Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

ఖగోళశాస్త్రము (ప్రాచీన భారతీయుల కృషి)

దైవజ్ఞుని సిద్ధాంతగ్రాహలాఘవము మొదలగునవి ( క్రీ. శ. ఆరవ శతాబ్దము) .

ఈ గ్రంథములు మూడువిధములు : (1) సిద్ధాంత గ్రంథములు, (2) తంత్రగ్రంథములు (3) కరణగ్రంథములు. సిద్ధాంతగ్రంథము లనగా కల్పాద్యహర్గణము నుండి గ్రహసాధనములుచేయు గ్రంథములు ; తంత్ర గ్రంథము లనగా కలియుగాద్యహర్గణముచే గ్రహసాధనము చేయునవి; కరణగ్రంథము లనగా తత్తత్కాలా నితాహర్గణముచే గ్రహసాధనము చేయునవి సూర్య సిద్ధాంతము, సిద్ధాంత శిరోమణి సిద్ధాంత గ్రంథములు శిష్య ధీవృద్ధిదము తంత్రగ్రంథము ; నేడు ఆంధ్రదేశీయులలో కొందరు పంచాంగగణితము చేయు గ్రంథములు, గణకానందము, నారసింహము మొదలగునవి కరణగ్రంథములు ఈ సిద్ధాంతగ్రంథములలో గణిత బాహుళ్య ముండునుగాని గ్రహణములను సూక్ష్మముగా సాధింప వచ్చును. అంతకంటె తంత్రగ్రంథములు, అంతకంటెను కరణ గంథములు ఉత్తరోత్తర స్థూలముగా నుండునుగాని ఉత్తరోత్తరముగా గణితలాఘవము కలిగియుండును.


అహర్గణము - గ్రహసాధనము : సిద్ధాంతగ్రంథముల యొక్క తాత్పర్య మేమనగా ఏ కాలమందు, ఏగ్రహము, ఏ రాశిలో, ఏ భాగములో ఏ వికలలో నున్నదో ముందుగా గణితముచేత తెల్పుటయే. ఈ గణితము దృక్సిద్ధము కావలయును. అనగా గణనీతగ్రహమునకు దృక్సిద్ధగ్రహమునకు సంవాద ముండవలయును. ఆ గణితము ప్రకారము గ్రహము ఆకాశములో కనబడవలెనన్న మాట. అమావాస్య ఈ దినమున ఇన్ని ఘటికలున్నది అని పంచాంగము తెలిపినచో సరిగా అన్ని ఘటికలకు సూర్య చంద్రులు ఒకేచోట అనగా ఒకే దృక్సూత్రములో నుండవలయును. అట్లు లేనిచో గణితము తప్పినదన్నమాట. అందుకొరకు నేడు ప్రాచీన పంచాంగములనియు, దృక్సిద్ధపంచాంగములనియు పంచాంగములు పలు విధములుగా నున్నవి. ప్రాచీన పంచాంగము లనగా సూర్య సిద్ధాంతము, ఆర్యభటీయము, సిద్ధాంతశిశోమణి మొదలగు గ్రంథములద్వారా గణితము చేయగా వచ్చిన గ్రహస్థానములు దృక్సిద్ధములు కాకున్నవని వాదించుచు కొందరు నవీన పంచాంగకర్తలు, పాశ్చాత్యుల గణితమునుకాని, పాశ్చాత్యుల 'నాటికల్ ఆల్మనాక్' మొదలగు గ్రంథముల నాధారముగా జేసికొని, ఆగ్రహములను స్వీకరించి, అవి సాయనగ్రహములు కావున, అయనాంశలు అనునవి వాటియందు తీసి, నిరయనగ్రహములు సాధించి అవి దృక్సిద్ధగ్రాహము లనుచున్నారు. ఇచ్చట పంచాంగ కర్తలలో పెద్ద అభిప్రాయభేదము కలదు. పాశ్చాత్య గణితానీతగ్రహములు సరియైనవి కావని ఎవరును ఆక్షేపింపరు. ఎందుచేత ననగా నేడు పాశ్చాత్య ఖగోళశాస్త్రజ్ఞులు తాము సాధించు గ్రహములను తిరిగి వేధచేసి అవి సరియైనవేయని రుజువు చేయుచున్నారు. వేధశాలలు, నూక్ష్మయంత్రసామగ్రి వారివద్ద కలవు. కావున వారి గణితమందు అందరికి విశ్వాసము కలదు. కాని వారలకు క్రాంతి వృత్తములో ఆది బిందువు క్రాంతి పాతబిందువు లేక సాయన మేషాది బిందువు (First Point of Aries) భారతీయులకు నక్షత్రచక్రాది బిందువు. ఈ రెండును ఒకప్పుడు వరాహ మిహిరకాలములో ఒకే బిందువు అయి యుండెను. కాని అయనగతి యను చలనముచేత (Precession of the Equinoxes) క్రమముగా పాశ్చాత్యుల సాయన మేషాది బిందువు (First Point of Aries) క్రాంతి వృత్తము వెనుకకు నడచుచుండుట చేత నేడు వాటి మధ్య రమారమి 20 భాగలదూర మేర్పడినది. ఈ దూరమునకే అయనాంశమని పేరు. ఇవి 20 భాగలా, 23 భాగలా అని ఇదమిత్థముగా చెప్పుటకు వీలయిన విషయము కాకున్నది.

కల్పాద్యహర్గణ మనగా, కల్పాదినుండి నేటివరకు గతించిన దినముల సంఖ్య - కల్పాది అనగా సృష్ట్యాది. సిద్ధాంతములన్నియు ఏకకంఠముగా ఒక కాలము సృష్ట్యాదిగా ప్రతిపాదించినవి.

4,32,000 సౌరసంవత్సరము లొక కలియుగ ప్రమాణమనియు, 2 కలియుగ ప్రమాణములు ఒక ద్వాపర యుగమనియు, 3 కలియుగము లొక త్రేతాయుగమనియు, 4 కలియుగము లొక కృతయుగమనియు ఈ నాలుగు కృతత్రేతాద్వాపర కలియుగములు కలసి, మహాయుగమనియు, అట్టి మహాయుగములు 71 ఒక మన్వంతర కాలమనియు, 14 మన్వంతరములు ఒక కల్ప మనియు, మన్వంతరములమధ్య కృతయుగ ప్రమాణము

171