Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

కోరంగి

జనశ్రుతిని ఎంతవరకు చరిత్ర అంగీకరింపవలె నన్నది విచార్యము.

అడవి (Reserve Forest) : ఇది క్రొత్త కోరంగి నానుకొని కాకినాడ తాలూకాయందు సముద్రతీరము పొడవునను కలదు. ఈ అడవి వైశాల్యము 86 చతురపు మైళ్లు. ప్రజలకు వంటచెరకుగా ఉపయోగపడు మడకఱ్ఱ నిచ్చు మడచెట్లకిది ప్రసిద్ధము.

పడవల నిర్మాణము (Boat Building) : క్రీ.శ. 19, 20 శతాబ్దులలో బర్మా, మలయా, సింహళములతో కొబ్బరికాయలు, బియ్యము మొదలగు వస్తువుల వ్యాపారము జరిగిన కాలమున 15 నుండి 70 వేల రూపాయల వరకు విలువగల ఏడు కొయ్యల పెద్ద తెలుగు ఓడలు నిర్మింపబడినట్లు, నేడిచ్చట కట్టబడుట లేదు. క్రీ. శ. 1950 వరకు పెద్ద ఓడలు కలకత్తా వరకు సరకులు లేకయే ఊరకపోయి, అచటినుండి రంగము, మోల్మేను పట్టణములతో వర్తకము సాగించెడివి. తిరిగి వచ్చునప్పుడు బసంగి ధాన్యము, కలప తెచ్చుచు తిరువాన్‌కూరు వరకు వ్యాపారార్థము పోయెడివి. ఆ దినములలో కేవు చాల తక్కువ. నేటికికూడ ఇచ్చటి ప్రజల చేతిపనులలో పడవల నిర్మాణము ప్రధానమైనది, మూడునుండి ఆరు, ఏడువేల రూపాయలవరకు వెలగల పడవలనే నేడు చేపలవేట మున్నగు వానికై ధనికులు కట్టింప గలుగుచున్నారు. ఇచటి ప్రజలలో అధిక సంఖ్యాకులు అగ్నికుల క్షత్రియులు.

మడతవంతెన (Folding Bridge): ఇది క్రొత్త కోరంగి గ్రామమునకు ఉత్తరదిశయందు కలదు. ఏడుపెద్ద తెరచాపల తెలుగుఓడలు సముద్రమునుండి కోరంగి, తాళ్ళరేవులకు బాగుసేతకై పోయి, తిరిగి వచ్చుటకు వీలుగా ఎత్తబడుచు, చాపబడుచు ఉండు పెద్ద ఇనుపరేకు (నేలగా) గల ఈ (కోరంగి కాల్వ) వంతెనను డబ్లియు. సీ. బ్రౌను (W. C. Brown) మహాశయుడు క్రీ. శ. 1885 లో నిర్మించెను. కాని 1953 లో వచ్చిన గోదావరి వరదల సందర్భమున ఈ వంతెన చాచుటకు వీలు లేనట్లు మూసి వేయబడినది.

డాలరు బుట్టలు (Dollar Bushels) : 'సువర్ణభూమి' యగు బర్మాతోడి వ్యాపారమువలన సంపాదించిన బంగారు డాలర్లు, నీలములు, రత్నములు, మున్నగు వాటిని ఓడలనుండి క్రిందికి దింపుకొనుటకై ఉపయోగించిన కుంచపు బుట్టలు నేటికిని ప్రాత కోరంగియందు కొందరి గృహములలో నున్నవి. ఇవి సన్నని తాటి యాకులతో అల్లబడినవి. ఇవి బోర్లించినచో, దొరల టోపీలవలె నుండును. అంచులు చట్రముతో అమర్పబడినవి. నేటికిని ఇవి గట్టిగను, అందముగను ఉన్నవి. ఇక పెద్దపెద్దవి, నల్లనివి, తేలికయైనవియు నగు లక్కపళ్ళెములు, చిన్నచిన్న లక్కబరణులు, మూతలపై రకరకముల అందమగు నగిషీ చిత్రములు గల బరణులు, డాలర్లతో చేసిన కట్టుకాసుల పేరులు మున్నగు నగలను దాచుకొనుటకు వాడుక చేయబడినట్టివి పెక్కులు కలవు.

ఆయుర్వేద ఔషధవ్యాపారము : అగ్నికులక్షత్రియులై న కీ. శే. పొన్నమండ వేంకటరెడ్డిగారు కోరంగియందు క్రీ. శ. సుమారు 1820 - 1880 వరకు ఆయుర్వేద వైద్యులుగ నుండిరి. వారి కుమారుడు లక్ష్మణస్వామిగారు క్రీ. శ. సుమారు 1880 నుండి 1946 వరకు బర్మా, సింహళము, ఆఫ్రికా దేశములతో వ్యాపారముచేసి తమ తండ్రిగారి ఔషధ విధానమునకు కీర్తివ్యాప్తులు సంపాదించిపెట్టి లక్షలాది ద్రవ్యమును గూర్చిరి. వీరి కుమారునిపేరు మరల (తాతగారి పేరిట) వేంకటరెడ్డిగారే. నేటికిగూడ క్రొత్త కోరంగిలో వీరి ఔషధనిలయము పెద్ద దొకటి కలదు. క్రీ. శ. 15-8-1946 నుండి బర్మా, బ్రిటిషు సమాఖ్య (Federation) లో అధినివేశ ప్రతిపత్తి నొందుటచే దానితో మన భారతదేశ వాణిజ్య వ్యాపారములు కుంటువడినవి. ఆదాయమును తగ్గినది.

శిథిల భవనములు : ఇవి క్రొత్త కోరంగినుండి ఆత్రేయకు పోవుదారిలో ఇరుకైన బాటయందు ఎడమవైపున గల కోరడిమధ్య నున్నవి. ప్రజలు వీటిని పాడైన బంగళా లందురు. కేవలము మొండిగోడలను బట్టియు, పునాదులను బట్టియు ఇవి రమారమి 200 ఏండ్లకు పూర్వము నందలి వని చెప్పవచ్చును. కడమ వివరములు సులభముగ దెలియునట్లు లేవు.

కోరింగ దీపగృహము (Coringa Light House) : నేడు క్రొత్తకోరంగినుండి రిజర్వుఫారెస్టు మీదుగా దారిగాని దారిన బోయినచో సముద్రము మూడునాల్గు మైళ్ళుండును. కాని ఆత్రేయపై పడవమీద పోయినచో,

113