పుట:Prabodha Tarangalul.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొందరి మనస్సులో ఎంతో కాలమునుండి ఉన్న సంశయములకు మరియు ఎన్ని గ్రంథములను చదివినప్పటికి తీరని ప్రశ్నలకు, సూటిగా జవాబు చెప్పినట్లు ఇందులో వాక్యములు గలవు. ప్రతి వాక్యము ఒక క్రొత్త విషయమును తెలుపుచు,కొన్ని ప్రశ్నల సమూహమునకు ఒకే జవాబై ఉన్నది. కొన్ని వాక్యములు ప్రత్యేకించి ఒక్కొక్కటి ఒక గ్రంథ సారాంశము కలిగి ఉన్నవి. అందువలన జ్ఞాన జిజ్ఞాసులకు అధికముగా మేలు చేయునని మేము నమ్ముచున్నాము. మా నుండి చెప్పబడు ప్రతి విషయమునకు శాస్త్రబద్దత ఉండవలెననునది మా ఉద్దేశ్యము. శాస్త్రబద్దత లేని ఎంత గొప్ప విషయమైన అప్పుడు వినేదానికి బాగుండినప్పటికి తర్వాత జీవితములో ఉపయోగపడదు. బత్తాయి (చీనీ) పండు రసము వెంటనే త్రాగుటకు రుచిగ బాగుండును,కానీ ఒక అరగంట తర్వాత చెడిపోయి రుచి మారిపోయి ఉండును. అప్పటికి బాగున్నా భవిష్యత్తులో బత్తాయి రసము త్రాగుటకుపయోగపడదు. తేనె అలాకాక మొదట ఎలాగున్నదో అలాగే ఉండి, ఎంత కాలమైన రుచి మారనిదై ఎలప్పుడు ఉపయోగపడును. ఈ విధముగనే మా బోధలు జీవితములో ఎప్పుడైన ఉపయోగపడునవై ఉండును. విన్నపుడు రుచిగ ఉండి తర్వాత జీవితములో ఉపయోగపడని జ్ఞానవిషయములు కాక, ఎల్లపుడు ఒకే జ్ఞాన సారంశము కల్గి జీవితములో ఉపయోగపడునవే ఈ ప్రబోధ తరంగములని తెల్పుచున్నాము.

ఇట్లు

ఇందూ ధర్మప్రదాత

సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త

శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు