Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గణితశాస్త్ర చరిత్రము

1736 - 1813). తాను నిర్మించిన 'ప్రమేయ శాస్త్రము' (Theory of functions) నకు దీనిని అతడు ప్రాతిపదికగా నిర్మించెను. 'లెగ్రాంజి' టూరిన్ నగరములో జన్మించి, 19 వ యేటనే ఆ నగరమున గణితశాస్త్రాచార్య పదవి నాక్రమించెను. ఆయిలర్ సెయింట్ పీటర్స్ బర్గుకు వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెడరిక్ ది గ్రేట్ (Frederick the Great) అతనిని బెర్లిన్ నగరమునకు ఆహ్వానింపగా, అచటకుపోయి, ఫ్రెడరిక్ మరణానంతరము వరకు, అతడచ్చటనే యుండి అనంతరము ఫ్రాన్సు దేశమున వివిధ ప్రాంతములలో గణితశాస్త్రాచార్య పదవి నధిష్ఠించెను. 'లెగ్రాంజి' తన ప్రథమ పరిశోధనమందు, విశిష్ట కలన గణితములో Calculus of Variations లోగడ ఆయిలర్ గావించిన పరిశోధనలను గణిత విశ్లేషణ పద్ధతులచే మెరుగొనరించి, అనేక నూతన విషయములను అందు చేర్చుటయేగాక, అదివరకుండిన విషయము నంతయును క్రోడీకరించెను. ఈ విశిష్టకలనమును చలన శాస్త్రమునకు అనువర్తింపజేసి, అదివరకే ఆయిలర్ చే నిర్వచింపబడిన 'కనిష్ఠతమ కార్యసూత్రము' (Principle of least action) నకు గణితపద్ధతి నిర్మించెను. ఇతడు అంకశాస్త్రమునను, సమీకరణ శాస్త్రమునను గావించిన పరిశోధనలు అతి ముఖ్యములు. తనజీవితమందలి ఉత్తరార్ధమును ఇతడు 'విశ్లేషక ప్రమేయశాస్త్రము'(Theory of analytic functons), 'విశ్లేషక యాంత్రిక శాస్త్రము' (Analytic mechanics) అను గ్రంథముల రచనకై వినియోగించెను. వీటిలో రెండవది న్యూటన్ రచించిన “ప్రిన్సిపిక్ మాథిమాటికా" (Principic mathematica) అనుగ్రంథము తర్వాత సుమారు నూరు సంవత్సరములకు రచింపబడి, న్యూటన్ తర్వాత వెలసిన గణితవిశ్లేషణ పద్ధతుల ప్రతిభను సంపూర్ణముగ ప్రదర్శించెను. "లెగ్రాంజి చలనసూత్రము" (Legrange Equations of motion) లని ప్రసిద్ధిబడసిన సూత్రములు ఈ గ్రంథములోనివే. న్యూటన్ యొక్క క్షేత్రగణిత పద్ధతు లంతటితో స్వస్తిచెప్పబడి విశ్లేషణ గణితపద్ధతులు వాడుకలోనికి వచ్చెను. లెగ్రాంజి రచించిన 'విశ్లేషక యాంత్రికశాస్త్రము' విశ్లేషక గణితమునకు అఖండ విజయపతాకము.

18వ శతాబ్ది చివరలో జీవించిన గణిత శాస్త్రజ్ఞులలో చెప్పుకొన దగినవాడు లెప్లాస్ (Leplace 1725-1799) అను ఫ్రెంచి శాస్త్రజ్ఞుడు. ఇతడు నెపోలియన్ వలనము, 18 వ లూయీ వలనను అనేక గౌరవములనుపొంది ఆ కాలపు గొప్ప గణితశాస్త్రవేత్తలలో నొకడుగా పరిగణింపబడెను. అతడు రచించిన “విశ్లేషక అవకాశ శాస్త్రము", "ఖగోళ యాంత్రిక శాస్త్రము", అతి ముఖ్యగ్రంథములు. న్యూటను నుండి అప్పటివరకును పోగైన విజ్ఞానమంతయు ఈ బృహద్గ్రంథములలో క్రోడీకరింపబడినది. దీనిలో రెండవది 5 సంపుటములుగా నున్నది. 'లెప్లాస్ సమీకరణము', 'లెప్లాస్ పరివర్తనము' మున్నగునవి ఈ గ్రంథములలోనివే.

19వ శతాబ్దమున గణితశాస్త్రము సర్వతోముఖాభివృద్ధిగా౦చెను. 18 వ శతాబ్ది చివరిభాగమున నున్న లెగ్రాంజ్, లెప్లాస్, ఆయిలర్ మున్నగు మహా మేధావులు తమ పరిశోధనా ఫలితముగ గణితశాస్త్రమున నిక మిగిలినదేదియు లేదనిపించినారు. ఫ్రెంచి విప్లవమునకు కారణభూతములగు మానవ మానసిక ప్రవృత్తులు, ముఖ్యముగా పురాతన విజ్ఞానముతోడి తెగతెంపులు విజ్ఞాన విషయమున నూతన దృక్పథములు మున్నగునవి, ఈ శాస్త్రమునను ప్రవేశించి క్రొత్తమార్గము లనేకము లన్వేషింపబడెను. ఇదివరలో గణితము, యంత్ర శాస్త్రమునకును, జ్యోతిశ్శాస్త్రమునకును అనుబంధరూపముగా నుండెను. ఆ శాస్త్రములలో ప్రగతికి వలయు గణితపరిశోధనములే జరుగుచుండెను. ఇప్పటినుండి ఇట్లుగాక గణితశాస్త్రము గణితశాస్త్రము కొరకే యను భావము గాఢముగా నాటుకొనిపోయి, పూర్వపు నియమములను, నిబంధనములను అన్నిటిని త్రెంచుకొని మహాప్రవాహము వలె వెల్లివిరిసినది. పూర్వపు గణితజ్ఞు లెల్లరును యంత్ర శాస్త్రమునను, జ్యోతిశ్శాస్త్రమునను పరిశోధనలు జరిపిన వారే. ఇప్పటినుండి ఇట్లుగాక, ప్రత్యేక శాస్త్రశాఖలలో అత్యున్నత ప్రవీణులు (Specialists)బయలుదేరిరి. పూర్వ గణితజ్ఞులవలె అన్ని శాఖలలోను సమానప్రావీణ్యము గలవారు ఈ శతాబ్దిలో ప్రపంచ మేధావులలో నత్యుత్తమ శ్రేణికి చెందగలవారు నలుగురైదుగురు మాత్రమే కనిపించుచున్నారు. అట్టి మహామేధావులలో మొదట చెప్పు

269