Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గాలి - జడవాయువులు

అనియు, మండుటకు సహాయపడని భాగము నత్రజని అనియు, అవిరెండును ఘనపరిమాణములో 1 : 4 నిష్పత్తిలో ఉండుననియు కనుగొనబడినది. 18 వ శతాబ్దమున డ్యూమాస్ (Dumas) అను శాస్త్రవేత్త తన వివిధ ప్రయోగముల ద్వారమున గాలిలోని ప్రాణవాయువు యొక్కయు, నత్రజని యొక్కయు భార నిష్పత్తి 23.2 : 75.5 అని కనుగొనెను.

1774 సంవత్సర ప్రాంతమున లెవోజి అను ఫ్రెంచి శాస్త్రజ్ఞుడు గాలిలో వస్తువులు ఉండుటకు సహాయపడని భాగము కేవలము నత్రజనియేగాక, నత్రజని కర్బన ద్వ్యమ్లజనిదము (Carbon dioxide), నీటియావిరి అను వాటియొక్క మిశ్రమ రూపమని గ్రహించెను. మరికొన్ని ప్రయోగములద్వారా గాలిలో, పై వాయువులతోబాటు నవాసారము (Ammonia), నత్రికామ్ల వాయువు (Nitric acid air), ఓజోను, ఆరానువంటి కొన్ని జడవాయువులు కూడా కలవని గ్రహింపబడినది. గాలిలోని ప్రతి పదివేల భాగములకు వివిధ వాయువులు ఈ క్రింద నుదాహరింపబడినవిధముగా నుండునని నిర్ణయింపబడినది.

ప్రాణవాయువు 2,065.94 ఒజోను 0.015
నత్రజని 7,711.60 నత్రికామ్ల వాయువు 0.08
నీటియావిరి 140.00
జడవాయువులు 79.00 నవాసారము 0.005
కర్బనద్వ్యమ్లజనిదము 3.36

గాలిలోని ఘటకములైన వాయువు లెవ్వియు తమ సహజధర్మములను కోల్పోకుండుటచేతను, వాటిని సులభ పద్ధతులద్వారా వేరుచేయగల్గుటచేతను, వివిధ ప్రాంతములలోని గాలిలో ముఖ్య ఘటకములైన నత్రజని - ప్రాణవాయువుల సామ్యములో భేద ముండుటచేతను, గాలి పై నుదాహరింపబడిన వాయువు లన్నిటిని కలిగి యున్నప్పటికిని అది మిశ్రమమేగాని సంయోగద్రవ్యము కాదని స్పష్టమగుచున్నది.

జడవాయువులు : గాలి మిశ్రమమని నిర్ణయింపబడినను, 19 వ శతాబ్దపు చివరవరకు దానిలో జడవాయువులు కలవను అనుమానమైన కలుగలేదు. రసాయన సమ్మేళనములలో ఈ వాయువులు పాల్గొనకపోవుటవలన వీటికి స్తబ్ధవాయువులు లేక జడవాయువులు అనునామము సార్థకమైనది. ఇందు హీలియము, నియాను, ఆర్గాను, క్రిప్టాను, జినాను, రేడాను అను వాయువులు పేర్కొన దగినవి.

1785 వ సంవత్సర ప్రాంతమున ప్రాణవాయువు తొలగింపబడిన గాలిని నైటరుగా మార్చనగుననియు, ఎంత ప్రయత్నించినను దానిలో సుమారు 1/120 వ భాగము మాత్రము ఏ విధమైన మార్పును పొందదనియు, కేవన్ డిష్ అను శాస్త్రవేత్త కనుగొనెను. కాని దానిని అతడు ఉపేక్షించెను. 1892 వ సంవత్సరమున రేలే అను శాస్త్రజ్ఞుడు రాసాయనికముగా తయారుచేసిన నత్రజనికంటె వాతావరణములోని నత్రజని 1/2% ఎక్కువ బరువుగా నున్నట్లు కనుగొనెను. తరువాత రామ్సే, రేలే మున్నగు శాస్త్రజ్ఞుల పరిశోధనమువలన గాలిలో ఒక క్రొత్త మూల పదార్థము ఉండియుండుటయే ఈ భారభేదమునకు కారణమని గ్రహించి దానికి ఆర్గాను అని పేరిడిరి.

ఆర్గాను అనుదానికి తరువాత కనుగొనబడిన వాయువు, హీలియము అనునది. 1860 వ సంవత్సర ప్రాంతమున సంపూర్ణ సూర్యగ్రహణ సమయమందు సూర్యుని చుట్టు నున్న క్రోమోస్ఫియరును (chromo sphere) లేక వర్ణమండలమును వర్ణమాల దర్శినితో (spectro scope) పరిశీలించి, వర్ణమాలలో కనిపించిన ఒక క్రొత్త పసుపుపచ్చ చారనుబట్టి జాన్‌సెన్ (Janssen) అను శాస్త్రజ్ఞుడు, హీలియము ఉన్నదేమో యని అనుకొనెను. అటు పిమ్మట లాకియరు (Lockyer) తన పరిశోధనములవలన వర్ణమండలములో గల ఈ పసుపుపచ్చని చార హీలియము వలననే ఏర్పడినట్లుగా నిర్ణయించెను. 1895 వ సంవత్సరములో ఈ వాయువును రామ్సే అనునతడు క్లెవైటు (clevite) అను ఖనిజమునుండి తయారు చేసెను.

రామ్సే, ట్రావర్సు అను శాస్త్రవేత్తలు 'నియాను' ను 1898 వ సంవత్సరమున కనుగొనిరి. వీ రిరువురే 1908 వ సంవత్సరమున “జినాను వాయువు" ను కూడ కనుగొనిరి . ఈ వాయువు గాలిలో ప్రతి పది లక్షల భాగములకు సుమారు 95 భాగము లుండును. రామ్సే, గ్రే అను శాస్త్రజ్ఞులు “ రేడాను” వాయువును కనుగొనిరి. కాని

349