పుట:SamardaRamadasu.djvu/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముందుమాట

ఈ పవిత్ర భారత దేశంలో జన్మించిన మహాపురుషులలో సమర్థ రామదాస స్వామి ఒకరు. క్రీ.శ. 1608 సం|| మహారాష్ట్రలో జన్మించిన ఈయన సుప్రసిద్ధ చారిత్రక పురుషుడైన శివాజీకి గురువు. దేశంలోని వివిధ పుణ్య స్థలాల్ని దర్శించి, సత్సాంగత్యంతో జ్ఞానాన్ని సముపార్జించి, భిక్షావృత్తితో జీవిత యాత్రను సాగిస్తూ హిందూ ధర్మ ప్రచారాన్ని జీవితాంతం సాగించిన మహాత్ముడు రామదాసు. బాల్యం నుంచే వైరాగ్య ప్రవృత్తి కల్గిన రామదాసుని అద్భుత సామర్థ్యానికి ఆశ్చర్యపడిన సాధువు ఈయన్ని సమర్థుడని పిలిచారు. నాటి నుంచే ఈయనకు సమర్థ రామదాసు అనే పేరు స్థిరపడింది.

విద్వాంసుడు, కవి, రాజనీతిజ్ఞఉడు ఐన రామదాసు జీవితంలో కర్తవ్యానికి, స్వార్థ త్యాగానికీ అత్యంత ప్రాధాన్యమిచ్చేవాడు. భగవంతుని దృష్టిలో సర్వులూ సమానమేనని, పరమాత్మునికీ కావలసింది భక్తి మాత్రమేననీ, కాలాన్ని దుర్వినియోగం చేయకుండా సదా సత్కర్మలు చేస్తూ వుండటం మానవ ధర్మమనీ, తన్ను తాను తెలిసి కొనడమే నిజమైన జ్ఞానమనీ ఈ మహనీయుడు బోధించేవాడు. రామదాసుని రచనల్లో సుప్రసిద్ధమైన గ్రంథం ' దాసబోధిని ' ప్రజల్ని హిందూ ధర్మోన్ముఖుల్ని చేయడానికై ఈ మహాపురుషుడు చేసిన బోధలు అజరామరాలు.

ప్రసిద్ధ కవి పండితులు శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు విపులంగా సరళగ్రాంథిక భాషలో రచించి లోగడ ముద్రించిన ఈ సమర్థ రామదాసు చరిత్రను తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇప్పుడు తెలుగు ప్రజల కోసం స్వీయప్రకాశనంగా ముద్రించింది. మన పుణ్యభూమి ఎందరు ఎంతటి మహనీయులకు కన్నతల్లో తెలిసి కొనటానికిది ఉపయోగిస్తుంది. అందరూ సమర్థ రామదాస స్వామి చరిత్రనూ, బోధల్ని ఆకళింపుచేసికొని తమ జీవితగమనాన్ని సక్రమమార్గంలో సాగిస్తారని మా విశ్వాసం.

తిరుపతి, కార్యనిర్వహణాధికారి, 19-10-91. తి. తి. దేవస్థానములు, తిరుపతి.