Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

కోరంగి

చున్నది. ఇందలి నీరు ఏడాదిలో ఆరునెలలు ఉప్పగ నుండును. మిగత ఆరునెలలు చౌకలుగ నుండును. కావున నేటికిని ఏడాది పొడుగున కాల్వనీరు, లేదా నూతినీరే ప్రజల కాధారము.

సముద్ర సామీప్యముచే చేపలవేటయు, పడవల నిర్మాణమును కోరంగి ప్రజలయొక్క ప్రధానమైన వృత్తులు. భూమి అంత సారవంతము గామిచే వ్యవసాయము అప్రధానమైన వృత్తి.

నలుబదిఏండ్లకు పూర్వము కోరంగి జనసంఖ్య 10,000. అది క్రమముగ క్షీణించి క్రీ.శ. 1951 వ సంవత్సరపు లెక్కలనుబట్టి 5,322 అయ్యెను. నేడు సగటున సివారునకు వేయిమంది చొప్పున కోరంగి గ్రామసంపుటియందలి జనసంఖ్య 6,000.

పూర్వచరిత్ర : ప్రాచీనమైన బుద్ధుని దంతగాథ లన్నిటికిని సంబంధించిన మహానగరము 'దంతపురము'. ఆ దంతపురము నేటి రాజమహేంద్రవరము కావచ్చునని జనరల్ కన్నింగుహాము వ్రాసియుండెను. ఫెర్గూసన్ (Fergusson) పండితుడు దంతపురము కోరంగి కావచ్చుననెను. దీనికి తగు నాధారములు లేవు. క్రీస్తుశకారంభము నుండియు 'కోరంగి', గోదావరీ ముఖద్వారమున గల పురాతన ప్రసిద్ధ నౌకాశ్రయ మని దృఢపడుచున్నది.

'టాలెమీ' (Ptolemy) అను భూగోళశాస్త్రజ్ఞుడు (క్రీ.శ. 130) చోళమండలతీరమునందున్నట్టియు, పినాకిని మహానదీ ముఖద్వారములయం దున్నట్టియు నౌకాశ్రయములను పేర్కొనెను. కాని, గోదావరీ ముఖద్వారమున గల నౌకాశ్రయమును పేర్కొనజాలడయ్యెను.

టాలెమీకి పూర్వుడును, పెరిప్లస్ (Periplus) అను గ్రంథమునకు కర్తయు నగు 'హిప్పాలస్' (Hippalus) అనునతడు కూడ గోదావరి ముఖద్వారమున ఒక రేవుపట్టణము ఉండినట్లు చెప్పెనేకాని దానిపేరు చెప్పజాలక పోయెను.

ఇక పై నిర్వురికంటె పూర్వుడైన 'ప్లైనీ' (Pliny) (క్రీ. శ. 77) అను చరిత్రకారుడు దంతపురమును 'దండాగుల' అని నిర్ధారించి, అది గంగానదీ ముఖద్వారమునకు (ఆకాలపు కొలత ననుసరించి 625 రోమను మైళ్ళ దూరమున) 574 మైళ్ళ దూరమున దక్షిణముగ ఒకానొక మహానదీ ముఖద్వారమునందున్న 'కోరి' అగ్రమున (Cape Cori) కలదని చెప్పినాడు.

నేటి కోరంగికి ఇటీవలి వరకును, కురంగి అనియు, కోరింగ (Coringa) అనియు గలపేళ్ళు, ప్లైనీ పేర్కొనిన ఈ 'కోరి' అనుపేరు 'కోరింగ', 'కోరంగి' అను పదములతో సాదృశ్యమును కలిగియున్నమాట నిజము. కాని ఇచ్చట ఎప్పుడును ఒక మహానగరము వర్థిల్లిన చిహ్నములు లేవు. కీ. శే. భావరాజు వేంకట కృష్ణారావుగారు చెప్పినట్లు 'దంతపురము' 'దొంతికుఱ్ఱు' కావచ్చును. మహానగర మగునో కాదో కాని, క్రీస్తు శకారంభము నుండియు, ఇంకను తత్పూర్వము నుండియు 'కోరంగి' గొప్ప రేవు పట్టణము మాత్ర మగును.

రెండు వందల ఏండ్ల వెనుక (అనగా క్రీ. శ. 1759 లో) నేటి క్రొత్త కోరంగి అను గ్రామమును 'వెస్టుకాట్ ' (West Cott) అను ఆంగ్లేయ వర్తకుడు నిర్మింపించినాడని తెలియుచున్నది. ప్రాత కోరంగి తత్పూర్వము నుండియు కలదట.

క్రీ. శ. 1789 లో (అవిభ క్త) మదరాసు ప్రభుత్వము యొక్క భూగోళ శాస్త్రజ్ఞుడుగా నుండిన 'టాపింగ్' (Toping) అను పాశ్చాత్య పండితుడు స్వయముగ కోరంగి వెళ్ళి చూచి అచటి రేవునకు ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీస్, ఇంగ్లీషు నావలు వచ్చెడి వనియు, అచ్చట దొంగలబాధ విపరీతముగ నుండెననియు వ్రాసినాడు.

నేటి క్రొత్త కోరంగికి దక్షిణముగ మైలు దూరమున 'తాళ్ళరేవు' అను గ్రామమొకటి కలదు. అందు క్రీ. శ. 1802 లో నావల రేవుగా దానికి అప్పుడున్న ప్రాధాన్యమునుబట్టి, లక్షల ధనమును వెచ్చించి 'ఎబెనీ జా రోబెక్ ' అను ఆంగ్లేయ వర్తకుడు ఒక పెద్ద బోదె (డ్రైడాక్) ను నిర్మించెను. కోరంగి ఉచ్ఛదశలో నుండగా 'తాళ్ళ రేవు'లోని ఈ బోదెకు హెచ్. ఎం. ఎస్. అల్బట్రస్ అను ఆంగ్లేయుల ప్రసిద్ధమైన యుద్ధనౌక ఒకటి కోరంగి మీదుగనే బాగు సేతకు పోయినది. తనతోపాటు ఎప్పుడును ఐదువందల ఓడలకు తక్కువగాక ఉండెడి “తాళ్ళరేవు" నౌకా కేంద్రము యొక్క దశ మారిపోయినపిమ్మటకూడ, కోరంగిరేవు, ఏ కొంచెమో నిన్న మొన్నటివరకు ఓడల 'మరమ్మతు' వ్యాపారమును సాగించుచునే వచ్చెను.

111