పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

75 దివ్యప్రేమ

ఆమెప్రేమ నైరాశ్యభరితము. ఇప్పుడు శ్రీరాముడు స్వయముగా ప్రజానురంజన కామెను బలియిచ్చెను. ఇక పునస్సమ్మేళన మసంభవము - ఈవియోగమున ఆమె శ్రీ రాము నుద్దీప్త ప్రేమకు ప్రబలాధారమయ్యెను. ఆప్రేమ వలన సీతకు లేశమైనా గర్వముకాని గుండెనిబ్బరముకానీ కల్గగలేదు, దానిమూలమున అందరికీ ఆమెయెడ సానుభూతీ అతులాదరమున్నూ ప్రబలినవి. ఆప్రేమయే సీతకన్నులనుండి బాష్పధారావృష్టిని ప్రభవిల్ల చేసెను. తనబిడ్డలను జూచి పతి రూపము స్మరించి దానినెల్లప్పుడు ఆరాధిస్తూ ఉండేది. సుతుల మోముల తిలకించి శ్రీరామచంద్రుని లోచనరాజీవముల స్మరించి కన్నీటి కాల్వలచే కాననభూమిని తడుపుతూ ఉండి, శ్రీరాముని ప్రేమమునే జీవాధారము చేసుకొని నిర్భరములగు ప్రాణములు నిల్పుకొన గలిగింది.

ఆశ్రమావాసమున పెరిగిన ఆమెగాఢప్రేమ పాతాళ ప్రవేశసమయమున ప్రకటితమాయెను. శ్రీరాముని నోట పున:పరీక్షాప్రసంగము వెలువడగానే సీత గుండె పటీలున బద్దలయింది. పితృకల్పుడగు వాల్మీకి, ఇతర గురుజనము, పుత్రులు, ఎందరో సభాసదులు - అందరిముందర మర్మభేదకమగు ఆవార్త విని ఆమె సహింపగలదా? భూమి దారి యిచ్చినవెంటనే శ్రీరాముని ముఖమునందే దృష్టినిల్పి ప్రేమ ప్రతిమ యగు సీతాసతీమణి మాతురంకమును జేరి మరి కనబడలేదు. సతీప్రేమ పవిత్రప్రతిమ అంతటితో నస్తమించినది!