పుట:PadabhamdhaParijathamu.djvu/471

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాన్పి____కాపి 445 కాపు____కాపు

  • "కృప దలిర్పంగ గాన్పించె గేశవుండు." కళా. 2. 98.

కాన్పించుకొను

  • చూచు.
  • ఇది రాయలసీమలో నేటికీ వినవస్తుంది.
  • "పాణిపాద ప్రక్షాళ నాచమనా నంతరంబ యతనిం గాన్పించుకొని." ఆము. 4. 199.
  • "ఆ ఊరికి ఎటూ పోతున్నావు. కొంచెం ఆ రెడ్డిగారిని కనిపించుకొని రా." వా.

కాన్పు కెక్కు

  • పేరు కెక్కు.
  • "మరుమర్లుదీ గెలో మంజు సౌదామనీ ఖండంబులో యన గాన్పు కెక్కి." శ్రీరాధా. 4. 151.

కాన్పు చేయు

  • ప్రసవసమయమున సాయపడు.
  • "కాన్పు చేయడానికి మా అమ్మను రమ్మని ఉత్తరం రాశి ఉన్నాము." వా.
  • "ఆ మంత్రసాని ఎన్నివందల కాన్పులు చేసిందో ఏమో? ఇప్పుడు చేయ లేక పోతుందా?" వా.

కాన్పు నడుపు

  • కాన్పు చేయు.
  • "చెల్వుగ బిడ్డ కాన్పు నడిపెన్ వామాక్షి బాలింత యై." కా. మా. 410.

కాపిడు

  • కాపుదల పెట్టు; కావలి పెట్టు.
  • "పవ లెల్ల లోపల జొరకుండ గాపిడి." పండితా. ప్రథ. పురా. పుట. 380.

కాపుండు

  • కాపుర ముండు.
  • "ఇప్పురంబున గాపుండ కితర మైన, పురమునం దేల నిల్చె నిర్జరవిభుండు." హర. 7. 177.
  • "అల పన్నిద్దఱు నూరులందును సముద్యల్లీల గా పున్న వె, గ్గలపుం దాపము బాప నా..." ఆము. 1. 10.

కాపురము నారడి పుచ్చు

  • కాపురము చెడగొట్టు.
  • "అక్కట! భర్త గాపురము నాఱడి పుచ్చి నృపాలమౌళితో..." హంస. 1. 124.

కాపురములు కూల్చు

  • కొంప లార్పు.
  • "జార! యెన్ని, కాపురంబులు గూల్చితో కద యటంచు, బలుక నా వంటి వా డిందు గలిగె ననుచు." శుక. 3. 201.
  • "వా డీసరికి ఎన్ని కాపురాలు కూల్చాడో? వీళ్లింటికి ఎసరు పెట్టాడు." వా.

కాపురము సేయు

  • నివసించు.
  • "ఆ పురమునందు జేయుం గాపురము." నిరంకు. 1. 556.

కాపుర మెత్తిపోవు

  • కాపురము పా డగు. ఇది నేడూ రాయలసీమలో వ్యవహారంలో ఉన్న పలుకుబడి.