Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

క్రైస్తవ మతము

మున కిచ్చిన సందేశ మంతయు ఇమిడియున్నట్లు వారిభావన. క్రీస్తు అనగా “అభిషిక్తుడు" అని అర్థము. సిలువ ఈ మతమునకు గురుతు.

సిద్ధాంతములు: దేవుడు సర్వపిత యనియు, మానవు లందరు సోదరులనియు క్రీస్తు మతముయొక్క మూల సిద్ధాంతమని కొందరందురు. కాని అది చాలదనియు, ఇంకను నిర్ణీతములయిన సిద్ధాంతము లుండవలెననియు బహుమంది క్రైస్తవుల యొక్క, అందును రోమను క్యాథలిక్కు లందరియొక్క అభిమతము. దాదాపు క్రైస్తవులందరిలో ఒకేరక్షకుడు త్రిమూర్తులుగా నున్నాడను నమ్మకము కలదు. (1) పరమపిత యైన భగవంతుడు, (2) ఆయన కుమారుడును - ప్రతిరూపుడు నైన ఏసుక్రీస్తు, (3) భగవద్రూపమైన పరిశుద్ధాత్మ అనువారు ఈ త్రిమూర్తులు. కాని, 'యూనిటేరియన్లు ' అను నొక క్రైస్తవుల తెగ దీనిని నమ్మదు. ఇతర క్రైస్తవు లీతెగను క్రైస్తవ తెగగా నంగీకరింపరు. పై త్రిమూర్తులలో రెండవవాడగు ఏసుక్రీస్తు మానవ రూపములోనున్న భగవంతుడనియు, మేరీకన్య గర్భమం దవతరించినాడనియు, ఈ యవతారము మానవ చరిత్రలో ఉత్తమసంఘటన అనియు, ఆయన సిలువపై మరణమునొంది స్వర్గమునకు పోవునప్పుడు, తనకుగాను పరిశుద్ధాత్మను ప్రతినిధిగా నిలిపినాడనియు, ఆ పరిశుద్ధాత్మయే భగవద్వాణి యనియు, క్రీస్తునామము నుచ్చరించువారు చేరినప్పుడు అది యచ్చట ప్రత్యక్షమై యుండుననియు, విశ్వసించుట ఒక ముఖ్య సిద్ధాంతము. క్యాథలిక్కులును, కొందరు ప్రొటెస్టెంట్లును భగవంతుని మానవోద్ధరణ ప్రణాళికలో క్రైస్తవమత సంస్థ (చర్చి) ముఖ్యభాగమనినొక్కి చెప్పుదురు మానవుడు పతనమొందె ననియు, మరల క్రీస్తు ద్వారా మోక్షము నొందగలడనియు అనునది క్రైస్తవులందరు నమ్ము మూలసిద్ధాంతములలో నొకటి. అయినను, ఇటీవల ప్రబలముగా వృద్ధియైన మానవ వంశశాస్త్ర (Anthropology), పురాతత్త్వ శాస్త్రము (Archaeology) ల యొక్క ప్రోద్బలముచే “మానవపతన సిద్ధాంతము" నకు కొంతదెబ్బ తగిలినది. అందువలన ఆధునికులలో అనేకులు క్రైస్తవమతము నందలి నైతికాశయములకు మాత్రమే ప్రాముఖ్యమిచ్చుచున్నారు. ఏసుక్రీస్తు తన శిష్యులతో "మీరు మానవజాతి మోక్షమునకు బీజభూతులు. నా యుపదేశములను ప్రపంచమంతటను వెదజల్లవలయును" అని ఆజ్ఞాపించినందున, అప్పటినుండియు మతవ్యాపనము ముఖ్యోద్దేశముగా, ఈమతము నడచుచున్నది. క్రైస్తవమతములో చేరుటకు 'బాప్టిజము' ముఖ్యకర్మ. దీనికర్థము మజ్జనము. అనగా క్రైస్తవమత ప్రవిష్టుడగు వానిపై మతగురువు జీవోదకము జల్లును. ఇట్లు ఉదకమును చల్లిన చాలునా (మార్జనము), లేక నీటిలో ముంచవలెనా, లేక స్నానము చేయించవలెనా అను మతభేదములు కలవు. క్రీస్తు మరల వత్తునని చెప్పిపోయెను. ఆరాకడ అయినదని కొందరును, అతడు భవిష్యత్తులో వచ్చునని కొందరును నమ్ముదురు. బైబిలు గ్రంథము భగవద్వాణియని పూర్వాచారులును, భగవంతుడు మానవునకిచ్చు సందేశరూపమని కొందరును తలచుచున్నారు.

ప్రారంభములో ఈ మతముయొక్క సిద్ధాంతము ముందుగానిర్ణయింపబడెను. ఏసుదూతలగు మాథ్యూ, జాన్ మొదలగువారి వాక్యములు ప్రథమసిద్ధాంతము. కాన్‌స్టాంటైన్ చక్రవర్తి ఆధ్వర్యవమున క్రీ. శ. 325 సం. మున నీస్ (Nice) అనుపట్టణమున జరిగిన పరిషత్తులో నిర్ణయించినది రెండవసిద్ధాంతము. ఇందు భగవంతుడును, యేసుక్రీస్తును ఒకేరూపమనియు,మూర్తియనియు, సిద్ధాంతీకరింపబడెను. ఇది దాదాపు అన్ని విభాగముల క్రైస్తవులును నమ్ముచున్నారు. ఇంతకు పూర్వము క్రీ. శ. 256 సం ర ప్రాంతమున పిరియస్ అనునతడు, యేసు భగవదవతారమైనను, భగవంతునివలె ఆది మధ్యాంతరహితుడు కాడనియు. ఆయన పుట్టినందున ఆదికల వాడనియు, కాని భగవంతుడు త్రికాలస్థిరుడనియు నొక సిద్ధాంతమును లేవదీసెను. దీనిని విమర్శించి క్రీ. శ. 325 లో జరిగిన పరిషత్తు అభేదమును సిద్ధాంతీకరించెను. మరల క్రీ. శ. 381 సంవత్సరమున, కాన్‌స్టాంటినోపిలులో ఒక పరిషత్తు జరిగెను. అది క్రీ. శ. 325 లో ఆమోదింపబడిన సిద్ధాంతమునే పునరుద్ఘాటించెను. ఇప్పటికిని ఈ సిద్ధాంత భేదముల ననుసరించు మతానుయాయులు కలరు. మిల్టను మహాకవి పిరియస్ సిద్ధాంతానుయాయి యని కొందరందురు. యేసుద్వారా తప్ప మోక్షము లేదని అన్ని విభాగములవారును నొక్కి చెప్పుదురు.

135