పుట:Prabodha Tarangalul.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

442. కనీసము ప్రపంచ జ్ఞానము కూడ లేకుండ బుద్ధిచెడి త్కిపట్టి మురికిలో తిరుగు వారిని చూచి ప్రజలు వారిని గొప్ప మహాత్ములుగ భావించుచుందురు. అట్టివారిని బుద్ధి ఉన్న తిక్కవారిగ లెక్కించవచ్చును.

443. అవధులులేని పరమాత్మ సమాచారమును తెలుపుటకు వచ్చిన దూతలాంటి వాడే నిజమైన అవధూత.

444. ఒక విషయమును మోసుకొచ్చిన వానిని దూత అందుము. ఎల్లలులేని పరమాత్మ విషయమును మోసుకొచ్చినవాడు నిజమైన గురువు. అటువంటి వానినే అవధూత అనవచ్చును.

445. సంపూర్ణ పరమాత్మ జ్ఞానము తెలిసినవాడు గురువు లేక అవధూత. కాని ఏజ్ఞానము లేని పిచ్చివాడు అవధూత కాలేడు.

446. దేవుడు మనుషులను తయారు చేశాడు, కానీ కులములను తయారుచేయలేదు.

447. చాతుర్వర్ణ మయా సృష్టమ్‌ అని గీతలో దేవుడు చెప్పితే నాలుగు వర్ణములను నాలుగు కులముగ ఎందుకనుకోవాలి?

448. ఇతర దేశములో లేని కులములు ఈ దేశములోనే ఎందుకున్నాయంటే జవాబులేదు.

449. గుణములున్నవి మూడు, గుణములు లేనిది ఒకటిని కలిపి నాలుగువర్ణములని దేవుడు అంటే గుణములతో సంబంధములేని కులములను మానవుడు పెట్టుకొన్నాడు.

450. పుట్టుకలో కులము లేదు, చావులో కులము లేదు. కానీ పుట్టుకలో గుణమున్నది, చావులో కూడ గుణమున్నది.