పుట:SaakshiPartIII.djvu/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బీఠికాపురమును జేరుటకై నిడుదవోలునొద్దరైలుబండిలో నెక్కబోవుచుండఁగఁ, గొందఱు స్త్రీలు పురుషు లొకగదినుండి దిగబోవుచుండిరి. వారు వారిసామగ్రితో దిగినపిమ్మట నేను గదిలోనికిఁ బోయి కూరుచుంటిని. రైలు నడవనారంభించెను. కొంతసేపు కునికిపా టులు పడిపడి పండుకొనుటకై యెంచి లేచి బల్లపైనున్న మెత్తనుత్తరీయముతో దులుపుచుండ గ్రింది మెత్తకును, వెనుకనున్న మరియొక మెత్తకును నడుమనున్న యవకాశ మున నొక కాగితములబొత్తి నాకంటఁ బడినది. దానిని గ్రహించి చూచితిని. అదియొక కాంతారత్నము వ్రాసిన వ్రాఁతవలె నాకు దోచినది. ఈ కాగితములు పోవుటచే నాకాంత యెంత పరితపించుచుండునో యని కొంతసేపు విచారించితిని. ఆ వనితామతల్లి ప్రకటింపనెం చిన యభిప్రాయములను బ్రకటించుటయే మంచిదని నేనూహించుకొని యాకాగితములకుఁ బ్రతివ్రాసి దానిని మీయొద్దకుఁ బంపితిని. మీరు ప్రకటించినయెడల దానిని వ్రాసిన నారీమణి సంతోషించునని నావిశ్వాసము. ఈ క్రిందిదియే దాని ప్రతి.

చిత్తగింపవలయును. పానుగంటి లక్ష్మీనరసింహారావు.

ప్రారంభోపన్యాసము

“సోదరీమణులారా! మీ యందఱతో నొక ముఖ్యాంశమును ముచ్చటింప నెంచి మి మ్మిట కాహ్వానించితిని. ఆయంశము మీతో నెంతకాలము నుండియో చెప్పందలచితిని మీ మనస్సులకు స్పురింపని యంశము నామనస్సున కేల తట్టెనో యని నాకే సందేహముగా నుండుటచే మానివైచితిని. ఇప్ప డన్నిసందేహములను మించిన యాతురత నన్నుఁ బ్రేరేప, నా యభిప్రాయమును మీకు వెల్లడించి హృద్భారమును బాపుకొన నిశ్చయించుకొంటని."

"కాంతలస్థితిగతులు కొంతకాలమునుండి యభివృద్ది దశలో నేయున్నవి. ఇట్టి మనయభివృద్దికి మనమే కారణముకాని మగవాఁడు కాడని లోకమెఱిఁగియే యున్నది. మగవానివలన మేలు జరుగునని మన మెన్నడనుకొనియుండలేదు. ఆతఁడు మనసందర్భమునఁ గేవల నిరుపయోగుఁ డనియే నిశ్చయపఱచితిమి. ఆతఁడు నిరుపయోగుడైన నంతమాత్రమున మనము విచారింపవలసిన పని లేదు. సమర్థతాశూన్యత కంతవ్యము కాని యాతండు మనయభివృద్దికి మొట్టమొదటి నుండియుం బ్రతిబంధకారుఁడై పరమశత్రుఁడై ప్రత్యక్షమారకుండై ప్రవర్తించుటచేతనే మన మాతనిని నిందింపవలసివచ్చినది. ఆతనిపాపమున నాతడే పోవునని మన మూరకుండక మన బానిసతనమునకుఁ బరితపించి, మన విద్యాశూన్యతకు విచారించి, మనవ్యక్తిరాహిత్యమునకు వ్యసనపడి యాతని లక్ష్యపెట్టక, యవసరానుసారముగ నాతని కెదురుతిరిగి, స్వయంకృషిని నమ్మియాత్మ విశ్వాసమును గల్గి, మన పురోభివృద్దికి మన పాటులేవో పడుట చేతనేకదా ప్రొయ్యియొద్ద గుల పొగనడుమ గూల బడవలసిన మన ముపన్యాసపీఠములపై గరతాళముల నడుమ నిలువబ డుచున్నాము! పేఁడనీళ్లతో నట్టిండ్లలికిన మనము నవరసములతో నాటకములను సృష్టించు చున్నాము! పిల్లల తొట్టెలయొద్ద జోలపాటలు పాడిన మనము న్యాయసభలందు ధర్మవాదుము లొనర్చుచున్నాము! లొడితెడు సంసారములో గుడుగుడు గుంచము లాడవలసిన మనము లోకోపకారమునకై భారతదేశమం దంతట బర్యటన మొనర్చుచున్నాము!