పుట:Sameeksha, 1937.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలివిడి

ఇందలి వ్యాసము లొకనాటివి కావు. పత్రికలలో నపుడప్పుడు బయల్వెడలుచుండు వాదోపవాదములను బురస్కరించుకొన్న వగుటచే నివి యస్వతంత్రములు నసంపూర్ణములు; నంతియేకాదు; వీనికి గాలభేదము పునరుక్తిని, వాదతీవ్రత అత్యుక్తినిగూడ నాపాదించియుండవచ్చును.

కాళిదాసునకు సంబంధించిన రచనలు రవీంద్రుని వ్యాఖ్యల ననుసరించి ప్రవర్తించినవి. ఈ వ్యాఖ్యలచే కాళిదాసునకు ధర్మోపదేశికత్వము సిద్ధించుచున్నను, నిజమునకు గవీశ్వరులు ధర్మోపదేష్టలు కారు. అనుద్దిష్టమగు శబ్దబోధవలెనే ధర్మబోధకూడ, వారి కావ్యములందు గర్భితమైయుండును. అంతియేకాని వారు బుద్ధిపూర్వకముగ తమ కావ్యములను శబ్దశాస్త్రమునకు ధర్మశాస్త్రమునకు లక్ష్యభూతము లొనర్పరు. వేదములవలె ప్రభుసమ్మితములును, పురాణాదులవలె మిత్రసమ్మితములునుగాక, కావ్యములు కాంతాసమ్మితములగుటచే ప్రత్యక్షబోధ వానిపని కాదు. పరోక్షమార్గముననే ధర్మము నవి హృద్గత మొనర్చును. వ్యాఖ్యాతలుమాత్ర మా కావ్యములను తత్త్వదృష్టిచే వివేచించి ధర్మసారమును వెలికిదీయ జూతురు. రవీంద్రుడు స్వయము కవియయ్యు, దత్త్వజిజ్ఞాసువుకూడ నగుటచే కాళిదాసకావ్య సమాలోచనమున నందలి ధర్మనిరూపణమునకుగూడ గడంగెను.