Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గజశాస్త్రము

వాసనలు వచ్చువైపునకు పరుగెత్తు హస్తి గంధగజ మని యెరుంగునది. ఈ జాతి ద్విపములు సర్వఋతువుల యందును మత్తిల్లి యుండును. ఇట్టి గంధగజము లెంతయు శుభకరములు.

గజదేహలక్షణములు : ముంగాళ్ళు, శిరస్సు, వ్యక్తములై యుండుట, వక్షస్సు సమున్నతమై యుండుట, దంతములు బంగారు వన్నెకలిగి యుండుట, నేత్రములు తేనెవన్నెగా గాని, గోరోచనపు వన్నెగాగాని యుండుట, ఆరోహస్థలము విడిగా తేలియుండుట, కుక్షి, పార్శ్వములు నిండుగా నుండుట, వృష్ఠభాగము విపులముగానుండుట, సంధులు సమముగా నుండుట, ఛాయ స్నిగ్ధముగా నుండుట, నిడుపుదనము, వైశాల్యము, చక్కదనము అనునవి గజదేహమున కుండవలసిన గుణములు.

అష్టాంగములు : తొండము, ముఖము, దంతములు, నేత్రములు, శిరస్సు, చెవులు, మెడ, వెనుక భాగము ఇవి గజముల అష్టాంగములు .

ఉపాంగములు : పెదవులు, నడుము, పొట్ట, బొడ్డు, అండములు, తోక మొదలు, అఱకాళ్ళు, గోళ్ళు, - ఇవి గజముల ఉపాంగములు.

ప్రత్యంగము : వ్రేళ్ళు, తొండము తుదిభాగము, కుంభస్థలము, మస్తకము, కేసరము (1) మణి(?) పాదాసనము ఇవి ప్రత్యంగములు.

అంగాధిష్ఠానదేవతలు : 1. తల - బ్రహ్మ; 2. నుదురు - కుమారస్వామి; 3. మస్తకము - వీరభద్రుడు; 4. నేత్రములు - సూర్యచంద్రులు; 5. నాసిక - విఘ్నేశ్వరుడు; 6. శ్వాసము - రుద్రులు; 7. ముఖము భాగ్యలక్ష్మి; 8. దంతద్వయము - వీరలక్ష్మి ; 9. దంతాగ్రములు - యముడు: 10. కపోలము - నృసింహస్వామి; 11. పాదములు - వేదములు ; 12 తొండము - శ్రీమహావిష్ణువు; 13. నఖాగ్రము-అష్టమిచంద్రుడు; 14. వేగము - మారుతము; 15. నాభి - అగ్ని; 16. కుక్షి - బ్రహ్మ; 17. మేడ్రము - ప్రజాపతి; 18. అన్యావయవములు - దిక్పాలకులు,

గజాయుఃప్రమాణము : గజముల సంపూర్ణాయుఃప్రమాణము నూటయిరువది సంవత్సరములని శాస్త్రజ్ఞులు నిశ్చయము. సర్వలక్షణ సంపన్నములైన భద్రజాతి సంపన్నములకే యీ సంపూర్ణాయుషు జీవనభాగ్యము గలుగును. మందజాతిహస్తి యెనుబదియేండ్లును, మృగజాతి కుంభి నలువదియేండ్లును, ఆయుఃప్రమాణము గలవియై యుండును. హస్తి జీవితప్రమాణము వాని దేహముల యందున్న క్షేత్రము లనబడు లక్షణములనుబట్టి యేర్పడును. ఇట్టి గజదేహక్షేత్ర పరిజ్ఞానము వాని యాయుః ప్రమాణమును తెలిసికొనుటకే గాక, తత్పోషణ చికిత్సాదులకును, మిక్కిలి యవసరమని హరిహర చతురంగ గ్రంథమున నిట్లు చెప్పబడినది :


'ప్రదేశాన్ గజదేశస్థాన్ యోనజానాతి తత్త్వతః
లక్షణం న సజానాతి నాపివేత్తి చికిత్సితమ్'.
                           (గజపరిచ్చేదము 159 శ్లో:)

ఈ క్షేత్రములు పండ్రెండు. 1. తొండము, 2. ముఖము, 3. దంతయుగ్మము, 4. శిరస్సు, 5. నేత్రద్వయము, 6. కర్ణ యుగళము, 7. మెడ, 8. ముందటి కాళ్ళభాగము, 9. వక్షము, 10. వెనుకటి కాళ్లభాగము, 11. మేడ్రము, 12. తక్కినకాయము. ప్రథమ క్షేత్రమయిన తొండము, లక్షణానుగుణముగా లేదేని ఆయుఃప్రమాణములో పది సంవత్సరములు తగ్గినట్లు తెలిసికొనవచ్చును. అనగా ఇట్టి భద్రజాతి గజము నూటపది సంవత్సరములు మాత్రమే జీవించునని భావము. ఏవైనను రెండు క్షేత్రములలో లోపముండెనేని యట్టిది నూఱేండ్లు జీవించును. ఇట్లు హీనమైన లక్షణము ఒక్కొక్క దానికిని పదేండ్ల చొప్పున తగ్గించి గజాయుఃప్రమాణమును నిర్ణయించుకొనవలెను. మందమృగజాతి హయముల విషయములో ఆయుఃప్రమాణమును పండ్రెండుభాగములు చేసి, హీనక్షేత్ర మొక్కొక్క దానికి ఆ పండ్రెండవ భాగమునకు వచ్చిన సంవత్సరములను ఆయుఃప్రమాణములను తగ్గించి శేషించిన మొత్తమునే ఆయుఃప్రమాణముగా నిర్ణయించి చెప్పవలెనని గోదావర మిశ్రుఁడు నుడివెను. (హ. చతు. గజప 11-12). ఈ ఆయుఃప్రమాణ లక్షణములు, బాహ్యములనియు, అభ్యంతరములనియు రెండువిధములుగా నుండవట! అభ్యంతర లక్షణజ్ఞానమున యోగులుమాత్రమే సమర్థులు. తక్కినవారు పూర్వోక్తబాహ్య లక్షణములను బట్టియే ఆయుఃప్రమాణము నిర్ణయింతురనియు గోదావరమిశ్రుడు వ్రాసెను.

229