క. అరయఁగ జీవన్మృతు లే
గురు నిర్ధనికుండు నరసికుఁడు మూర్ఖుఁడు భూ
వరసేవకుఁడు ప్రవాసియుఁ
బరఁగుఁ బరాశరతనూజు పలు కిది ధరణిన్. 509
క. రాజాధికారపురుషుని
పై జయముండునటె మృత్యుపాశము లుండున్
నైజమునఁ బట్టి పలు కే
యోజమెయిం జెప్పమతియె యోగ్యుం డైనన్. 510
పంచతంత్రి
క. తమబ్రతుకు తమకుఁ గడువిర
సము చింతకుఁ బొత్తు మానసంబు పరాధీ
నము లైశ్వర్యంబులు స
ర్వము సేవకు లెవ్వ రరయ వారల కెల్లన్. 511
పంచతంత్రి
షోడశసంధిప్రకారము
సీ. ఒనరఁ గపాలంబు నుపహారసంధియు
సంతానసంధియు సంగతంబుఁ
జాల నుపన్యాససంధియుఁ బ్రతికార
సంధియు సంయోగసంధితంబు
బురుషాంతరాదృష్టనరనామకమ్ములు
నాదిష్టకంబు నాత్మామిషంబు
పరిక్రయవిగ్రహబంధురోపగ్రహ
సంధులు నుచ్ఛిన్నసంధికంబు
ఆ. ననుపమపరదూషణాంచితస్కంధోప
నేయసంధు లనఁగ నిశ్చితముగ
షోడషప్రకారసునిశితసంధివి
ధాన మెఱుఁగవలయు ధరణిపునకు. 512
గీ. బలిమి సమసంధియైనఁ గపాలసంధి
యర్థదానముచే నుపహారసంధి
దారికాదాన మీగి సంతానసంధి
చాలమైత్రిపూర్వక మది సంగడంబు. 513
పంచతంత్రి
గీ. అరయ నేకార్థముగ నుపన్యాసచతురు
లమరఁ గూర్చినయది యుపన్యాససంధి
కడఁగి యుపకర్తప్రత్యుపకారకాంక్షఁ
గలసి మెదలుట యది ప్రతీకారసంధి. 514
గీ. అతని కుపకార మొనరించి యతనిచేతఁ
గొరలి ప్రత్యుపకారంబు గొనఁగవలయు
ననుచు రాముఁడు సుగ్రీవు నాప్తుఁ జేయు
కరణిఁ గలయుట యది ప్రతీకారసంధి. 515
క. ఇరువురుఁ గూడి యొకనిపై
నరుగుట సంయోగసంధి యగుఁ బణపూర్వం
బిరువురు యోధులఁ బంపుట
బురుషాంతరసంధి యనఁగ బుధమతమయ్యెన్. 516