Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గద్యవాఙ్మయము (తెలుగు)

పోతనామాత్యుడు ప్రబంధ కవుల శ్రేణిలో చేరకపోయినను, వారి గ్రంథము లందలి వచనములు ప్రబంధమందలి వచన రచనల పోలికలనే కలిగియున్నవి ఒక విధముగా తరువాతి ప్రబంధ కవులు వచన రచనమున పోతనను, శ్రీనాథుని అనుసరించిరని చెప్పవలసివచ్చును. శ్రీనాథుని వచనమునకు ఉదాహరణము :

"గుణాద్భుతంబైన పదార్థంబు వర్ణింపకునికి యసహ్య శల్యంబైన వాగ్జన్మ వైఫల్యంబు. ధూర్జటి జటాకిరీటా లంకారంబైన శశాంకుని సౌకుమార్యంబును, నమృతంబునకు నుత్ప త్తిస్థానంబగు పయోనిధానంబు గాంభీర్యంబును, విశ్వ విశ్వంభ రాంభోజ కర్ణికాయ మానంబగు సువర్ణా హార్యంబు ధైర్యంబును, విభ్రమ భ్రూలతాభంగ లీలావిజిత సుమస్సాయక విలాస రేఖాసారంబై నిర్వికారంబైన యాకారం బెవ్వరి యందునుం గలదె?" (శృంగార నైషధము. ఆ. 4-12. )

పోతనామాత్యుని రచన మిట్టిది :

"ఇట్లాభీలంబయిన నిదాఘకాలంబు వర్తింప బృందావనంబు రామగోవింద మందిరంబైన కతంబున నిదాఘ కాల లక్షణంబులం బాసి నిరంతర గిరినిపతిత నిర్ఘరశీకర పరంపరాభాసిత పల్లవిత కుసుమిత తరులతం బయ్యును, దరు లతా కుసుమ పరిమళ మిళిత మృదుల పవనం బయ్యును, బవనచలిత కమల కల్హార సరోవర మహాగభీర నదీ హ్రదం బయ్యును, నదీ హ్రద కల్లోల కంకణ ప్రభూతపంకం బయ్యును, బంక సంజనిత హరితాయమాన తృణ నికుంజం బయ్యును, జన మనోరంజనంబై వసంతకాల లక్షణంబులు కలిగి లలిత మృగపక్షి శోభితంబై యొప్పు చుండె" - (ఆంధ్రభాగవతము - దశమ స్కంధము - పూర్వభాగము - 718)

లాక్షణికులు చెప్పిన విభాగములను దృష్టియం దుంచుకొని పరిశీలించినచో ప్రబంధము లందలి వచనములు, శ్రీనాథుడు, పోతన తమ గ్రంథములందు రచించిన వచనములు, ఉత్కలికాప్రాయము లనదగి యున్నవి. వీనిలో నచ్చటచ్చట ప్రసన్న సులభశైలిలో నున్న వచనములున్నను వాటి భాగము చాలస్వల్పము. అందుచే వీరిని జటిల వచన రచయితలుగనే పేర్కొనవలసియుండును.

వచనైక రచనలు : కేవలము వచన భరితములుగా నున్న రచనలు ఆంధ్రవాఙ్మయమున కొంత ఆలస్యముగా బయలుదేరినవి. కృష్ణమాచార్య విరచిత సింహగిరి వచనములే ప్రథమాంధ్ర వచనగ్రంథము. ఓరుగంటిని పరిపాలించిన ద్వితీయ ప్రతాపరుద్రుని కాలమున నీతడు జీవించినట్లుగా ఏకామ్రనాథుని ప్రతాప చరిత్రము వలన తెలియుచున్నది. అనగా క్రీ. శ. 13 వ శతాబ్ద్యంతమునను, 14 వ శతాబ్ద ప్రథమార్ధమునను ఇతడు జీవించి యుండును. క్రీ. శ. 15వ శతాబ్దమున నివసించిన తాళ్ళపాక అన్నమాచార్యు లీతని పేర్కొనియుండుటచే ఈ అభిప్రాయమునకు బలము కలుగుచున్నది. చరిత్ర తెలిసినంతవరకును, మనకు లభించిన గ్రంథములలోను, సింహగిరి వచనములే ప్రథమ వచనైక గ్రంథము. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమగు సింహాచలమున నివసించి కృష్ణమాచార్యు లీ గ్రంథమును రచించినాడు. ఇవి 'సింహగిరి దయానిధీ' యను మకుటముతో నుండును. వీనికే కృష్ణమాచార్య సంకీర్తనములని నామాంతరము. ఇవి ఇట్లుండును :

“దేవా ! జయపరంధామ ! పరమపురుష ! పరమాత్మ ప్రకాశ! అమృత! అచలాచల! అవ్యక్త! అగణిత దయాంభోధి ! అనాథపతియైన స్వామి! సింహగిరి నరహరి ! నమోనమో దయానిధీ! ఏడు రామాయణంబులు, పదునెనిమిది పురాణంబులు, ద్వాదశస్కంధంబులు, భగవద్గీతలు, సహస్రనామంబులు చదివిరేమి, వినిరేమి, వ్రాసిరేమి ఈ సంకీర్తనకు వేయవ పాలింటికి సరిరావు. కడమ సంకీర్తన లనేకసారులు విన్నారు. ఇందుకు తప్పరాదు. ...మీ దాసులకు కులగోత్రం బెన్న నేమిటికి! మాయతి రామానుజముని పరంధాత అనాథపతియైన సింహగిరి నరహరి ! నమోనమో దయానిథీ !"

సింహగిరి వచనములందు ప్రత్యేకముగా చెప్పతగినది, భక్తిప్రధానమైన ప్రసన్న శైలి. ఈ శైలీ సౌలభ్యమువలననే కాబోలు, దీనికి చక్కని ప్రజాదరము లభించినది.

వేంకటేశ్వరవచనములు: ఇవి తిరుపతి క్షేత్రమున శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్యస్థానమున సంకీర్తనాచార్యులుగా ప్రఖ్యాతిని వహించిన తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు రచించినవి. ఈతడు క్రీ. శ. పదునైదవ శతాబ్ది చతుర్థపాదమున జనించి పదునారవ

283