పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

45 రక్తపాతము

నాటకములు వెలువడినవి. ఆయాదర్శములనే ఇతర దేశస్థులు తమ రుచుల ననుసరించి పరివర్తనములుచేసి వారివారి ధర్మముల కనుకూలించుకొనిరి. అవి మన ధర్మాదర్శములకు సరిరావు. వాటియందు కూడా రుచివైచిత్ర్యము పొడగట్టు చున్నను తద్రుచులు మనధర్మాదర్శములకు బహిర్భూతము లగుట మనసాహిత్యా దర్శములందు కానరావు. ఆజాతులు రుధిరప్రియములు సహజకఠినములు నగుటచే వారి నాటకములు తదనుగుణముగా నుంటవి.

గ్రీసుదేశేతిహాసము చదివినవారికి స్పార్టానగరనియమము లెంతనిష్ఠురములో తెలుసును. ఏధెన్సుపురవాసులు గొప్పగొప్ప నాగరికులయెడ నిర్దయ జూపుచుండిరి - పరమ ధార్మికుడగు సోక్రటీసుకు విషమిచ్చి చంపిరి. ఆదృశ్యము వారి కెంత ఆనందదాయక మాయెనో! క్షమాగుణము మచ్చున కైన వారియందు లేకుండెను. తద్దేశీయనియమము లమితనిర్దయాపూరితములు. అట్టి పరిస్థితులలో వ్రాయబడిన నాటకములు వియోగాంతములు కాకున్న వారికి రుచించునా? లోకులయం దట్టి నిర్మమత్వము నిర్దయము ప్రబలుచుండే కాలమున వియోగాంతనాటకములు ఉత్పన్నము లగుట వింతకాదు.

ఇక నీనాటకము లనుకరించిన వారిస్వభావము లెట్లుండెనో కొంచెము విచారింతము. చాలాకాలము క్రిందట యూరపుఖండమున వేండలు లనీ (Vandals) గాథుల