పుట:Prabandha-Ratnaavali.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12 ప్రబంధరత్నావళి

గీ. తా ననంగుఁ డట్టివాని యలంచుట
యేమి? యతనికడిమి యేమి? యతని
బీర మేమి? ధరణిఁ బిచ్చుక [1]యలుకేమి
వాలఁగ ... ... ... నేమి వాలుఁగంటి[?] (జ) 54

సీ. మదవతీగండూషమదిరాభిషేచన వడి నంకురించిన వకుళములును
నతివల మృదుపాదహతినూత్నకోరక స్ఫురణఁ గైకొన్న యశోకములను
సుదతుల క్రేగంటిచూడ్కిపైఁ బాఱినఁ దిలకించి యలరిన తిలకములను
నన్నుల నెవ్వీఁగుఁ జన్నుల సోఁకునఁ గొమరొంది ననిచిన కురవకముల
ఆ. నెరగఁ జరణములను నెఱకలు విఱిసిన
మొగడలందునుండి మొఱయు తేఁటి
కొదమ లెలమిఁ బొంది ఘూర్ణిల్ల నధికవి
భూతిఁ దనరు చూతపోతములను. (ఆం) 55

చ. మరలఁగఁ బోదు రిండ్లకును మా పవునంతకుఁ జేలలోపలం
దిరిగి యొకింత లేఁతవడఁదేరెడు మోములఁ జెన్ను సేయుచున్
బిరిగొని క్రాలు దృగ్రుచుల పెల్లునఁ జీఁకటి నెల్లఁ బాచినం
దెరువరు లర్థిఁ గూడఁ బఱతేరఁగఁ బామరభామినీజనుల్. (ఆం) 56

శా. ముత్తా కేకుజము ల్సడల్చె? మొగడ ల్మున్నేమహీజంబులం
దొత్తెం? బువ్వులు నిండఁగాఁ బెరిఁగె నే యుర్వీజముల్? పూఁపలన్
మొత్తంబై విలసిల్లె నే ధరణిజంబుల్? కాయలం బండులం
జిత్తానందముఁ జేర్చి నేక్షి తిజముల్ చెల్వొందఁగాఁ జెప్పుమా! (ఆం) 57

క. మొగములు విరిదమ్ములఁ గుచ
యుగములు గోకములఁ జూడ్కు లుత్పలముల మం
దగతులు హంసలఁ దోల న
రుగుగతిఁ జొచ్చిరి సతు ల్సరోవర మెలమిన్. (ఆం) 58

తే. వామనానేకపము చక్రవాళకుధర
ధాతుతటము గోరాడుచోఁ దరులు విఱిగి
కూలుటయు మింటి కెగసెడు ధూళివోలెఁ
బర్వె నెఱసంజ పడుమఱ పట్టుకొనుచు. (ఆం) 59

  1. పా. యులుమేమి