ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మాటలకు ఆమె బెబ్బులి రొదవిన్నలేడి అయింది. చేష్టలు తక్కి మూర్చ పొయింది. అప్పుడు శ్రీకృష్ణుడు మృదు మధుర భాషణములతో ఆమెను అనునయిస్తాడు. దురుక్తక్రూర నరాచశోషణముల నుండి ఆమె అందుతో తేరుకుని అతనిని కొని యాడుతుంది. నీవు పతివ్రతామణివి. నాసేవనమేకాని నీవు అన్యం ఎఱుగవు. నీభావం ఎఱిగి ఉండిన్నీ ఇట్లా అన్ననాతప్పు మన్నించు అని కృష్ణుడు అంటాడు.
ఈ ఉదంతం రుక్మిణి ఉపాదేయురాలు కావడం తెలియచేస్తూ ఉంది. ఈమె పూజ్యురాలు. ఈ దినం ఆమె పూజకు ఉద్దిష్టమైంది.
చైత్రశుద్ధ ద్వాదశి
స్మృతికౌస్తుభము దీనిని విష్ణుదమనోత్సవమనీ, నీలమతపురాణము దీనిని వాసుదేవార్చన మనీ అంటున్నాయి. మన పంచాంగకర్తలు మాత్రము ఈనాటి వివరణములో నామనద్వాదశి అని వ్రాస్తారు.
వామనుని అయినా, విష్ణువును అయినా, వాసుదేవుణ్ణి అయినా ఈ రోజున దమనంతో పూజ చేయాలి. దమన పూజముఖ్యము దేవుణ్ణి ఏ పేరుతో పేర్కొన్నా సరే అని ఊహింపవచ్చును. ఈనాడు భాతృప్రాప్తి వ్రతం చేస్తారని చర్వర్గ చింతామణి. ద్వాదశి గొప్ప తిధులలో ఒకటి. ఈ తిధి గొప్పతనాన్ని గురించి పద్మపురాణంలో కొంత ప్రస్తావన ఉంది. ఏకాదశి తిధి విషయములో ఆ పురాణం చెప్పిన విషయాలు తెలిసికొని ఉన్నాము. ఇప్పుడు ద్వాదశి తిధి విషయం పద్మ పురాణ కధనం తెలిసి కొందాము.
క్షీరసాగరమధనం ఏకాదశినాడు సాగింది. ఆనాడు దేవతలు ఉపవాసం ఉన్నారు. పాలసముద్రము మధింపగా మొదట కాలకూటం పుట్టింది. దానిని శివుడు మింగిలోకాన్ని రక్షించాడు. ఆమీద ఎర్ర బట్టలతో జ్యేష్ఠాదేవి పుట్టింది. ఆశుభాంవిత అగు ఆమెను కలిరాజునకు ఇచ్చారు. ఆమీద పాలసముద్రాన్ని మళ్లీ తఱచగా వారుణీదేవి పుట్టింది. ఆమెను శేషునకు ఇచ్చారు. తరువాత సౌవర్ణి జన్మించింది. ఆమె గరుడునికి భార్య అయింది. ఆ మీద అప్సరస్త్రీలు, గందర్వులు, ఐరావతము, ఉచ్చైశ్ర్వవం, దన్వంతరి, పారిజాతము, కామధేనువు క్రమంగా పుట్టాయి. వానిని ఇంద్రునకు ఇచ్చారు. ఇంతలో ఏకాదశి తిధి అయిపోయింది. ద్వాదశి తిధి ప్రారంభమైంది.