Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గణపతిదేవుడు - కాకతి

జయించెను. అట్టి దుర్ఘట సమయమున తోడ్పడిన సేనానులకు సత్కారములను, బిరుదములను ప్రసాదించి గౌరవించెను. ఉదాహరణమునకు బొప్పదేవునకు “గోదావరీతీర సమర గాండీవి”, “గొంటూరి నాగదేవ తలగుండు గండ" మొదలగు బిరుదము లిచ్చుట. ఈ విధముగా సామంతరాజుల తిరుగుబాటనెడి పెనుగాలికి పునాదులు కదలబూనిన విపుల సామ్రాజ్య సౌధమును సురక్షితమొనర్చి క్రీ.శ. 1267 వ సంవత్సరమున గణపతిదేవుడు దేహమును చాలించెను.

రాజధాని : గణపతిదేవుడు రాజ్యవిస్తీర్ణమును పెంచి, సమర్థులైన సేనానుల సాయముతో దానిని రక్షించుటతో పాటు దేశమునకు ఆయువుపట్టైన రాజధానీనగరమును గూడ పటిష్ఠ మొనర్చెను. అనుమకొండను కొన్నాళ్ళు ముఖ్యనగరముగా నుంచుకొని, తరువాత రాజధానిని ఓరుగంటికి మార్చెను. అందు బలిష్ఠమైన దుర్గమును (భూమికోట), తన్మధ్యమున సమున్నత రాజభవనమును, దాని చుట్టును ఎత్తైన శిలాప్రాకారమును, దానిని ఆనుకొని లోతైన అగడ్తను నిర్మించెను. రాజభవనములను గోపురములతోడను, బంగారు కలశములతోడను, అలంకరించి కోటయొక్క ప్రాకారములోనే రాజవీథులను, రధగజతురగపదాతి వర్గములకు అనువైన నెలవులను ఏర్పరచెను. అహోరాత్రములును వీరభటులచే కోటను కాపలా కాయించెను. నాటి ఓరుగంటి శోభకు ఢిల్లీ సుల్తానులకు సైతము కన్ను కుట్టినది.

గణపతిదేవుని ఒద్దనున్న ఉద్యోగులు : విశ్వేశ్వర శివదేశికులు (శివదేవయ్య) సచివాగ్రణి, గోవిందనాయకుడు, బయ్యపనాయకుడు, హేమాద్రిరెడ్డి, గంగయ సాహిణి, భోజమంత్రి, చెన్నాప్రగడ గణపామాత్యుడు, ఇందులూరి సోమరాజు, పెద్ద గణ్ణనరాజు మహాప్రధానులు. మేచయ నాయకుడు ఏకశిలానగర పాలకుడు. ప్రోలరౌతు తంత్ర పాలుడు. సివిరి అన్నయ చక్రవర్తికి సర్వాధికారి. దామనామాత్యుడు కార్యభరణుడు. ఇంకను తిక్కచమూపతి, పోతన, భాస్కరుడు, నూవుల మంచిరాజు, దేవరాజు మొదలగువారు మంత్రులుగా నుండిరి.

మతము : గణపతిదేవుడు అద్వైత వాదియని గణపాంబ వేయించిన యెనమదల శాసనమువలన తెలియుచున్నను, ఆతడు శైవమునం దధికమైన గౌరవమును ప్రకటించెను. మతసహనము లేనివాడయి జైన బౌద్ధములను అవమానించెనట ! ముప్పదియారు జైనుల గ్రామములను నాశనము చేయుటయేగాక, పెక్కు జైన బౌద్ధ దేవాలయముల పడత్రోయించెనట ! బ్రాహ్మణులకు ప్రతికూలముగా నుండిన జైనులైన కంసాలుల నుండియు, సెట్టి పెద్దలయిన తెలగాల నుండియు గ్రామకరణోద్యోగములను తొలగించి వారి ఉద్యోగములను నియోగి బ్రాహ్మణుల కిప్పించెను. అనులోమ విలోమ వివాహముల నంగీకరించి రాజకుటుంబమునే దానికి ఉదాహరణ మొనర్చెను.

గణపతిదేవుడు విశ్వేశ్వర శివాచార్యుని (శివదేవయ్య) ఒద్ద శివదీక్ష గైకొనెను. అతఁడు "మందర" మను గ్రామమును, రుద్రమదేవి వెలగపూడి గ్రామమును, ఆచార్యునకు దానము చేసిరి. (శా. శ. 1183) విశ్వేశ్వర శివుడా రెండు గ్రామములను గలిపి "విశ్వేశ్వర గోళకి" యను పేరిట ఒక అగ్రహారమును బ్రతిష్ఠించి యచట విశ్వేశ్వర దేవాలయమును, ఉచిత భోజన విద్యాసౌకర్యాదులతో సత్రమును, ప్రసూత్యారోగ్యశాలలను సమస్త సౌకర్య సంభరితముగ ఏర్పరచెను. ఈ గోళకీ మఠములు తమ శాఖలను క్రమముగా పుష్పగిరి, త్రిపురాంతకము, తిరుప్పురన్ కున్రం, దేవికాపురము లందు వ్యాప్తినొనర్చి విజ్ఞానప్రచార కేంద్రములై వరలెను. ఈ సంస్థలకు దొరికిన రాజాదరణము అమితము. వీని నన్నింటిని పర్యవేక్షించుటకై స్థానాచార్యు డనువాడు నియమితుడై యుండెను. ఈ విధముగా గోళకీ మఠములు స్వయం సమృద్ధములై, విద్యాసంస్థలుగనే గాక, ఆదర్శప్రాయమైన ఆర్థిక సంస్థలుగా గూడ పెంపొందినవి. వీనిని పోషించిన కీ ర్తి గణపతిదేవునకు దక్కు చున్నది. ఈ సంస్థల కెల్ల విశ్వేశ్వర శివాచార్యులవారు సర్వాధికారిగా నుండెను.

పరిపాలనము : గణపతిదేవుని పరిపాలనము నందు ముఖ్యరాజ్యతంత్రజ్ఞుడు ప్రధానమంత్రియైన శివదేవయ్య. "ఈతడు ఈశ్వరుడు గాని మనుజమాత్రుండుగాడు" అని తిక్కనసోమయాజి యంతటివాడు శివదేవయ్యను కీర్తించినాడు. ఈతడు రచించిన 'పురుషార్థసార' మను గ్రంథమున రాజనీతిని——

245