పుట:SaakshiPartIII.djvu/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనము, చేసిన కర్మములఫలము త్యాగ మొనర్పఁగలమా? అందు అకంతస్వార్థపరిత్యాగ ముండవలయును? ఎంతవాఁ డంత పని చేయవలయును? అది గాక సర్వకర్మములఫలము త్యాగ మొనర్పవలయు నని మనము నిశ్చయించు కొనునెడల నొకవిషయముమాత్ర మున్నది; మనకు దుష్కర్మము లన్నియు నొక్కసారి కట్టుపడును. వ్యభిచరించి కృష్ణార్పణ మనఁగలమా? అసత్యమాడి కృష్ణార్పణ మనఁగలమా? తుట్టతుదకుఁ జుట్టఁగాల్చి కృష్ణార్పణ మనఁగలమా? నిష్కామ్యకర్మమును గూర్చి మీ జంఘాలశాస్త్రిగా రిదివర కుపన్యసించియే యున్నారు. అందుచే నింకఁ జెప్పనక్కఱలేదు.

భక్తిమార్గము ప్రకృతి కెంతమాత్రము భిన్నమైన మార్గము కాదు. సహజములైన హృదయరసముల నేమియు శోషింపఁ జేయనక్కఱలేదు. నీభార్యాపుత్రులందు నీకున్న నిశ్చలానురాగ మున్నదే, దానినే భగవంతునిపై బఱపుము. నీ ప్రేమయొక్క గతిమాత్రమే, గమ్యస్థానముమాత్రమే భేదముకాని యంతకంటె భేద మేమియు లేదు. ఒక్కభగవంతుఁడు తక్క నీ వస్తువేదియు లేదని నీవు నిశ్చయముగా నమ్మవలయును. నీయాస్తి భగవంతునిది. నీయాలుబిడ్డలు భగవంతుని వారు. వారు నీయొద్ద భగవంతునిచే నుంపబడినవారు కాని నీవారు కారని నిశ్చయముగా నమ్మవలయును. భగవంతునిపై దృష్టిలేకుండ నొక్క తలఁపైనఁ దలంపకుము; ఒక్కమాటుయైన నాడకుము; ఒక్కపనియైనఁ జేయకుము. అట్టు నిరంతరాభ్యాస మొనర్చునెడల నెప్పటికైన సుగతి నిశ్చయము.

నాయనలారా! చాలసేపు చెప్పితిని. క్షమింపవలయును. శ్లోకములు చదువుచు వాని కర్థములు చెప్పచు బడిపంతులు పిల్లలకుఁ జెప్పినట్టు చెప్పినమాటనే చెప్పితినేమో యని యనుకొనుచున్నాను. నేను మీకు బోధించుటకు రాలేదు. మీకుఁ దెలియని యంశములు కావు. దయ యుంచి వినినందులకు సంతసించుచున్నాను.

ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః.