పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34 సాహిత్య మీమాంస

శ్రీమద్రామాయణమున కూడా అట్లే, కాని భేదమిది - అందు వీరత్వములకెల్ల ఆధారభూతుడు శ్రీరాముడే. భీము బలము, విజయు కౌశలము, ధర్ంజు ధర్మగౌరవమును శ్రీరామునియందు కేంద్రీకృతము లగుటచే వా రందరికన్న ఆత డధికుడు. ఈ మూడింటికితోడు శ్రీకృష్ణుని ప్రభావ మాతనియందు దేదీప్యమానమై వెలుగుచున్నది. శ్రీరాముని యందు సమష్టిచెందిన శక్తులు వ్యష్టిరూపమున శ్రీకృష్ణపాండవుల చిత్రములందు గాంచనగును. శ్రీరాము డాకావ్యమున సర్వశక్తుడు, సర్వవ్యాపి; అతని బోలు వ్యక్తి యింకొకడందు లేడు. అనంతశక్తి, అసమబలము, అద్వితీయవీర్యము నొక్కచోట కూర్చి శ్రీరాముని పాత్రము చిత్రింపబడి యుండనోపు. త్రివిథవీరత్వము శ్రీరామునియందు ముప్పిరిగొన్నదిచూడండి - ధనుర్భంగ మొనర్చునపుడును రాక్షసుల దునుమాడునప్పుడును భీమబలము, పరశురామ గర్వభంగమున రావణకుంభకర్ణనిధనమందు విజయకౌశలమును, మొదటినుండి తుదవఱకు ధర్మవీరత్వమును ప్రకటిత మగును. రాఘవులందరు ధర్మ వీరులే; కాని శ్రీరాముడు వారిలో నాయకమణి. నిండోలగమునుండి నిర్జనాటవులకు బోవునప్పుడు, వనవాసులగు మునుల యార్తి తొలగించునపుడు, సుగ్రీవునితో సఖ్య మొనర్చునపుడు, విభీషణునకు శరణు నొసగునపుడును శ్రీరాముని ధర్మాసక్తి ఈరేడుజగముల కెగబ్రాకును. ఇం దాతని తుల్యుడు ఆర్యసాహిత్యము నెల్ల శోధించినా కానరాడు.