Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గానశాహిత్యము

సంగ్రహ ఆంధ్ర

చారి, బెంగుళూరు నాగరత్తమ్మ, జంగం కోటయ్యదేవర, మునుగంటి పానకాలు ప్రభృతులు గాత్రగానమున సుప్రసిద్ధ విద్వాంసులు. హరికథా పితామహు డగు ఆదిభట్ల నారాయణదాసు గాయకుడుగా, నర్తకుడుగా, కవివర్యుడుగా గొప్పఖ్యాతిని గాంచెను. చదలవాడ కుమారస్వామి ఫిడేలు, మృదంగ వాద్యముల యందును, అశ్వధాటి రామమూర్తి, పొట్లూరి వీరరాఘవయ్య చౌదరి, వారణాసి ఘంటయ్యశాస్త్రి మృదంగ వాద్యమందును; టి. యన్. రాజరత్నం పిళ్లె, జి. పైడిస్వామి నాగస్వర (కాహళ) వాద్యమందును గొప్పప్రతిభను సంపాదించిరి, ఇంకను ఎందరో పెక్కురు మహానీయులు గతించిరి.

విం. వ. న.

గానసాహిత్యము :

భారతీయ సంగీతము ప్రాచీనకాలమునుండి సంస్కృత భాషారచిత గేయఫణుతుల నాశ్రయించి యున్నది. వైదికగానము సంస్కృతమయములగు మంత్రముల నాశ్రయించినది. భరతుని కాలమునుండి శార్జ్గదేవుని కాలమువరకు గేయఫణుతు లన్నియు సంస్కృత సాహిత్యయుతములుగానే ఉన్నవి. జయదేవుని అష్ట పదులును, నారాయణతీర్థుని శ్రీకృష్ణలీలాతరంగిణియు గీర్వాణభాషామయములే. కాలక్రమమున దేశభాషా సాహిత్యములతో గూడిన గేయములు సంగీతయుతము లైనవి. ఆంధ్రభాషయందు మనుచరిత్ర, వసుచరిత్రల వంటి ప్రబంధములు అలంకార భూయిష్ఠములుగను, రసవద్ఘట్టయుతములుగను, బహువిధ భాషాచమత్కార సహితములుగను వెలసి యున్నట్లు ప్రాచీన సంగీత వాఙ్మయమున బహువిధములగు ప్రబంధము లనబడు గేయఫణుతులు వెలసి యున్నవి. శార్ఙ్గదేవుడు రత్నాకరమున సుమారు నూరు ప్రబంధముల లక్షణములను దెల్పి కొన్నిటికి స్వర సాహిత్య రూపముల నుదాహరించి యున్నాడు. ఏలలు, రాసలక్షణము, వర్ణస్వరము, రాగ కదంబము, శ్రీరఙ్గ ప్రబంధము, పంచతాళేశ్వరము, గీతములు, లక్షణగీతములు, త్రిపద, షట్పద, అష్టపది, హంసలీల, సింహలీల మొదలగు నూరు ప్రబంధములు తెలుపబడినవి.

భారతీయ సంగీతము కాలక్రమమున హిందూస్థానీ, కర్ణాటకసంగీతములని రెండు విధములుగ ఏర్పడి వాడుకలో నున్నది. కర్ణాటక సంగీత విభాగ మేర్పడిన తరువాత దేశభాషా గేయఫణుతులు విపరీతముగ ఏర్పడినవి. కర్ణాటక సంగీతమునందలి గేయఫణుతులలో గీతములు, వర్ణములు, కీర్తనలు, పదములు, జావళులు, రాగమాలికలు, దరువులు, తిల్లానలు, యక్షగానములు, అధ్యాత్మ రామాయణకీర్తనలు, శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు, శ్రీ భద్రాద్రి రామదాసు మొదలగు మహాభక్తులు రచించిన కీర్తనాదులు పెక్కులు, రసవంతములుగ ఏర్పడియున్నవి. ఈ గేయఫణుతులన్నియు శుద్ధ సంస్కృతములును, సంస్కృతాంధ్ర మిశ్రితములు నగు సాహిత్యములలో నున్నవి. ఈ గేయఫణుతులయందు విశేషించి సలక్షణమగు భాషయే గ్రహింపబడినది. అచ్చటచ్చట గ్రామ్య పదప్రయోగములు రంజకత్వము కొరకు చేయబడినవి.

ఈ కర్ణాటక సంప్రదాయమున శాస్త్రీయ సంగీతమనియు, లలితసంగీతమనియు రెండురీతులు గలవు. లలితసంగీతమని పాడబడు పాటలు లక్షణవిరుద్ధ భాషా ప్రయోగయుతములుగ నున్నవి.

కర్ణాటక సంగీత సంప్రదాయమున వాగ్గేయకారు లందరు సంస్కృతాంధ్ర భాషాపాండిత్యముగల వారలు. వీరిలో శ్రీనారాయణ తీర్థులు, శ్రీ క్షేత్రయ, శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు, శ్రీ త్యాగరాజస్వామి, శ్రీ ముత్తుస్వామి దీక్షితులు, శ్రీ శ్యామశాస్త్రి, శ్రీ సుబ్రహ్మణ్య కవి, శ్రీ భద్రాచల రామదాసు అనువారి రచనలే కర్ణాటక సంగీతమును శోభింపజేయు చున్నవి. ఈ రచనల యందలి భాషను విచారించినచో గానసాహిత్య విశేషములు తేటతెల్లముగ దెలియనగును.

కర్ణాటక సంగీతమందలి గీతముల సాహిత్యములు చాలవరకు కన్నడభాషలో నున్నవి. శ్రీ పైడాల గురుమూర్తి శాస్త్రులుగారి గీతములు సంస్కృత భాషయందే రచింపబడినవి – వీరాంధ్రులు. ఆంధ్రదేశమున సంచారము చేయుచు ఆయా పుణ్యక్షేత్రములందలి ప్రధాన దేవతలను గూర్చి గీత కీర్తనాదులు రచించిరి.

బిలహరి గీతము :


పాలయ నాగేశ్వర - వంది బుధావళి
పారిజాత నమామి తవచరణం

342