పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82 సాహిత్య మీమాంస

మన స్త్రీవిద్యావిధానము పాశ్చాత్యవిధానముకన్న భిన్నమని చెప్పినాముకదా. మన స్త్రీలుకొంచె మక్షరజ్ఞానము కలగగానే పురాణములు మొదలగు మన గ్రంధముల పఠించి మన ఆదర్శములను అనుమోదించి వాటి ననుకరింప మొదలు పెట్టుదురు. విద్యాభ్యాసమునకును, శ్రవణము, ఆచరణము, (వ్యవహారము) దృష్టాంతములను పైనిచెప్పిన నాల్గుసాధనములకును సామంజస్యముండుటచే, చదువుకొన్న స్త్రీలు సతీత్వ ధర్మము, పాతివ్రత్యధర్మమును గౌరవిస్తారు. ఇట్టి స్త్రీ విద్య ప్రమాదజనకము కాదు. "అధీతి బోధాచరణప్రచారణము" లకు చక్కని సామంజస్య మున్నందున ఇదేఉత్తమవిద్య.

యూరోపీయాచారములు మన ఆదర్శముల కనురూపముగానుండవు. పాశ్చాత్యసాహిత్య మభ్యసించి విదేశాచారముల నుపక్రమించిన మనస్త్రీలకు ఆర్యపతివ్రతాధర్మముల యెడ గౌరవము సమసిపోయి వాటికి వారు దూరులగుటే కాక పాశ్చాత్య సతీధర్మములందా సక్తి పుట్టును. వీటికీ మన ఆచారవ్యవహారములకూ సరిపడదు. ఆసంఘమున నవి చెల్లుబడి యౌనుగాని మన వ్యవస్థలకు పనికిరావు. మన సాహిత్యమున నుపపాదింపబడిన ధర్మముల నాశ్రయించుట చేతనేకదా మన స్త్రీలకు కొన్ని సుగుణములు అలవడునని చెప్పియుంటిమి. ఆధర్మములు పాశ్చాత్యసాహిత్యమున అక్కడక్కడ ఇంచుకించుకగా స్ఫురించును, కాని ఉజ్వలరూపమున కానబడవు. కావున దాని పఠించువారి కా సుగుణము లబ్బవు.