Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గద్యవాఙ్మయము (తెలుగు)

సంగ్రహ ఆంధ్ర

సంబంధము కలదు. ఒకటి లేనిదే మరొకటి ఉండదు. ఈ కారణముచే, మార్క్స్ తన గతితార్కిక భౌతిక వాద సిద్ధాంతమును ఇతరములైన తాత్వికభావములతో మిళితము చేయలేదు. వేదాంత విషయములకును, వాస్తఒక విషయములకును ఎట్టి సంబంధము లేదని గూడ ఆతడు వాదించెను. ప్రపంచమన నెట్టిదో తెలిసికొనుటకై వేదాంతము సంప్రదాయముగ ఒక సాధనముగ మాత్రమే ఉపయోగపడుచున్నదని ఆత డెరుగును. కాగా, వాస్తవమును తెలిసికొనుట యనగా, విధిగా దానిని పరివర్తనము చేయుటగూడయని మార్క్స్ సిద్ధాంతము బోధించును.

మార్క్స్ సిద్ధాంతములకు వ్యతిరేకముగా మరికొన్ని విమర్శనములు బయలుదేరినవి. చారిత్రక పరిణామదశలో విభిన్నాంశములు ఇమిడియున్నవి. మార్క్స్ నుడివినట్లు, ఆర్థిక కారణములచే బ్రహ్మాండమైన శక్తులు ఉద్భవమగునను విషయమును అంగీకరించినను, బెర్ట్రాండ్ రస్సెల్ చెప్పినట్లు, అవన్నియు ఒక్కొక్కప్పుడు దురదృష్టకరములైన స్వల్పసంఘటనలమీద ఆధారపడియుండును. ఈ సంఘటనలే చారిత్రకసంఘటనలను నిర్ధరించును. ఒక సంఘటన జరుగుటకు పెక్కు పరిస్థితులు కారణభూతములగును. మానవుడు అవన్నియు తెలిసికొనజాలడు. అందుచే ఆర్థికకారణములు మాత్రమే బ్రహ్మాండమైన శక్తులను సృష్టింపగలవని చెప్పుట సరియైనది కాదు.

ఇదియేగాక, లిఖితపూర్వక మైన చారిత్రకాంశములకు ఒక్కొక్క సమయములో గతితార్కిక సిద్ధాంతము అన్వయమగునట్లు కన్పింపదు. పెట్టుబడిదారీ విధానమునకు కమ్యూనిస్టు విధానము ప్రత్యర్థియని గతితార్కిక వాదము ఒక వంక సిద్ధాంతీకరించుచునే, మరొకవంక పెట్టుబడిదారీ విధానములో గల సద్విషయములను కమ్యూనిస్టు విధానము తనలో ఇముడ్చుకొనగలదని వాదించును. కాగా, ఉదాహరణమునకు, అంతర్జాతీయ ఉద్రిక్తత యుద్ధమునకు త్రోవతీసి, నాగరికతయంతయు నశింపగా, ఆ తర్వాత కమ్యూనిజముకాక, అనాగరికత మాత్రమే విలయతాండవము చేయగలదుకదా ! అణు, ఉదజనిబాంబులు ఈనాడు కలిగింపగల వినాశమును మార్క్స్ తన కాలములో ఊహింపలేదు. అందుచే అతడు ప్రతిపాదించిన గతితార్కిక భౌతిక వాదము అన్నివిధముల అప్రామాణ్యమైనది.

శ్రీ. శ్రీ.


గద్యవాఙ్మయము (తెలుగు) :

గద్యము - వచనము : ఆంధ్ర లాక్షణికులు 'గద్య', 'వచన' పదములను గురించి ఆయా సందర్భములందు ప్రస్తావించియున్నారు. ఆదికవి నన్నయభట్టు తన మహాభారతమునందలి అవతారికలో “వచనరచనావిశారదులైన మహాకవులును" అని ప్రస్తావించెను. తిక్కన సోమయాజి తన విరాటపర్వ పీఠికలో "పద్యముల గద్యములన్ రచియించెదన్ కృతుల్" అని గద్యపదమును. “వచనము లేకయు వర్ణన-రచియింపగ కొంతవచ్చు బ్రౌఢులకు" అని నిర్వచనో త్తరరామాయణ పీఠికలో 'వచన పదమును' వాడెను. దీనిచే తిక్కనసోమయాజి కాలమునాటికి (క్రీ. శ. 13 వ శతాబ్ది) గద్య, వచనపదములు సమానార్థకములుగా తెలుగునాట వ్యవహరింపబడజొచ్చెనని స్పష్టమగుచున్నది. కన్నడభాషలోగూడ బసవేశ్వరుడు రచించిన షడ్‌స్థలవచనము, కాలజ్ఞానవచనము అను గద్యకృతులు వచనములు గానే పేర్కొనబడినవి. అనంతామాత్యుడు (15 వ శతాబ్ది) తన ఛందోదర్పణ గ్రంథమున నిట్లు చెప్పెను :


"కనుగొనఁ బాదరహితమై
 పనుపడి హరిగదైవోలె బహుముఖరచనం
 బున మెఱయు గద్యమది దాఁ
 దెనుఁగుకృతుల వచనమనఁగ దీపించు కడున్".

మరియు అప్పకవి (1656) ఇట్లు చెప్పెను :

"ధరసాహిత్యము గద్యపద్యములనం
            దా రెండు భేదంబులై
 పరుగు న్గద్యమునందు బాదనియతుల్
            భావింపగాలేవు వా
 క్స్ఫురణంబై విలసిల్లగా నుడువ నొ
            ప్పుం గావ్య మెంతేనియున్
 మరు తండ్రీ మఱి దీనికే వచన నా
            మంబయ్యె నాంధ్రంబునన్ "
                      (అప్పకవీయము IV-23, పేజీ 184)

కందుకూరి వీరేశలింగముగా రిట్లు చెప్పిరి :

“రమారమి నలువది సంవత్సరముల క్రిందట తెలు

280