పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

137 మానవప్రేమ

పశుత్వమువీడి దేవభావా శ్రయముననుండడము చేతనేమానవులకు ఆత్మనిగ్రహమలవడుతుంది. దీనికితోడు పరమార్థపరతంత్రత సిద్ధించిందా మనుష్యునకు స్వాధీనత చిక్కినట్టే. ఆత్మపరమార్థపర మగునప్పుడే నిజమైన స్వేచ్ఛ (Freedom, Liberty) అలవడిన దన్నమాట. ఇట్టి స్వాధీనత పోగొట్టుకొని ఇంద్రియములకు వశులై వాటిచిత్తమువచ్చిన రీతిని మెలగువారు స్వాధీనులు కారు, ఇంద్రియేచ్ఛాధీనులు. ఇది నిజమైన స్వేచ్ఛా కాదు, శ్రేయోదాయకమూ కాదు. దీనికి స్వైరవిహారము (License) అని పేరుపెట్టవచ్చును. ఇట్టి స్వచ్చందవిహారమును విడిచి శ్రేయోదాయకము ప్రకృతిసిద్ధమునగు స్వాధీన పథమున సంచరించువారు మానుషత్వమునకు తగినవారు. మనదేశాచారముల ననువర్తించుటచేతనే ఇది సిద్ధిస్తుంది - అట్టి పదవికి సాధనభూతమైన ప్రేమప్రవృత్తి హిందూసంఘనియమములం దంతటా కద్దు, ఆర్యసాహిత్యమున కలదు.

ఆర్యసాహిత్యమున ప్రేమగౌరవము

ఆర్యసాహిత్యమున ప్రేమవికాసము భక్తియందు తేట బడును; అందే పుట్టి, అందే పెరిగి, అందే పరిణతి చెందును. ఇట్టి గౌరవము పాశ్చాత్యసాహిత్యమున గానరాదు. పతిభక్తి, భ్రాతృభక్తి, పితృభక్తి, మాతృభక్తి, గురుభక్తి, వాత్సల్యము, భార్యానురాగము, శిష్యానురాగము మొదలగు ప్రేమవికాస భావములు అందు లేవు. సీత, లక్ష్మణుడు, శ్రీరాముడు, యుధిష్ఠిరుడు వంటివా రున్న చోటులందే ప్రేమగౌరవ ముండును.