పుట:RangastalaSastramu.djvu/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంసృత రూపలక్షణాలు

ఇన్నిలక్షణాలు ఒకే వ్యక్తిలో విలసిల్లడం వాస్తవానికి విరుద్ధము కావచ్చు. అయితే సంసృత లాక్షణికులు వాస్తవికతకు ప్రాధాన్య మివ్వలేదు. ఆదర్శానికి ప్రధాన్య మిచ్చినారు. రూపకము ప్రజల హృదయాలకు హత్తుకొని, వారిని ప్రభావితులను చేయల్గల శక్తిమంతమైంది. కాబట్టి ఆదర్శనాయకుని జీవతము చిత్రిస్తే, ఆ ఆదర్శాన్ని ప్రేక్షకులు అవలంబిస్తారని సంసృతలాక్షణికుల ఆశయము.

పైన పేర్కొన్న లక్షణాలలో 'సత్కులుడు ' అన్న పదము సామాన్యవాచకమైనా సంస్కృతరూపకనాయకులు ఎక్కువగా దివ్యులు, రాజులు, దివ్యులు: రాముడు, కృష్ణుడు: రాజులు; ద్యుష్యంతుడు, వత్సరాజు, ఆ దివ్యులు కూడా సాధారణంగా రాజులే. ఉదాహరణకు- రాముడు, కృష్ణుడు రాజులే. సంస్కృతంలో రూపకసాహిత్య మెక్కువగా వెలువడిన కాలంనాటికి -- రాజు విష్ణ్వంశ సంభూతుడని ప్రజల విశ్వాసము. అందువల్ల రాజుకు సమాజంలో ప్రాముఖ్యము హెచ్చినది. రాజు గుణగణాదులు, మంచిచెడ్దలు, సుఖదు:ఖాలు, జయాపజయాలు ప్రజాజీవితంమీద తమప్రభావాన్ని ఎక్కువగా ప్రసరింపజేసేవి. రాజువంటి గొప్పవ్యక్తిచరిత్ర ప్రజానీకానికి ఎక్కువ ఆసక్తిదాయకంగా ఉంటుంది. అదువల్లనే సత్కులసంజాతుడు నాయకుడుగా ఉండవలెనని సంస్కృత లాక్షణికులు అనుశాసించినారు. ఈ లక్షణాలు కిలిగిఉన్న నాయకులను సంస్కృతలాక్షణికులు తిరిగి నాలుగువిధాలుగా విభజించినారు.

1.ధీరోదాత్తుడు, 2.ఢీరలలితుడు,
3.ధీరోద్ధతుడు, 4.ధీరశాంతుడు.

అయితే నాయకుడు ఉండే ఆయా అవస్థలను బట్తి నాయకుడు పై లక్షణాలలో ఒకటికాని అంతకన్న ఎక్కువ కాని కలిగిఉంటాడు. భవభూతి పరశురాముని ధీరోదాత్తునిగాను, ధీరోద్ధతునిగాను, ధీరశాంతునిగానుకూడా ఆ యా అవస్థలలొ చిత్రించినాడు. అట్లాగే రాముని ధీరోదాత్తునిగాను, ధీరోద్ధతునిగాను చిత్రించినాడు.

ధీరోదాత్తుడు: ధీరుడు, గంభీరుడు, ఉదారుడు, వినయవంతుడు, ఆరబ్ధ కార్యదక్షుడు అయి ఉండి, ఆత్మస్తుతి, పరనించ, స్తోత్ర ప్రియత్వము మొదలైన దుర్గుణాలకు లొనుకాకుండా, మనసులో సోకక్రోధాలకు చేటీయని నాయకుడు ధీరోదాత్తుడు. ఉదా|| రాముడు, దుష్యంతుడు.