Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గిడుగు వేంకట రామమూర్తి

సంగ్రహ ఆంధ్ర

బిరుదము లభించెను. ఇతడు 1911 వ సంవత్సరము, జనవరి 17 వ తేదీన మరణించెను.

కె. రా.

గిడుగు వేంకట రామమూర్తి :

శ్రీ గిడుగు రామమూర్తిగారు నియోగి బ్రాహ్మణులు. వీరి తండ్రిపేరు వీరరాజు. కారణాంతరములచే స్వగ్రామమైన ఇందుపల్లిని విడిచి, వీరు విజయనగర సంస్థానమందు రెవెన్యూ ఇన్‌స్పెక్టరు ఉద్యోగములో ప్రవేశించిరి. 1858 నాటికి వీరు గంజాముజిల్లా ముఖలింగమునకు చేరువగా నున్న పర్వతాలపేటలో ఉద్యోగ వశమున నుండగా 1862 లో రామమూర్తిగారు జన్మించిరి. రామమూర్తి గారికి యధావిధిగా 5 వ ఏట అక్షరాభ్యాసము జరిగినది. ఆ కాలములో ముఖలింగమునకు ప్రక్కగనున్న 'నగరి కటకము’న జయపురపు రాజవంశమునకు చెందిన శ్రీవిక్రమ దేవవర్మ తండ్రిగారు కుటుంబసహితముగా నివసించు చుండెడివారు. రామమూర్తిగారు నాలుగైదేండ్ల బాలుడుగా నున్నప్పుడు శ్రీ విక్రమదేవవర్మ నగరికటకములో జన్మించిరి. వీరిద్దరి తండ్రులు అన్నదమ్ముల వలె మిత్రులుగా నుండుటచే, రామమూర్తి విక్రమదేవవర్మ గార్లును బాల్యమునుండి పరమ మైత్రితో పెరిగిరి. రామమూర్తి గారి పండ్రెండవయేట, వీరరాజుగారికి విశాఖపట్టణము జిల్లాలోని చోడవరమునకు బదిలీ జరిగినది. ఆ నాటికి రామమూర్తిగారి విద్య ఎక్కువగా సాగలేదు. అక్షరాభ్యాసము మొదలు రెండేండ్ల వరకును వీరికి వారణాసి గున్నయ్యగారు గురువులుగ నుండిరి. వీరి శిక్షణతో చదువను, వ్రాయను నేర్చుకొని, వేమన, సుమతీశతకము లందలి కొన్ని పద్యములకు ప్రతిపదార్థ తాత్పర్యములను కంఠస్థము గూడ చేసిరి. అటుపిమ్మట తండ్రి వద్దనే బాలరామాయణ శ్లోకములు కొన్ని వల్లించిరి. వీరు భారత రామాయణ కథలు వినుచుండెడివారు. వీరరాజుగారు పూర్వాచార సంప్రదాయములను పాటించెడి వారగుటచే కుమారునకు పదియవయేట విజయనగరములో ఉపనయన మాచరించి వారిచే 'మాధవభిక్ష' ఎత్తించిరి.


రామమూర్తిగారి 13 వ ఏట వారి తండ్రి స్వర్గస్థులయిరి. 1879లో వీరు మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులై 'పర్లాకిమిడి జిల్లా ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించిరి. విజయనగరమందు వీరికి మిత్రులుగా నుండిన వారిలో గురుజాడ అప్పారావుగారు ముఖ్యులు. వీరిద్దరును ఒకేసారి మెట్రిక్యులేషన్ పరీక్ష యందు ఉ త్తీర్ణులయినవారే. అప్పారావుగారు సంపన్న కుటుంబములోని వారగుటచే కాలేజీ చదువు సాగించి బి. ఏ. పరీక్షయం దుత్తీర్ణులయిరి. పేదవారగుటచే రామమూర్తిగారు, తన తండ్రి మరణానంతరము కాలేజీ చదువు సాగింపలేకపోయిరి. హైస్కూలు విద్యనయినను. వీరి తల్లి తన యాభరణముల నమ్మి వీరికి చెప్పించవలసి వచ్చినది. అందుచే రామమూర్తిగారు ఉద్యోగములో ప్రవేశించి కుటుంబపోషణము చేయక తప్పలేదు. వీరికి 1880 లో వివాహము జరిగినది. 1885 లో వేంకటసీతాపతియను పేరుగల ప్రథమ పుత్రుడు జన్మించెను. రామమూర్తిగారు ఉద్యోగము చేయుచునే బి. ఏ. పరీక్షలో ఇంగ్లీషు, సంస్కృత భాగము లందు ఉత్తీర్ణులై పిదప 1896లో పూర్తిగా పట్టభద్రులయిరి.

రామమూర్తిగారు, తమ ఉద్యోగకాలములో మరి రెండు పనులు యధేష్టముగా తెచ్చిపెట్టుకొని వాటిలో నిమగ్నులై రి. పర్లాకిమిడికి ఉత్తరమున నున్న కొండల నుండి ఆదిమవాసులైన సవరలు పర్లాకిమిడిలో కట్టెలు, కొండచీపురు కట్టలు, పసుపు అమ్ముకొనుటకై వచ్చు చుండెడివారు. వారి భాష, ఆచార వ్యవహారములు, జీవిత విధానము రామమూర్తిగారికి విపరీతముగ తోచుటచే, వారి భాష నేర్చుకొనవలె నన్న అభిలాష వారికి తీవ్రమైనది. అప్పటికి వారు ఒరియా భాష చదువను, వ్రాయను నేర్చుకొని యుండిరి. ఆర్యభాషల పరస్పర సంబంధమును, భాషాతత్వమును తెలియజేయు గ్రంథములును, మాక్స్‌ముల్లర్ రచించిన గ్రంథములును, వీరు చదివియుండిరి. ద్రావిడ భాషలనుగూర్చి కాల్డ్ వెల్ వ్రాసిన గ్రంథములనుకూడ వీరు పఠించిరి. అందుచే సవర భాషను నేర్చి, భాషాకుటుంబములలో అది దేనికి చెంది యున్నదో తెలిసికొనవలెనన్న కోరిక రామమూర్తి గారికి కలిగినది. అదికాక సవర భాషను అదివరకెవ్వరును పూర్తిగా నేర్చుకొని యుండకపోవుటచేతను, ఆ భాషకు లిపిలేకుండుట చేతను, ఆభాషలో గ్రంథమేదియు వ్రాయబడక ఉండుటచేతను, తెలుగులిపి ననుసరించి సవరభాషలో

352