పుట:Raajasthaana-Kathaavali.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

రాజస్థానకధావళి

రాజు బఫ్పనిచే పరాజయము నొంది యాశూరశిఖామణికి తన కూఁతు నిచ్చి వివాహము చేసెను. సరదారు లందఱు బప్పనిం జేరఁబిలిచి యారాజు దుష్పరిపాలనము చే దమకు విసువుఁ గలిగెననియు, నందుచే మామను సింహాసనభ్రష్టుని జేసి యల్లుడు గద్దెయెక్కి పాలించిన నుచితముగ నుండు ననియు, నుప దేశించి యట్లు చేయఁ బ్రోత్సాహపరచిరి. బప్పఁడు: నిశ్శంక బిరుదుం డగుటచే సరదారుల సాయమున మేనమామ యని సంశయింపక, ఱేనిం బారఁదోలి రాజ్య మాక్రమించెను. తొల్లి సిద్ధుండు', బప్పని యేకలింగస్వామికి ధర్మకర్తగా నేర్పరచెను, అదిగాక బప్పఁడు హిందూమత ప్రభాకరుఁ డని యును సర్వభూమండలాధీశ్వరుఁ డనియు బిరుదులు గ్రహించెను. అతఁడు చిత్తూరు దేశము చండశాసనుఁ డై చిర కాలము పాలించి రాజ్యము గడువృద్ధి చేసెను. అతఁ డనేక కన్యలను వివాహ మాడెను. అందు ద్వీపాంతరములనుండి వచ్చిన యొకానొక రాజకన్య తనసారెతో నొక దేవీ విగ్రహమును దెచ్చి కోటలో నుంచెను. లోక మాత యగునా దేవి బహుసంవత్సరము లాకోటను సంరక్షించెనఁట. కాని యొక పిరికి రాజు మంచి సమయమున కోటను విడిచి పోయెను. ఆద్వీపాంతరరాజ కన్యక వలన బప్పని కుదయించిననందనుఁడు పితురనంతరమున సింహాసన మెక్కెను. బప్పనిజీవిత మంతయు నెట్టియద్భుతకథలతో నిండి యుండెనో, వాని మరణము నట్టికథలతో నిండి యున్నది. అతఁ డతి వృద్ధుఁ డైన వెనుక "రాజ్యమును, భార్యలను బిడ్డలను విడిచి సేనలం గూర్చుకొని, పశ్చిమ దేశముల పయి దండువిడిసి, చూచిన తా వెల్లఁ జయించుచు, తుట్టతుదకు కొరాసానను మ్లేచ్ఛ దేశముఁ జేరి, యచ్చట నొక రాజ్యము స్థాపించెను, కాశ్మీర, గాంధార, పారశీక ప్రభువులును, కాఫరస్తాను ఇస్పహాను దొరలును, తక్కుంగల పశ్చిమ దేశాధీశ్వరులును వానికి లోబడి కప్పముఁ గట్టిరట. బాల్యమునందుఁబోలె వార్ధకమునందును నతనికి వివాహేచ్ఛ మిక్కుట మగుటఁ జేసి మ్లేచ్ఛ