Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

ఖగోళశాస్త్రము (ప్రాచీన భారతీయుల కృషి)

చేత, భారతదేశమునుండియే నక్షత్ర నామ వ్యవహారము గ్రీసుదేశమునకు ప్రచారమైనదని చెప్పవలయును. ప్రాచీన భారతీయులు సరిగా ఏ నక్షత్రములను కాంతి వృత్తీయములుగా (Star marking the Ecliptic that is the Sun's annual Path) స్వీకరించి యున్నారో, సరిగా అవే నక్షత్రములు గ్రీసు మొదలగు ఇతర దేశములలోకూడ వ్యవహారములో నుండుటచేత ప్రాచీనభారతదేశమే ఖగోళశాస్త్రావిర్భూతికి మూలస్థానమని స్పష్టముగా వక్కాణింపనగును.

ఆ నక్షత్రములకు అధిదేవతా నిర్వచనముకూడ భారతీయులు చేసియున్నారు. కృత్తిక అగ్ని దేవతాక మనియు, భరణి యమదేవతాక మనియు, ఇట్లే ఆయా నక్షత్రములకు దేవతలు నిర్వచింపబడి యున్నారు. కృత్తికలో సూర్యుడుండగా, ఎండ అగ్నివలె దహించుననియు, స్వాతి వాయుదేవతాకమనగా స్వాతిలో సూర్యుడుండగా గాలివానలు వచ్చుననియు, భరణీ నక్షత్రము యమదేవతాక మనగా భరణిలో శుభకర్మలు చేయరాదనియు, ఇట్లే ఆయా నక్షత్రములకు అధిదేవతా నిర్ణయము మహర్షులు చేసియున్నారు. సరిగా అట్లే వ్యవహారము గ్రీసుదేశ వాఙ్మయములో కూడ కన్పట్టుచున్నది. కావున చారిత్రికముగా ప్రథమస్థాన మాక్రమించు భారతీయ విజ్ఞానమే గ్రీసుదేశమున వ్యాపించెననుట సహేతుకము.అంతియేకాని గ్రీకులనుండి జ్ఞానభిక్షతో వేదవాఙ్మయము రచింపబడెనను వాదము తర్కబద్ధముకానేరదు.


'యత్పుణ్యం నక్షత్రం తద్బట్కుర్వీతోపవ్యుషం,
యదావై సూర్య ఉదేతి, అధనక్షత్రం నైతితావతి
కుర్వీత యత్కారీస్యాత్, పుణ్యాహ ఏవకురుతే '

అను వేదవాక్యములుకూడ ఆనాటి మౌహూర్తిక జ్ఞానమెట్లు ఖగోళీయాంశములపై నాధారపడి యున్నదో తెలియుచున్నది. మరియొకచోట యజుర్వేద సంహితలో సంవత్సర క్రతుకాల నిర్ణాయక ఘట్టములో


“చతురహే పురస్తా”త్ పౌర్ణమాస్యె "దీక్షేరన్"

అని చెప్పుటచేత విషువద్దిన వ్యవహారమే కాక, ఫాల్గున చైత్రాది చాంద్రమాన వ్యవహారము, అమాపూర్ణిమా నిర్ణాయక కాలవ్యవహారము ఆనాటి పంచాంగ గణిత ప్రచారమును స్పష్టీకరించుచున్నది. విషువద్దిన మనగా సమరాత్రందివ కాలము. విషువ ద్వృత్త క్రాంతివృత్త సంపాతబిందువు (The first Point of Aries, the Point of intersection of the Celestial Equator and the Ecliptic) నందు సూర్యుడు ప్రవేశించుకాలము. ఈ కాలమును గుర్తించి భారతీయులు, ఖగోళమున ఆనాటి సూర్యాధిష్ఠిత బిందువునుకూడ గుర్తించి యున్నారు. ఆవిషువద్బిందువునకు మిక్కిలి సూక్ష్మమైన క్రాంతి తృతీయ చలనము కలదు. 72 సంవత్సరముల కొక భాగము మాత్రమే పయనించు అదృశ్య బిందువుయొక్క సూక్ష్మ చలనమునుకూడ ప్రాచీన భారతీయులు గుర్తించి రనుటకు ఆధారములు కలవు. వేదకాలము నందు ఆ విషువద్బిందువు కృత్తికలలో నుండుటచేత నక్షత్ర చక్రము కృత్తికాదిగా నిర్వచింపబడి యున్నది. అనగా వేదకాలము కనీస మీనాటికి 5 వేల సంవత్సరముల పూర్వముగా నుండ వలయునని ఒక నిర్ణయము. బాలగంగాధర తిలకు మహాశయుడు ఇంకను కొన్ని ఆధారములతో వేదకాలము కనీసము ఎనిమిదివేల సంవత్సరముల పూర్వమయి యుండవలయునని ప్రతిపాదించి యున్నారు. దీనిచే భారతీయ ఖగోళ విజ్ఞానము వేదములతోపాటుగా ప్రాచీనతమ మని స్పష్టముగా తెలియుచున్నది.

అమా పూర్ణిమా వ్యవహారము, చాంద్రమాన వ్యవహారము సునిశితమైన ఖగోళీయ విజ్ఞానమును ప్రతిపాదించును.


'అమావాస్యాయాం యదహశ్చంద్రమసం, నపశ్యంతి,
తదహః పిండ పితృయజ్ఞం కురుతే'.

అను వాక్యముచేత చతుర్దశీ విద్ధమైన సినీవాలీ అమావాస్యయందు గాక ప్రతిపద్విద్ధమై, చంద్రదర్శన శూన్యమైన కుహురమావాస్యయందే పితృయజ్ఞము కర్తవ్యమనుటచేత అమా గణితము సునిశితముగా చేయబడి యుండవలయును. వేదవాఙ్మయమునందు పదేపదే కుహుస్సినీవాలీ శబ్దముల ప్రయోగముచేతనే ఆనాడు సునిశిత పంచాంగవ్యవస్థ వ్యవహారములో నున్నట్లు స్పష్టము. అమాపూర్ణిమా జ్ఞానము, వైదిక కర్మ ప్రయోగార్థమే

169