Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గాణపత్యము

మును మించిపోలేదనియు వినికిడి. దీని స్వారస్య మేమనగా, మహాభారత రచన కొనసాగుటకు శ్రీకృష్ణ పర బ్రహ్మముయొక్క అనుగ్రహము కన్నను గూడ తదభిన్నుడయిన గణపతి ప్రసాదమే ముఖ్యావలంబనమైన దనుట. కృష్ణుడు శ్యమంతక మణిని గురించి అపనిందపాలైన సందర్భములో గణేశపూజ చేసిన పిదపనే నిందలు తొలగెనని స్కాందపురాణ మందు గలదు గదా!

విఘ్నేశ్వరాష్టోత్తరశతనామము లందు 'బ్రహ్మచారిణేనమః' అను నామమును బట్టి కొందరు గణపతికి వివాహము లేదందురు. దుర్వాసముని విరచిత 'ఆర్యా ద్విశతి'లో శ్రీనగర వర్ణన ఘట్టమందు, 'వందే గజేంద్రవదనం వామాంకారూఢ వల్లభాశిష్టం కుంకుమ పరాగశోణం, కువలయినీజారకోరకా పీడం' అని స్తుతింపబడినాడు గణపతి. దీనినిబట్టి ఒకే భార్య అనుకొనవలసి యుండును. కాని సిద్ధి, బుద్ధి అను శక్తులిద్దరు కలరని గణపతి పురాణము. స్కాందపురాణమందు అణిమా, మహిమాది అష్టసిద్ధులను భార్యలుగ గణపతికి ప్రజాపతి యొసగెనని చెప్పబడి యున్నది. నిజము నరసినచో, గణపతి స్వశక్తికు డనకతప్పదు గదా ! ఆ శక్తికి అనేక రూపతయు ఉపపన్నమే యగును.

పార్వతికిని శివునకును చంద్రకళా శేఖరత్వమున్నటులే గణపతికిని కువలయినీజారకోరకాపీడత్వ మున్నదనుటను బట్టి అమృతత్వద్యోతన మున్నది. కావున అమృత పర్యాయమగు బ్రహ్మచారి నామముగూడ సమంజసమే.

శివకుమారుడగు గణపతిని శివారాధకులందరు శిరసా వహించుటేకాక, శివాభిన్నునిగను భావించుచుందురు. బ్రహ్మాండ పురాణాంతర్గత లలితోపాఖ్యానమందు శ్రీనగరవర్ణనావసరమున మహాపద్మాటవికి వెలుపల శతరుద్రులతో నిండిన షోడశావరణములు కలిగి రుద్రాలయ మున్నదనియు, అందు మహారుద్రుడు వసించుననియు, లలితా భక్తులకు వీరు నిర్విఘ్న ఫలప్రదులగుదురనియు చెప్పబడియున్నది. రుద్రాలయము యొక్క నవమావరణమునందు గృత్సపతి, వ్రాత, వ్రాతపతి, గణ, గణపతి, విరూప, విశ్వరూప మున్నగు అష్టాదశ రుద్రులు కలరందురు. ఇటులే విష్ణ్వారాధకులలో గణపతిని విష్ణురూపునిగను, విష్ణువునకు మేనల్లునిగను ధ్యానించుట కలదు. ఇక, రత్నత్రితయములో మిగిలిన దేవిని ఉపాసించెడి వారలకు శక్తిజన్మయగు గణేశుడు అత్యంత ముఖ్యదేవతయై యున్నాడు. బ్రహ్మ గణపతిని పూజించిన పిదపనే తానొనర్చు సృష్టి వెర్రితలలు వేయుట మానెనని పురాణగాథ కలదు.

సాధకులకు మాయీయ, కార్మణ, ఆణవములు అను మలములు మూడు బ్రహ్మవిద్యా ప్రతిబంధకములుగ నుండుననియు, అందు మాయీయ మలమును గణేశతత్త్వమే నివర్తింప జేయుననియు, కార్మణ మలమును శివతత్త్వము నివర్తింప జేయుననియు ఆణవమలమును అంబికా తత్త్వమే నివర్తింప జేయునవియు తద్జ్ఞులు చెప్పుదురు. ఈ త్రివిధమలములతో అసంభావన, సంశయము, విపరీత భావన అను మూడింటిని క్రమరీతిలో పోల్చవచ్చును.

మహార్థమంజరీపరిమళమను గ్రంథమందు గణపత్యుపాస్తి ఆవశ్యకత, 'వాసనా మాతృలాభే౽పి యో౽ప్రమత్తో న జాయతే । తమనిత్యేషు భోగేషు యోజయంతి వినాయకాః' అను శ్లోకమున స్ఫుటీకరింపబడినది. విఘ్న శబ్దమునకు లలితోపాఖ్యాన రీతిగా అష్ట లక్షణములు చెప్పబడినవి: "అలసా కృపణాదీనా, నిద్రా తంద్రా ప్రమీలికా, క్లీబాచ నిరహంకారా" అని. విశుక్రుడను రాక్షసుడు లలితాకటకములోనికి జయవిఘ్నయంత్రమును విసరివేయుటతో, పైన చెప్పిన ఎనిమిది విఘ్న దేవతలు శక్తి సైన్యమును ఆవరించెనట. ఇట విశుక్రుడే జీవభావమని సౌభాగ్యభాస్కరమందు వ్యాఖ్యానింప బడినది. స్వసైన్యము వికావిక లగుట చూచి, విఘ్న యంత్రమును నిర్భిన్నము చేయుటకై లలితాంబ కామేశ్వర ముఖావలోకనము చేయగా, గణేశుడు ప్రాదుర్భవించెనట. 'మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా' అను నామమునకు వ్యాఖ్యలో పుర్యష్ట కాధీశ్వరుడగు ప్రమాత స్వాత్మస్వరూపనిష్కగ్షజ్ఞానజన్యమయిన చిదానంద లాభప్రదమధ్యవికాసము నందుటే గణేశ పదార్థమని తెలుపబడినది. ఈ మధ్య వికాసము యొక్క సహాయము చేతనే దేహాత్మభ్రాంతి యనబడు భండాసురుని సంహారము సాధ్యమగునని వివరణ.

కేరళదేశమున భగవత్సేవ జేయు దినమున తెల్లవారక

331