నుదుటిపై బెట్టుకొనెను. అందఱు కరతాళము లిచ్చిరి. వధూవరు లన్యోన్యప్రేమ గలిగి సుఖింతురుగాక యని యాశీర్వదించి గది తలుపులు వేసిరి.
ఇంతటినుండి విచిత్రమైనగాథ యారంభమైనది. చిరకాలమునుండి గాఢా శ్లేషమునకై యువ్విళ్లూరుచున్న దంపతులు కలిసి యొకరిపై నొకరు చేయి వైచుకొని, తాంబూలమును వైచుకొని, పండుకొని యురితీసినంత బింకముగా గౌగిలించుకొనిరి. అంతట పుస్తకముల బీరువా ప్రక్కనొక్క నీడ యామెకుఁ గనబడెను. ఏమోయని కొంత సంశయించి బీరువానీడయై యుండునని యూరకుండెను. ఈసారి మిగులగాటముగా ముద్దిడుకొనుచుఁ బ్రమాద మున వెనుకఁజూడఁగా నీడకదలుచున్నట్టుకన బడుచున్నది. కదలుట యేలనని జడిసి యానీడను భర్తకుఁ గనఁబఱచెను. ఆతఁడు చూచి మరేమియులేదు. పండుకొనుమని యామెకన్నులమూసి లేవఁబోవగా వద్దు, వద్దు, నాకక్కఱలేదు. నాపూర్వభర్త స్వరూపమదిగో గొంతు పిసికెద నన్నట్లు సంజ్ఞయొనర్చుచున్నాడని బలవంతముగా నామె లేచికూరు చుండెను. ద్వితీయభర్త కూడ లేచిచూడఁగా నీడయు లేదు. జాడయునుగూడ లేదు. అంత నిద్దఱుగూడ నవ్వుకొనుచుదిరుగ బండుకొని యిట్టు మాటలాడుకొనిరి. నాభర్త దయ్యమైనాఁడు కాఁబోలునని యామె యనంగా దయ్యములు లేవు, భూతములు లేవు. నీహృదయమం దున్న యాతనివిగ్రహము నీయెదుట గాంచుచున్నావు. ఇది మనస్సంబంధ మగు నింద్రజాలము గాని మఱోకటి కాదు. నీవు నాయొద్దం బండుకొనుటతోడనే పూర్వసంస్కారవిశేషమువలన నీభర్తను గాటముగా తలఁచుకొంటివి. అంత నాతనిస్వరూప మును పైనఁ గాంచితివని నూతనభర్త యామెను సమాధానపఱచెను.
గీ. కాతరుఁడు మదిఁ గలపాము గాంచు నెదుట
విరహి యెదుటఁ జూచును లోన వెలయు చెలిని
మెదటిలోని స్వర్గమును కవియెదుటఁ గాంచు
మనసు చూడు మన్నట్టులే కనులు చూచు.
ఈసారి తప్పకుండఁ బండుకొనవలయునని మహోత్సాహమునఁ బ్రయత్నము సల్పగ దిరుగ నానీడయే యిద్దఱకుఁ బ్రత్యక్షమైనది. ఇది యేమియును బాగుగ నున్నది కాదు. దీపమార్పి పండుకొందమని భర్త భార్యతోఁ జెప్పఁగ, నామె యెంతమాత్ర మంగీకరిం పలేదు. నాకు భయము వైచుచున్నది. అక్కడ నేమున్నదో చూచిరమ్మని భార్యభర్తను గోరెను. ఏమియు లేదు పండుకొను మని భర్త బలాత్కార ప్రయత్నమునకు సిద్దము కాఁగా నింతలో నేమయ్యెనో యెవ్వరికిఁ దెలియదు. కాని ఱెప్పపాటు కాలములో గర్బాధానపు బెండ్లికొడుకు చచ్చిపడి యుండెను. ఎట్టు చచ్చినాడో యెవ్వరికిఁ దెలియదు. కెవ్వుమని యింటిక ప్పెగిరి పోవునంత కేకవైచి యాతని భార్య క్రిందఁ బడిపోయెను. గదివెలుపలి వారు భయపడి తలుపుల యుతక లెత్తి లోనఁ బ్రవేశించిరి. ఆమెకుఁ గొంతసేపటికిఁ స్మృతిరాంగ నీసంగతులన్నియు నామెవలనఁ దెలిసినవి. ఈ సంగతి రక్షకభటులకుఁ దెలుపగ, వా రేమో ప్రయత్నించుచున్నారు.
ఇది జరిగిన కథ. దీనిని మీరు ప్రచురించవలయును. చిత్తగించవలయును.
ప్రచురింపవలయునా లేదా యని జంఘాలశాస్త్రి నభవారినడిగెను. పోలీసు విచారణలో