పుట:Prabodha Tarangalul.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28. నీతి, న్యాయము బాహ్యోన్నతికి, జ్ఞాన, ధర్మము ఆత్మోన్నతికి దోహదము చేస్తాయి.

29. మాయ బయటున్నదని భావించకు. అది నీలోనే ఉన్నది. మాయలోపడుట బయటకాదు నీ తలలోనేయని తెలుసుకో.

30. అపరిమిత వేగముతో తిరిగే నీ మనస్సును స్వాధీనము చేసుకో ఆత్మయంటే ఏమిటో అర్థమౌతుంది.

31. మతాలు, కులాలు మానవులు నిర్మించుకొన్నవే కాని మహాత్ములు నిర్మించినవి కావు.

32. దేహ భావమే మాయపాశము. దేహి భావమే దివ్యజ్ఞానము.

33. సర్వజీవి సమన్వయమౌ శాస్త్రమును బోధించునతడే జగద్గురువు.

34. గారడిలాంటి విద్యలజూచి జ్ఞానమనుకోవడము, ఎండమావులను చూచి నీరనుకోవడము రెండూ ఒక్కటే.

35. కర్మచేత గుణములు, గుణములచేత మనస్సు, మనస్సుచేత శరీరము చలించుచుండును. అది తెలియకపోతే అజ్ఞానమే అగును.

36. బాహ్య సంసార వ్యామోహమను మధుపాన మత్తునకు సత్యాన్ని తెలుసుకొనే సత్తా ఎక్కడిది?

37. అడ్డాలు తిరిగే మనస్సును అరికట్టక, గడ్డాలు పెంచి తిరిగినా కర్మ తొలగదు.

38. ఉన్నత జ్ఞానం నీలో ఉత్పన్నము చేసుకొనకనే ఉపదేశము కావాలని ఉబలాటపడకు. ఉపదేశాన్ని భరించే శక్తి నీ హృదయానికున్నప్పుడే ఆ ఉపదేశము సిద్ధిస్తుంది.