పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98 సాహిత్య మీమాంస

మచ్చను రెండవదానియందలి మెచ్చును విపులముగా వర్ణించిరి. కామమున కెట్టి సందర్భములందు పాపము సోకునో ఎట్టియెడ సోకకుండునో వారు చక్కగా తెలియపరచిరి. సూక్ష్మదృష్టికలవారు కావున ధర్మసూక్ష్మమును స్పష్టముగా నిరూపింపగల్గిరి. ఇట్టి నిరూపణమును వారు చేయగడంగినప్పుడు పలురకముల కామానురాగమును రచనచేయవలసి వచ్చెను. పాపకలితమగు దానిని కళంకయుతముగనే వర్ణించిరి. ఇట్టి చిత్రరచనచేత సాహిత్య గౌరవము తగ్గకుండా ఇతరరస సమ్మేళన మొనర్చి తన్మూలమున గౌరవ మినుమడించిరి.

సఖ్యప్రేమ

ఆర్యసాహిత్యమందలి ధార్మికదంపతీప్రేమ పాశ్చాత్యసాహిత్యమున దుర్లభము. అం దింకొకవిధమైన ప్రేమ చిత్రింపబడియున్నది. ఇద్దరు మిత్రులకు, ఇద్దరు సఖులకు ఇద్దరు సమానుల కన్యోన్యమూ ప్రబలు ఈమధురప్రేమను సఖ్యప్రేమ అనదగును. ఇదీ మెచ్చదగినదే. ఆర్యసతులయం దిట్టిప్రేమా లేక పోలేదు. సతికి పతియు, పతికి సతియు పరమ సఖులు, కావున వారిరువురూ ఆప్రేమయందు నిమగ్నులగుదురు. వా రన్యోన్యాదరపాత్రములై మధురాలాపములతోనూ, ప్రణయచేష్టలతోనూ, కాలము వెళ్ళబుస్తూ, ఒకరి వృత్తము నొక రనుమోదిస్తూ ఉందురు. ఇందు సతీపరతంత్రత పతిదేవత్వమును మిళితము కావడముచేత వీటిసాంగత్య