పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134 సాహిత్యమీమాంస

పత్నియెడ అనురాగము పెరుగుచుండును, కాని అట్టి దృష్టాంతములు తరచుగా కనబడవు. సీత రాముని ప్రేమించినట్లే శ్రీరాముడున్నూ సీతను గాఢముగా ప్రేమించెను. పతియెడ ఏకానురక్తయై కాలముపుచ్చుచుండుట సతికి సానుకూలమే, కాని పత్నీప్రణయపాశైకబద్ధుడై తదితరకర్తవ్యముల నుపేక్షించుట పతికి తగినపని కాదు. పత్నియెడ మిక్కుటమగు అనురాగము పక్షపాతమున్నూ చూపుట స్త్రీలోలత్వ మనిపించుకొనును.*[1] అట్లొనరించినయెడల సంఘమున కల్లోలమావిర్భవించి తీరును. గృహస్థు భరింపవలసినది కేవలమతని భార్యయే కాదు, కుటుంబమంతటినీ అతడే భరింపవలయును.

  1. * ఈ వాక్యమును చదివినవారు నాపై కోపగింతురేమో? ఈ అభిప్రాయము అత్యంత సంకుచితము (Narrow) పక్షపాతపూరిత మందురు కాబోలు? కాని పతిపత్నులు అన్యనభావసంకలితులైనట్టైతే ఇతర ధార్మిక, సాంఘిక, నైతిక వ్యవస్థలు నిర్వహింపబడనేరవు.అత్యధిక భావానురక్తి ఆపజ్జనకము. "అనాసక్తః సుఖం సేవేత్" అని కావ్యముల సదుపదేశము. దుష్యంతుడు శకుంతలపై మొట్టమొదట అత్యధికానురాగము ప్రకటించెననే మనము భావింపవచ్చును. కాని అప్పుడైనా అతడు కర్తవ్యము మరచెనా? చూడండి__ అనసూయ __ వయస్య, బహువల్లభా రాజానః శ్రూయంతే. యథా అవయోః ప్రియసఖీ బంధుజనశోచనీయా నభవతి తథా నిర్వాహయ. రాజా__భద్రే, కిం బహునా__

               పరిగ్రహబహు త్వేపి ద్వే ప్రతిష్ఠే కులస్య మే
               సముద్రరశనా చోర్వీ సఖీ చ యువయో రియమ్.

    అన___వయస్యా, రాజులు బహువల్లభల పరిగ్రహించువారని వినికి, మా ప్రియసఖి బంధుజనశోచనీయ గాకుండు విధ మాచరింపవలయును.

    రాజు__కళ్యాణీ, పెక్కుమాట లేల?

    క. కలిగిన బహుభార్యలు, మత్కులప్రతిష్ఠలుగ నుండుదురు వీరిరువుల్,
    జలనిధి మేఖలయయితగు నిలయును స్మరజీవనాడి యీ మీ చెలియున్.

    చూచితిరా? రాజులకు బహుభార్య లుందురు, వారిలో నెవ్వరికీ ఏ లోటూ రాకుండా చరించుట చాలా కష్టము. ఐనా, మా శకుంతల కేలోపమూ లేకుండా మీరు కనిపెట్టిచూడండి అని అనసూయ వ్యంగ్యముగా రాజులు స్త్రీలోలులు కాకతప్పదని నిర్ధారణ సూచించింది. అది గ్రహించి తనకులగౌరవము నిలువపెట్టుకొనడానికి - "నాకు చాలామంది కాంతలున్నా అందు ముఖ్య లిద్దరే - మొదటిది భూమి, రెండవది మీ శకుంతల అని జవా బిచ్చి నాడు - దీని అర్థ మిది - రాజుకు ప్రథమగణ్యము రాజ్యము, దానిని సరిగా పాలించుట అతనికి ముఖ్యవిధి - భార్య - తదితర స్త్రీలి, భోగములూ గౌణములు (Secondary) గాని ముఖ్యములు కావు - రాజ్యపాలనము వెనకబెట్టి భార్యలూ భోగములూ సర్వమని భావించుట తప్పు అని సూచించి రాజులు స్త్రీలోలురను వాదమును ఖండించి పూర్వపక్షము చేసినాడు -

    పురుషుడు స్త్రీకి వశుడయ్యెనా ప్రాచ్యపాశ్చాత్యసంఘములకు భేదమే యుండదు. హిందువులారా, పాశ్చాత్యరీతుల ననుసరింపకుడు, మన పురాణములోని శ్రీకృష్ణుని స్త్రీలోలత్వము ననుసరింపక శ్రీరాము నాదర్శముగా గొనుడు. కామినీవాగురుల జిక్కి కర్తవ్యమును త్యజింపకుడు.