Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గాణపత్యము

యుగముల పరిణామదశా వైవిధ్యమును నిర్ణయించు విలువగల సాధనసామగ్రి లభించునను ఆశ కలదు. ప్రాచీన ఆంధ్రదేశము యొక్క చరిత్రాధ్యాయములలో లుప్త భాగములను గాజులబండ పూర్తి చేయగలదని తలంపబడు చున్నది. ముందుముందు గాజులబండ క్షేత్ర వైభవము, చరిత్ర ప్రాధాన్యము వెల్లడికాగలవు.

ఆ. వీ.


గాణపత్యము :

మానవుడు నిరతిశయ సుఖము నందుటకు భారతీయ సంస్కృతిలో సోపానములుగ నిర్దేశింపబడిన ఉపాసన మార్గములలో గాణపత్యము ఉన్నతస్థానము వహించి యున్నది. 'ఆదౌ పూజ్యో గణాధిపః' అను ఆర్యోక్తి ప్రకారము మిగిలిన వివిధ దేవతల యుపాస్తికి గణపత్యుపాసన పునాదివంటిది. సుముఖాది స్కంద పూర్వ జాన్త షోడశ నామములను స్మరించినచో, విద్యారంభము, వివాహము, ప్రవేశము, నిర్గమము, సంగ్రామము మున్నగు సర్వకార్యములును నిర్విఘ్నముగ పరిసమాప్తి చెంది ఫలించునని హిందువుల విశ్వాసము.

గణపత్యుపాసనలోని సూక్ష్మాంశములు చాలవరకు విస్మృతప్రాయము లైనట్లు కనపడును. శైవశాక్త తంత్రములందు గణపతి ప్రసక్తి బాగుగనే ఉన్నది. పురాణములందు విపులముగా గణపత్యాఖ్యానములు వివరింపబడి యున్నవి. కేవల గణపత్యుపాసకులు మాత్రము నర్మదా తీరస్థిత ఋష్యాశ్రమము లందును, మలయాళ దేశీయ ఉచ్ఛిష్ట గణపత్యుపాసకు లందును తప్ప తక్కిన ప్రాంతములందు అరుదుగ కాన్పింతురు. మంత్రశాస్త్ర సర్వస్వ మనదగిన శ్రీవిద్య నవలంబించు ఉపాసకులలో గణపతి మంత్రసిద్ధులు ఎందరో నేటికిని కలరు. కాని వారికి అంబికయందే చరమలక్ష్యము.

మాధవాచార్య కృత శంకర విజయనామక గ్రంథ మందును, దానికి వ్యాఖ్యగ ధనపతిసూరి రచించిన శంకర విజయ డిండిమ మందును గాణపత్య మతస్వరూపము నిరూపింపబడి యున్నది. ఈ గ్రంథములను బట్టి గాణపత్యము ఆరు విధములు . ఇవి-మహాగణపతి, హరిద్రా గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, నవనీత గణపతి, స్వర్ణ గణపతి, సంతాన గణపతి అను ప్రభేదములు గల దేవతలకు చెందినవి. ఈ విభాగమునకును శ్రీవిద్యా నిత్యాహ్నికగత పురశ్చరణ ప్రకరణ మందలి పూర్వామ్నాయము ప్రకారము చెప్పబడు షడ్విధ గణపతి మనువులకును ఈషద్భేదమున్నది. ఇందులో మహా గణపతి సనాతనాచార ప్రవర్తకులగు శిష్టజనులచే గ్రాహ్యముగ పరిగణింపబడు చున్నాడు. తక్కిన విభేదములు, ముఖ్యముగ ఉచ్ఛిష్ట గణపతి అధికార భేదమునుబట్టి ఎవరికోగాని సరిపడవని తలపబడుచున్నవి. మొత్తముమీద గాణపత్యము తప్తాంక ధారణమును బోధించుటను బట్టి శ్రీ శంకరాచార్యుల వారిచే నిరసింపబడినది. అయినను, అతప్తాంకము, వేద విరుద్ధము, అద్వైత భావనో పేతము అగు గణపత్యుపాసనము నిషిద్ధముకాదు; మీదు మిక్కిలి అజపామంత్ర తత్పరులకు మూలాధారాది షడ్చక్రములందు గణేశాది ధ్యానము ఆచార్యుల వారిచే విహితముగ ప్రతిష్ఠింప బడినది.

వేదమునందు గణపతి నుద్దేశించిన ప్రార్థనా సూక్తము లెన్నియో ఉన్నవి. కాని గణపతియను నామముతోబాటు బ్రహ్మణస్పతియను నామము ప్రాముఖ్యము దాల్చి యున్నది. ఇది సుప్రసిద్ధమైన 'గణానాంత్వా గణపతిమ్... బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్రుణ్వన్నూతిభి స్సీద సాదనం' అనుమంత్రమందు స్పష్టమగుచున్నది. ఈ బ్రహ్మణ స్పతి విఘ్నేశ్వరుడు కాడనియు, ఈ మంత్రమందలి గణపతి పదము గౌణము మాత్రమే అనియు తలప పని లేదు. ఏల యనగా, జైమిని మహర్షి కృత వేదపాదస్తవమందు గణపతి ప్రశంసగల స్తోత్రము : 'విఘ్నేశ విధి మార్తాండ చంద్రేంద్రోపేంద్ర వందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే' అనునది పై సిద్ధాంతము నిరాధారము కాదని రుజువు పరచుచున్నది. కాలక్రమమున జనబాహుళ్యమునకు సుబోధకములగు పౌరాణిక వర్ణనల మూలముగా విఘ్నేశ్వరుడు, గజాననుడు, లంబోదరుడు మొదలగు గౌణనామములే ప్రచారములోనికి వచ్చి, వైదిక నామములు వెనుకబడ సాగినవని ఊహించ వచ్చును. గణపత్యథర్వశీర్ణోపనిషత్తునందు గణపతి మంత్రస్వరూపము, మాహాత్మ్యము, సర్వదేవ తాత్మకత్వము సువ్యక్తము చేయబడినవి. తైత్తిరీయారణ్యక భాగమగు నారాయణోపనిషత్తులో గణేశునిదగు

329