Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

ఖనిజసంపద (ప్రపంచమున, భారతదేశమున)

1959 లోహసంబంధ ఖనిజముల ఎగుమతి (కోట్ల రూ.) మొత్తము ఎగుమతులు (కోట్ల రూ.)
జనవరి 2.85 44.97
జూన్ 3.47 42.33

ఈ నవీనయుగమందు దేశపురోభివృద్ధికి ఉక్కు వెన్నెముక వంటిది. ఉక్కు తయారునందు కావలసిన పదార్థములు ముఖ్యముగ ఇనుము, బొగ్గు, సున్నపురాయి. ఇనుము భారతదేశమందు విస్తారముగ గలదు. ఇనుప ఖనిజమునుండి ఇనుమును వేరుచేయుట, ఒక విధ మైన తక్కువరకపు ఉక్కును తయారుచేయుట ఈ దేశమందు 3500 సం. ల నుండి జరుగుచున్నది. మనదేశమందలి ఇనుము అధికలోహశాతము గలది. అమెరికాదేశమందు 50 లోహశాతమువరకును, బ్రిటన్‌యందు 40 లోహశాతమువరకును ఉపయోగింపబడుచున్నది. కాని ఈదేశమున 60-65 లోహశాతము గల ఇనుప ఖనిజము ఎక్కువగా వాడబడుచున్నది. ఒక్క బీహారురాష్ట్ర మందలి సింగభూమి ప్రాంతమునందే 60-65 లోహశాతము గల ఖనిజము 21,000 మిలియను టన్నులు కలదని అంచనా. కావున ఈ దేశమున ఎనలేని ఇనుపఖనిజ సంపద కలదని చెప్పవచ్చును.

బొగ్గుసంపద యందు కూడ ప్రస్తుతము ఈ దేశమున కొదువలేదు. రానిగంజ్, ఝరియా ప్రాంతములలో బొగ్గు 1950 నాటి లెక్కల కంటె రెట్టింపు గలదని రుజువు చేయబడినది. 1961 నాటికి బొగ్గు ఉత్పత్తి 39 మిలియను టన్ను లుండునని అంచనా. ఉక్కు కర్మాగారములు, రైళ్లవసతులు దినదినము వృద్ధినొందుచుండుటచే రానున్న పంచవర్ష ప్రణాళికలో దీని ఉత్పత్తిని రెట్టింపు చేయవలసి యుండును. బొగ్గు సంపద యందు ఈ దేశము స్వయం సమృద్ధమే అయినను, దానిని వెలికితీయు విధానములలో కొంత జాప్యము కాననగును.

సున్నపురాయి యందును ఈ దేశమునకు ఎనలేని సంపద కలదు. ఒక మిలియను టన్నుల ఉక్కు ఉత్పత్తికి 540,000 టన్నుల సున్నపురాయి కావలెను. ప్రస్తుతము పనిచేయుచున్న 5 ఉక్కు కర్మాగారములలో నాలుగింటికి ఈ ఖనిజము ఒరిస్సా రాష్ట్రములోని సుందరగార్ జిల్లా నుండియే వచ్చుచున్నది. భిలాయ్ కర్మాగారమునకు 12 మైళ్ల దూరములో ఇది దొరకును. సున్నపురాయి ఉక్కు తయారీ యందే కాక ప్రాజెక్టులు, భవనములు మున్నగు వాటి నిర్మాణమందు ఉక్కుతో సమ ప్రాతినిధ్యము గల సిమెంటు తయారునకు ముఖ్య పదార్థము సిమెంటునకు ఉపకరించు రాయి భారతదేశమందలి ప్రతి రాష్ట్రమునను దొరకును (ఒక్క పశ్చిమ బెంగాల్ తప్ప). 1950-51 నందు సిమెంటు ఉత్పత్తి 2.7 మిలియను టన్నులు. 1959-60 నందు 7 మిలియను టన్నులు తరువాత ఉక్కు తయారునకు కావలసిన మేంగనీసు ఎన్నో రెట్లెక్కువగా ఈ దేశమందు ఉత్పత్తియగుచున్నది. కావున ఈ ఖనిజమునకు భారతదేశమందు కొరత ఉండదు.

తరువాత దేశాభివృద్ధికి ముఖ్యమైనది పెట్రోలియము నూనె. ఈ నూనె యందు భారతదేశమునకు స్వయం సమృద్ధిలేదు. దగ్గరలో లభించు సూచనలుకూడ తక్కువ. మొట్టమొదటగా ఈ దేశమున అస్సాములోని దిగ్బాయి, పశ్చిమ పంజాబులోని అట్టక్ ప్రాంతములనుండి నూనె తీయబడుచున్నది. ఈ ప్రాంతములను వృద్ధికి తీసుకురా గల్గిన యెడల, మూడవ ప్రణాళికాంతమునకు దేశావసరములలో మూడవవంతు నూనె ఉత్పత్తి చేయవచ్చును. (అనగా 12 మిలియను టన్నులు). దిగ్బాయినుండి సంవత్సరమునకు 270,000 టన్నులు ఉత్పత్తియగును. కాని ఈమధ్య రష్యా, రుమేనియా దేశముల సహాయముతో పెక్కు క్రొత్త నూనెగనులు కన్గొనబడినవి. అందు నహర్ కాతియా, మేరాన్. జ్వాలాముఖి, కాంబే, హోషియార్ పూరు, శిబ్‌సాగర్ ప్రాంతములు చెప్పుకొన దగినవి. మొదటి రెండు ప్రాంతములనుండి 10,000 లేక 13,000 అడుగుల లోతునుండి నూనెను సాలుకు 2.75 మిలియను టన్నులు తీయ వీలగునని అంచనా వేయబడినది. ఈ పరిస్థితుల కారణముగా నూనె విషయములో ఈ దేశముయొక్క పరిస్థితి కొంత ఆశాజనకముగ నున్నది. పారిశ్రామికాభివృద్ధితోపాటు, విద్యుచ్ఛక్తి ఉత్పత్తికూడ పెరుగవలెను. ప్రస్తుతము అమెరికా, ఇంగ్లండు దేశములలో సగటున ఒక మనిషి 1 కిలోవాటు విద్యుచ్ఛక్తిని వినియోగించు చున్నాడు. కాని భారతదేశము 25 సంవత్సరములనాటికి సగటున ఒక మనిషి 0.1 కిలో వాటు ఉపయోగింపవలె నన్నచో, 50 మిలియను

191