Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గజశాస్త్రము

5. చంద్రాంశకము : మెడలో త్రివళులును, తేనెవన్నె కన్నులును, మొగలిపూరంగు దంతములును, పెద్దదియు, ఎఱ్ఱనిదియు నగు తొండముయొక్క చివరిభాగమును, (పుష్కవము)సిబ్బెమును, తెల్లని మేనును గల కరీంద్రము చంద్రాంశసంజాతము. విజయప్రదము.

6. అగ్న్యంశకము : అగ్నిజ్వాలలవలె, తీష్ణములైన రోమములతోను, గోరోచనపు వర్ణముగల నేత్ర పుచ్ఛశుండాగ్రముల తోను దైవారునట్టిది అగ్న్యంశకమున ఉద్భవించిన యేనుగు. ఈ జాతి గజము యుద్ధమున సాక్షాత్తుగా అగ్నివంటిదియై విజృంభించి, శత్రుసేనలను భస్మము చేయును.

7. అగ్నిమరుదంశకము : ఉక్కువన్నె దేహము, ఎఱ్ఱని చెవులు, దీపశిఖలవంటి నఖములు, కండలుపట్టిన అవయవములుగల గజము అగ్నిమారుతాంశకము. ఉభయ దేవతాంశోద్భూత మైన యీ హస్తి అతి కోపము గలది. ఇది అంకుశమునకు లొంగదు.

8. విష్ణ్వంశకము: దంత మధ్యమునుండి క్రమముగా సన్నగిల్లు తొండము, సుగంధ శీకరములుగల నిశ్వాస వాయువులు, మేఘగర్జితమువంటి ఘీంకారము, కాటుకవలె నల్లనికాయము, మృదువులైన రోమములు, గుండ్రనివియు - ధృఢములైనవియు - పచ్చని మొగలి పూరేకుల వన్నెతో మెరయునవియు అగు దంతములు, పొడవై రోమవంతములైన పెదవులు, సమములైన గండ స్థలములు, చూడముచ్చటైన మోము, తేనెవన్నె కనులు, మృదువులై - దళములై - విస్తృతములై - భేదరహితములై, నరములు లేనివై యొప్పి తాళదుందుభిధ్వనులు వెలయించు కర్ణములు, సమున్నతములు-వ ర్తులములు - సమప్రమాణము గలవియు నగు కుంభములు, తిన్నని కురుచ మెడయు, ధృఢములు - క్రమముగా క్రిందికి పోనుపోను కృశములైన పాదములు, కూర్మాకారము గలిగి తెల్లనైన నఖములు (ఇరువదికాని పదునెనిమిదికాని) విశాలమైన వక్షము, ఎక్కిడిన వింటివంటి వెన్ను, పొడవైనదియు, సన్ననిదియు నగు తోక, శంఖచక్ర గదాకారములైన బిందువులు - వళులు - అనువిధముగా నున్న అవయవాది విశేషములతో ఎసలారు గజము విష్ణ్వంశ సంజాతము. ఈ మహాద్విపము పట్టాభిషేకాదులైన మహోత్సవములలో నుపయోగింపదగినది. సర్వశుభకార్యముల యందును పూజనీయము - సర్వాభ్యుదయ హేతువు.

సత్వభేదమున గజభేదములు : 1. సూక్ష్మాహారముననే తృప్తిపడునది. వళిరేఖలు లేనిది, ఊహగలది, చలింపనిది, శౌర్యముగలది, దేవసత్వ గజము.

2. తెలివి, క్రియాదక్షత, కాముకత్వము, మార్దవము, స్తబ్ధత, నృత్యాదులం దాసక్తి - అను గుణములు గలది గంధర్వ సత్వగజము.

3. నిచ్చలు నీటిలో మునుగ గోరునదియు, ఎల్లప్పుడును చిఱ్ఱుబుఱ్ఱు లాడునదియు, పిరికిదియు, తిండిపోతును అయినది బ్రాహ్మణ సత్వజాతము.

4. ఉదారము, శూరము, నిత్యోత్సాహి ద్వంద్వయుద్ధపటువు, భయరహితమునయిన గజము క్షత్రియ సత్వము.

5. నోటిలోను, దంతసంధియందును, ఆహారము దాచుకొను నదియు, ప్రజ్ఞగలదియు, దీర్ఘరోషియు వైశ్య సత్వద్విపము.

6. మలినాశయము, మూర్ఖస్వభావము గలిగి శిక్ష చేతనే వశపడునట్టిది శూద్రసత్వగజము. ఇది యుద్ధమున మిక్కిలి పరాక్రమించును.

7. విశ్వాసము లేనిదియు, క్రూరమైనదియు, కుటిలగతిగలదియు పొగరుబోతును అయినది సర్వసత్వకము.

8. వివేకహీనమై, ఉన్మార్గగామియై, పిచ్చిచేతలు చేయునది పిశాచసత్వ సంభవము.

9. రాత్రులయందు స్వైరవిహారము సల్పుచు, మానవుల చంపనుద్యమించుచు విశేష జవసత్వముగలది రాక్షస సత్వోత్పన్నము.

గజప్రకృతులు : వీనిలో దేవ, గంధర్వ, బ్రాహ్మణ, క్షత్రియ' సత్వజాతములు నాలుగును సత్వగుణ సంపన్నములుగా పరిగణింపబడినవి. ఇవి కఫప్రకృతులును, స్నిగ్ధములైయుండును. వైశ్య, శూద్ర సర్పసత్వజములయిన మూడును రాజసగుణ ప్రధానములు. ఇవి పిత్తప్రకృతులు. వీని శరీరము లెల్లప్పుడును వేడిగానుండును.

పిశాచ, రాక్షస సత్వోత్పన్నములు తామసభూయిష్ఠములు, వాతప్రకృతులు.

227