పుట:Ranganatha Ramayanamu.pdf/477

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వికలభూషణరత్నవిసరవికీర్ణ - శకటసైకతకేశజాలకైవాల
జనితచామరఫేనచయరక్తనదులు - వనచరు లనుజులు వడి దాఁటి దాఁటి
తాఁకుదు రాలోనఁ దరుచరు ల్గినిసి- వీఁక గోలెమ్ములు విఱుగ నొక్కియును
మోఁకాళ్ల మోచేత ముష్టి నందంద - తాఁకించి పడదీసి తలలు ద్రొక్కియును
బొట్టలు చీల్చియుఁ బోనీక పట్టి - చట్టలు వాపియుఁ జదియ వ్రేసియును6000
గఱచియు విఱచియుఁ గడకాళ్లు పట్టి - జిఱజిఱఁ ద్రిప్పియుఁ జిదిమివైచియును
బలువిడి దల లొగిఁ బట్టి వెండ్రుకలు - పెళపెళ మనఁ బెల్చఁ బెఱికివైచియును
నిరుచేతులందును నిరువురఁ బట్టి - పొరిఁ బొరి దాటించి పొళ్లు సేయుచును
నెరసి రంధ్రంబుల నెత్తురు ల్వెడల - నురువడిఁ బడఁద్రోచి యురములు సరచి
నఖరదంతంబుల నాసికాకర్ణ - ముఖపాలపట్టిక ల్ముసరి త్రెంచియును
నొప్పించియును గపు ల్నూర్గు రొక్కొకని - నుప్పొంగ యొక్కొకం డొనర నూర్వురను
బట్టి చంపియుఁ జలపట్టి దానవుల - నట్టిట్టు వోనీక యవనిపైఁ గూల్చి
చిందరవందర సేయంగ నప్పు; - డందఱ వెసఁ జూచి యధికరోషమున
ధరణి గంపింప దిక్తటములు పగుల - శరధులు గలఁగ ముజ్జగములు బెగడ
దారుణాకారులై తద్దయుఁ బేర్చి - భేరీమృదంగగంభీరవాద్యములు6010
చెలఁగించి యక్కపిసేనపైఁ గవిసి - బలసూదనాదిదిక్పతులు భీతిల్ల
వికృతమస్తకములు వికృతహస్తములు - వికృతఃప్రకోష్ఠము ల్వికృతోష్ఠములును
వికృతనఖంబులు వికృతముఖములును - వికృతగాత్రములును వికృతనేత్రములు
వికృతహాసములును వికృతనాసములు - వికృతవక్షములును వికృతకక్షములు
వికృతకర్ణములును వికృతవర్ణములు - వికృతపాదములును వికృతనాదములు
గలసైనికులు లయకాలాభ్రపఙ్క్తి - బలువిడి విడివడి పఱతెంచుకరణిఁ
బరిఘగదాచక్రపట్టసప్రాస - పరశుతోమరభిండివాలత్రిశూల
కరపత్రకుంతముద్గరయష్టిపరశు - కరవాలఖేటకక్రకచాసినాగ
ముఖశిలీముఖచాపముసలాయుధాది - నిఖిలసాధనములు నెరయంగఁ బూని
నరికియు నడచియు నలియ మోఁదియును - నురువడిఁ జిమ్మియు నొనరఁ గ్రుమ్మియును6020
వ్రేసియుఁ బొడిచియు వీఁక వైచియును - నేసియుఁ గోసియు నీరీతిఁ గపుల
నొప్పింప నెంతయు నొచ్చి భీతిల్లి - యప్పుడు తరుగిరు లవనిపై వైచి
“మన కేల యుద్ధంబు? మన కేల చలము? - నినకులేశ్వరుఁ డేల? యినసూనుఁ డేల?
యడవిలోఁ గాయపండ్లాకులు నమలి - కడుపు నించుకయుండఁ గానక వచ్చి
మదిమది నిచ్చట మడియంగ నేల? - పదపదం" డని కపిపతులు రాఘవుల
విడిచి ధైర్యంబులు విడిచి రాక్షసులు - విడువక చలమున వెనువెంటఁ దఱుమ
సేతువుదిక్కుకై చెడి పాఱునపుడు - వాతూలసుతనీలవాలినందనులు