పుట:Parama yaugi vilaasamu (1928).pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

278

పరమయోగివిలాసము.


మలగొన్న సంపంగిమ్రాకులు గడచి
చలిమించు పుష్పమంజరుల వీడ్కొనుచుఁ
బొదలినగొజ్జంగిపొదరిండ్లు దూరి
ముదమున వనమధ్యమునకు నేతెంచి
పన్నీటియివముకప్రముమీఁదిచలువ
వెన్నెలలో సీతు వెడనవ్వికొనుచు
మట్టమై తలిరుజొంపములలో నొక్క
పుట్టమై లో నెండ పొడవడకుండఁ
దలిరించి కడు నివతాళించు నొక్క
యెలమావిక్రిందటి కేతెంచి నిలిచి
యాచల్లగాలియు నాతోఁటసొబగు
చూచి హా యని సొక్కుచును దేవదేవి
యనుఁగుఁజేడియలెల్ల నందంద కొలువఁ
దనయగ్రజాత నత్తఱిఁ జూచి పలికె
నోయక్క కంటివే యొకయెంతవింత
యీయెడ విరహులయెదలు బిట్టగల
జలజాస్త్రుఁ డడిదముల్ జళిపించినట్లు
చిలుపగాలికి మావిచిగురు లల్లాడె
నమలనానాప్రసూనార్ఘ్యసంతతుల
రమణీయవివిధమరందపాద్యములఁ