పుట:SaakshiPartIII.djvu/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మఱింత పుట్టిమునుక వచ్చినది. ఇది యెందులకు వచ్చినదో యెవ్వఁడెఱుఁగఁడు. ఎంతకాల ముండునో యెవ్వఁ డెఱుఁగడు. ఏమి ప్రతిక్రియ చేయవలయునో యెవ్వఁ డెఱుఁగఁడు. ఇప్పటికిఁగూడ కాఫీహోట లొకటి, సినీమా యొకటి, యీ రెండు వ్యాపారములు మాత్రమే ధనాకర్షణ సమర్ధములై యున్నవి. కాలాచారీ! నీ యభిప్రాయమేమి?

కాలా:- చచ్చిపోవుదు మనియేనా బెంగ? చావకుండ నున్నంత వఱకు బ్రదికియే యుందుముకదా! బ్రతికి యుండంగా జావువిచారమేల? " చచ్చిన తరువాత విచార మసలే యక్కఱలేదు గదా! ఇగ బెంగగొన వలసిన యవస్థయేదో నా కగపడుట లేదు.

వాణీ:- అంతేకాని మద్యావస్థ లేదా?

కాలా:- మద్యావస్థ యనంగాఁ జావునకుఁ బూర్వావస్థయేనా? కొన్నిదినము లారో గ్యము పూర్తిగాజెడి రోగముచేఁ దీసికొను నవస్థయేనా?

వాణీ:- ఔను.

కాలా:- మధ్యావస్థకు సూత్రము మధ్యావస్థ యనునది రెండు భాగములుగా నున్నది. జ్ఞానవంతమైన యవస్థ, జ్ఞానములేని యవస్థ అనఁగా నొడలు తెలియని యవస్థ ఒడలు తెలిసిన యవస్థ ఒడలు తెలిసిన యవస్థలో బ్రదికియున్నా మన్నసంగతి యెఱిఁగియే యుందుము గనుక బ్రతికియుండఁగా విచార మక్కఱలేదన్న సూత్రము పనికే వచ్చును గదా! ఒడలుతెలియని యవస్థలో విచార ముండుట కవకాశమే లేదు గదా!

వాణీ:- ఏడ్చినట్టే యున్నది.

జంఘా:- వాణీదాసా! అతనికిఁదోఁచిన ట్లతడు చెప్పినాడు. అతని నట్టు నిందిం చుట తప్ప కాదా?

వాణీ:- మనలో మనము స్నేహముచే ననుకొన్న మాటలకు లెక్కయేమి?

కాలా:- మనలో మనమే యన్నమాట యక్కఱలేదయ్యా పైవారు నన్నుదిట్టినను నేను దిట్టువాఁడను సరే కదా! తిట్టినట్లు కూడ నే ననుకొనను.

వాణీ:- ఎందుచేత?

కాలా:- దీనికిఁ గూడ నదియే సూత్రము. ఒకడు నన్ను దిట్టుటకు నే నర్హుఁడను గానంతవఱకు పైవారు తిట్టినది నన్ను గానే కాదు కదా. నాకు బాధ యెందులకు? అర్హుడనే యగుదునా ఆతిట్లను వందనములతో నంగీకరింతును. ఏవిధముచేత బాధ కనబడదే.

వాణీ:- ఆచరణమున కక్కఱకు రాని శుష్కాలాపము లాడుచున్నావు. రవంతసేపు పొడుము దొరకకున్న యెడల నీబాధ దేవుడెఱుఁగును,

కాలా:- నీ వెఱుఁగవు కాఁబోలు. పొడుము మానివేసి 3 సంవత్సరము లైనది. చక్రవర్తిగారు డబ్బు లేకపోవుటచేత కాఫీలో పంచదార తగ్గించుకొనినప్పడు నాముక్కు వారి నోటికంటె నెక్కువయాయని యొక్కసారి నస్యవిసర్జన మొనర్చినాను.

వాణీ:- నీపీడ, దేశపు పీడకూడ వదలినది.