నివేదికలు పంపిరి గ్రాంథిక వాదులకు నాయకత్వము వహించిన వారిలో ముఖ్యులు శ్రీ జయంతి రామయ్య పంతులుగారు. ఇరుపక్షముల మధ్య ఖండన మండనములు ఉచ్ఛస్థాయి నందుకొనెను. ఈ 'దుష్ట చతుష్టయము' లో మిగిలినవారి కంటె రామమూర్తిగారు వ్యావహారిక భాషావాదము నెగ్గితీరవలెనని మిగుల పట్టుదలతో నుండిరి. అందులకై వారు బరంపురము నుండి మద్రాసు, అనంతపురము వరకును గల కళాశాలలకు వెళ్లి తిక్కనకాలము నుండి ఆనాటికానాటికి తెలుగు గ్రంథములందు వ్యావహారిక భాషారూపము లెట్లు ఎక్కువగుచు వచ్చినవో ప్రయోగములు చూపించుచు, కళాశాలాధికారులకు, అధ్యాపకులకు నచ్చచెప్పిరి. ఇంతకును తమవాదము వచన రచనలకే గాని, కావ్యరచనకు కాదనియు ఇది నూతన విప్లవముగా పుట్టినది గాదనియు, చిన్నయసూరికి పూర్వమే వందలకొలది వచన రచనలు వాడుకభాషలో సాగినవనియు, వీరు సప్రమాణముగ రుజువు చేసిరి. విప్లవము తెచ్చిపెట్టినవాడు చిన్నయసూరియే యనియు, చిన్నయసూరి రచించిన వ్యాకరణ సూత్రములను బట్టి చూచినచో, తిక్కన మొదలైన మహాకవుల ప్రయోగములు గ్రామ్యము లనవలసి వచ్చుననియు రామమూర్తిగారు సోదాహరణముగా వాదించిరి. వారి వాదన పెక్కుమంది పండితులకును. విద్యాధికులకును నచ్చినది.

1916 అనంతరము రామమూర్తిగారు 'తెలుగు' అను

354