పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

31 ఆదర్శము

ముండునే కాని ధర్మవ్యాప్తికి తావుండదు. ఇది ప్రబలెనా నాటకము వియోగాంతము కానేరదు. అట్టి నాటకములందు స్థాయీభావము నొందదగినది భయానకరసము; పరిణామమున నుండదగినది కరుణరసము. ఈ రసోద్రేకములందు ధర్మ వికాసమునకు వీలులేదు. ఒకవేళ ధర్మవిన్యాస మొనర్ప యత్నిస్తే వెంటనే శాంతరస మవతరించవలెను, అప్పుడు వియోగాంతమునకు రసభంగము కల్గును. అందుచేతనే వియోగాంతనాటకములు శాంతరసముజోలికి బోవు. శాంతరస ప్రాబల్యము చూడవలెనంటే ఆర్యసాహిత్యమందలి మహా కావ్యములూ నాటకములూ చదువవలయును.

సాహిత్యమున వీరత్వము -

ఆంగ్లవియోగాంతనాటకములలో పాపచిత్రణ మెట్లు ప్రబలెనో, పాపగతి యెట్లౌన్నత్యము వహించెనో, అట్లే ఆర్యసాహిత్యమున ధర్మచిత్రణము బ్రబలి ధర్మగతి ఔన్నత్యము నొందెను. మిల్టనుకృతియందు పాపవీర్యము తద్విజయమును ప్రకటింపబడినరీతిని ఆర్యకృతులయందు ధర్మవీరత్వము తద్విజయమును బ్రకటింపబడెను. ఆవీరత్వమును పెంపొనర్చుటకు దానితో నింక రెండు తెరగుల వీరత్వము జోడింపబడి వికాసము నొందెను. అందొకటి బలవీరత్వము, రెండవది చాతురీవీరత్వము - భీముని బలవీర్యము ధర్మాధీనము; దుర్యోధనుని దట్లు కాదు. భీము బాహాబలమును మహాశక్తియు దుర్యోధనునందూ కలవు; కావున వారిద్దరూ ప్రతియోగులు.