పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108 సాహిత్య మీమాంస

ప్రసంగము విన్నవారికీ చదివినవారికిన్నీ హాస్యాస్పదముగా నుండును. మురిపెంపుమత్తు ముగియువరకూ ప్రణయవచన ప్రవాహము పారుచునే యుండును. ఇట్టి మధురప్రసంగమున మౌఖికప్రేమ యెంతో హార్దిక మెంతయో నిర్ణయించుట సులభసాధ్యము కాదు. ఇంకొక చిత్రము - ఒక కాంతను చూచినవెనుక జనించిన మోహసాగరము ఇంకొకకాంతను చూచినతోడనే ఎండిపోవును; ప్రేమాంధులకు యుక్తాయుక్త వివేచనము శూన్యమనుట అందరూ ఎరిగినదే. అర్హ వివేచనము చేసి పాత్రాపాత్రనిర్ణయమొనర్చి వివాహమొనర్పవలెనన్న యౌవనము తగిన యదను కాదని ఒప్పుకొనక తీరదు, ఏలయన రిపుషట్కప్రలోభనము రూపమదమున్నూ మితిమీరి చెలరేగు కాలమిది. ఇప్పటి ఎన్నిక లోనిగొంగలమోసము.