పుట:Prapancha-Charitra-ThirdPart.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

ప్రపంచ చరిత్ర

కాంస్టాంటినోపులు పతనమైనదినము చరిత్రలో గొప్పదినము. ఒక శక మంతరించి వేరొక శకప్రారంభము నాటినుండి జరిగినదని చెప్పుదురు. మధ్యయుగములు గడచిపోయినవి. వేయి సంవత్సరముల కాలము నిలిచిన అంధకారయుగములు అంతమునకు వచ్చినవి. యూరోపులో నూతన జీవము సూతన శక్తి కనిపించుచున్నది. దానికి చురుకు పుట్టినది. దీనినే పునరుజ్జీవము (రినేసాన్సు -- Renaissance) అందురు. విద్యాకళల పునర్జన్మయే ఇది. దీర్ఘ నిద్రనుండి ప్రజలు మేల్కొన్నట్లు కనిపించారు. శతాబ్దులను దాటి వారిరి చూపు ఉచ్ఛలో నుండిన ప్రాచీన గ్రీకు వైభవముపై వాలినది. అది వారికి మార్గదర్శక మయ్యెను. చర్చి ప్రోత్సహించిన విచారగ్రస్తమగు చీకటిబ్రతుకు అన్నసు, మానవుల ఉత్సాహశక్తిని బంధించు సంకెళ్ళు అన్నను వారి మనస్సులకు కిట్టకుండెను. ప్రాచీన గ్రీకుల సౌందర్య పిపాస మరల తలయెత్తెను. చక్కని చిత్రలేఖనముల తోడను, కల్పముతోడను, వాస్తువు తోడను యూరోపు ఉత్ఫుల్ల మయ్యెను .

కాంస్టాంటినోపులు పతనమగుటతోడనే ఇవన్నియు హఠాత్తుగా కలిగినవని తలచరాదు. అట్లుతలచుట అసంభవము. ఆ నగరమును తురుష్కులు పట్టుకొనుట కారణముగా ప్రజలలో పరివర్తనము చురుకుగా కలిగినది. నగర పతనానంతరము అనేకులు విద్యాధికులూ, విద్యార్థులూ ఆ నగరమును వదలి పశ్చిమముగా ప్రయాణమై వెళ్ళిరి. ఇటలీకి వారు గ్రీసు సారస్వత సౌభాగ్యమును తీసికొనివెళ్లిరి. దానిని మెచ్చుకొను స్థితిలోకూడ పాశ్చాత్యులుండిరి. ఈ విధముగా చూచిన నగరపతనము, పునరుజ్జీవనమునకు కొద్దిగా దారి తీసెనని భావించ వచ్చును.

కాని అట్టి గొప్ప మార్పుకు ఈ కారణము బహు చిన్నకారణమే. ప్రాచీన గ్రీకు సారస్వతమును, భావములును, మధ్యయుగములనాటి